state of emergency
-
అమెరికాలో ‘హిల్లరీ’ బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిల్లరీ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ధాటికి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోరి్నయాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు. తుపాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవెడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుపాను వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై సర్వే ప్రారంభించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే డెత్ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడం గమనార్హం. మరోవైపు దక్షిణ కాలిఫోరి్నయాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి ఈశాన్య దిక్కున ఆదివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్ఏంజెలెస్ నగర సమీపంలో భూమి రెండుసార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు. -
చైనా: కరువుపై మేఘమథన అస్త్రం!
చాంగ్కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. -
Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగింపు
కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో సాదారణ స్థితికి వచ్చేలా కనిపించటం లేదు. ఇటీవలే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయన పదవి చేపట్టిన క్రమంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. నిరసనకారుల టెంట్లను తొలగించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. తాజాగా.. దేశంలో ఎమర్జెన్సీని మరో నెల రోజుల పాటు పొడిగించింది విక్రమ సింఘే ప్రభుత్వం. అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది ఆ దేశ పార్లమెంట్. దీనిపై ఓటింగ్ చేపట్టగా 120 మంది అనుకూలంగా ఓటు వేశారు. 63 మంది చట్టసభ్యులు వ్యతిరేకించారు. ప్రజాభద్రత, నిరాటంకంగా నిత్యావసరాల సరఫరా వంటి అంశాలను చూపుతూ జులై 18న దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రణీల్ విక్రమ సింఘే. ఆ ఆర్డినెన్స్‌కు 14 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం తెలపకపోతే అది రద్దవుతుంది. కానీ, తాజాగా పార్లెమెంట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో మరో నెల రోజుల పాటు దేశంలో అత్యవసర స్థితి అమలులో ఉండనుంది. సింగపూర్‌లో మరో 14 రోజులు గొటబయ.. ప్రజాగ్రహంతో దేశం విడిచి సింగపూర్ పారిపోయారు శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. జులై 14న మాల్దీవుల నుంచి సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయనకు 14 రోజుల పర్యటక పాస్‌ను ఇచ్చింది ఆ దేశం. అయితే.. సమయం ముగియనుండటంతో మరో 14 రోజులు పొడిగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆగస్టు 11 వరకు గొటబయ సింగపూర్‌లో ఉండనున్నారని తెలిపింది. మరోవైపు.. సింగపూర్ నుంచి గొటబయ తిరిగి వస్తారని రెండు రోజుల క్రితం శ్రీలంక కేబినెట్ ప్రతినిధి బందులా గునవర్ధనే పేర్కొనటం గమనార్హం. సింగపూర్ వెళ్లిన తర్వాత ఓ హోటల్లో బస చేసిన గొటబయ.. ప్రస్తుతం ప్రైవేట్ ఇంటికి మారినట్లు సమాచారం. ఇదీ చదవండి: Volodymyr Zelensky: భార్య ఒలేనాతో జెలెన్స్కీ పోజులు.. నెటిజన్ల విమర్శలు -
Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటన
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ.. మరోమారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే. దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు విక్రమ సింఘే. 1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్(చాప్టర్ 40)లోని సెక్షన్ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జులై 18 నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రజానిరసనల నడుమ శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది మూడోసారి. ఇదీ చదవండి: శ్రీలంక ఆందోళనలకు 100 రోజులు.. సమస్య సద్దుమణిగేనా? -
బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రభుత్వం రాజధాని బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ప్రధానమంత్రి గద్దె దిగాలనీ, దేశంలో రాజ కుటుంబం పెత్తనం తొలగించి, ప్రజాస్వామ్య సంస్కరణలు తేవాలంటూ బుధవారం విద్యార్థులు రాజ ప్రాసాదానికి సమీపంలో నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజ కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించేందుకు యత్నించారు. దీనిపై ఆగ్రహించిన ప్రభుత్వం ఈ అనూహ్య చర్యకు పూనుకుంది. ‘రాజ కుటుంబం వాహనాలకు అవరోధం కలిగించడం వంటి వివిధ మార్గాల్లో అవాంఛనీయ ఘటనలను, ఉద్యమాలను ప్రేరేపించడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించాయి’అని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితి ప్రకటన అనంతరం రాజధాని వీధుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపించారు. గురువారం వేకువజాము నుంచే పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రయుత్ చన్ ఓచా నివాసం ఎదుట నిరసనలను కొనసాగిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదర్శనలపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ తాజా అరెస్టులకు నిరసనగా బ్యాంకాక్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. ప్రధాని రాజీనామా చేయాలని, అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. థాయ్ చట్టాల ప్రకారం రాజు పూజనీయుడు. రాజు, రాజకుటుంబాన్ని బహిరంగంగా ప్రశ్నించినా, విమర్శించినా శిక్షలు కఠినంగా ఉంటాయి. -
పెరుగుతున్న కేసులు.. ఎమర్జెన్సీకి అవకాశం
టోక్యో : జపాన్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశ రాజధానిలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని షింజో అబే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రేపు(మంగళవారం) స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ జపనీస్ పత్రిక మొమియురి పేర్కొంది. ఈ సోమవారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తారని తెలిపింది. బుధవారం రోజున కరోనాను అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలను తెరపైకి తేనున్నట్లు న్యూస్ ఏజెన్సీ క్యోడో తెలిపింది. కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు పేర్కొంది. ( కరోనా: ఎక్కడ చూసినా శవాలే! ) కొద్దిరోజుల క్రితం టోక్యో గవర్నర్ యురికో కొయికే మాట్లాడుతూ.. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీకి సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ కారణంగా దేశ ప్రజలు కచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, జపాన్ ఇప్పటివరకు 3,500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. రాజధాని టోక్యోలో దాదాపు 1000 పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం. ( భారత్‌లో 4వేలు దాటిన కరోనా కేసులు ) -
ముదిరిన సంక్షోభం.. మాల్దీవుల్లో ఎమర్జెన్సీ
మాలే: హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. తాజాగా అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. రానున్న 15 రోజులపాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రకటించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొన్న 12 మంది ఎంపీలను మళ్లీ పదవుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధ్యక్షుడు యమీన్ పాటించకపోవడంతో దేశంలో రాజకీయ ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆందోళనలతో మాల్దీవులు అట్టుడుకుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు యమీన్ ఎమర్జెన్సీ విధించారు. అధ్యక్షుడు యమీన్‌ను అభిశంసించేలా మాల్దీవుల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకూడదంటూ పోలీసులు, భద్రతా దళాలను ప్రభుత్వం తాజాగా ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో యమీన్ 9 మంది అసమ్మతి నేతలను జైలులో పెట్టించారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లిన మరో 12 మందిపై అనర్హత వేటు వేశారు. జైలులో ఉన్న 9 మందిని విడుదల చేయాలని, అలాగే, 12 మంది సభ్యులపై అనర్హతను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ ఆదేశాలను పాటించడానికి అధ్యక్షుడు యమీన్ అంగీకరించకపోవడంతో దేశంలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి.. ఎమర్జెన్సీకి దారితీసింది. -
అమెరికా నగరంలో ఎమర్జెన్సీ
షార్లట్: అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఉన్న షార్లట్ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు. పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుడి మృతి చెందడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. మంగళవారం పోలీసు అధికారి బ్రింట్లీ విన్సెంట్ జరిపిన కాల్పుల్లో 43ఏళ్ల కీత్ లామంట్ స్కాట్ మృతి చెందడంతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. వరుసగా రెండో రోజు ఆందోళనలతో షార్లట్ అట్టుడికింది. దీంతో షార్లట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో షార్లట్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఉత్తర కరోలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ ప్రకటించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. ఆందోళనకారులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. షార్లట్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు చేపట్టామని మేయర్ జెన్నిఫర్ రాబర్ట్స్ తెలిపారు. ఆందోళనకారులు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, పోలీసు కాల్పుల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపడతామని హామీయిచ్చారు. -
గబ్బిలాలు ఆ ఊరిని ఆక్రమించాయి!
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ పట్టణంలోని ఓ తీర ప్రాంతం గబ్బిలాల సామ్రాజ్యంగా మారింది. వాటి కారణంగా అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల దైనందిన కార్యకలాపాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పదకొండు వేల జనాభా ఉన్న ఈ తీర ప్రాంతంలో దాదాపు ఒక లక్ష కు పైగా గబ్బిలాలు అక్కడి చెట్లను తమ నివాసాలుగా మార్చుకోవడంతో ఆ తీర ప్రాంత పట్టణాన్ని 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ'గా ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. ఈ గబ్బిలాల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతుండటంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వాటన్నింటిని అక్కడి నుంచి ఖాళీ చేయించే పనిలో పడ్డారు. గబ్బిలాలు ఎక్కువగా ఉండటంతో కనీసం ఇంటి కిటికీలు తెరవలేకపోతున్నామని.. అవి చేసే శబ్దాన్ని భరించలేకపోతున్నామని అక్కడి వాసులు వాపోతున్నారు. దాదాపు ఆస్ట్రేలియాలో నివసించే గ్రే-హెడ్ గబ్బిలాల్లో నాలుగింట ఒకటి ఇక్కడ నివసిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ జాతికి చెందిన గబ్బిలాలు అంతరించిపోయే దశలో ఉండటంతో వాటిని అధికారుల చంపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ పట్టణంలో ఉన్న చెట్లన్నింటినీ నరికేసే పనిలో పడ్డారు. -
గబ్బిలాల దండయాత్రతో సిటీలో ఎమర్జెన్సీ!
లక్ష గబ్బిలాలు ఒక్కసారిగా నగరంపై దండయాత్ర చేస్తే ఎలా ఉంటుంది. హర్రర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది కదా! ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ రాష్ట్రంలోని బాటెమన్స్ బే నగరంపై ఒక్కసారిగా గబ్బిలాలు విరుచుకుపడ్డాయి. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని విధించారు. నగరంలోని ప్రతి చెట్టుకూ, ప్రతి ఇంటికి పైకప్పునకు గబ్బిలాలు కుప్పలుతెప్పలుగా వేలాడుతుండటంతో అధికారులు బాటెమన్స్ బే వాసులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని, తలుపులు, కిటికీలు మూసుకొని భద్రంగా ఉండాలని సూచించారు. గబ్బిలాల రాకతో పట్టణమంతా గందరగోళంగా మారిపోయింది. 'నేను కిటికీ తలుపులు తీయలేని పరిస్థితి నెలకొని ఉంది. తడి దుస్తులు ఆరుబయట ఆరేద్దామన్న వీలుకావడం లేదు. గబ్బిలాలు చేసే రోదతో ఇంట్లో ప్రశాంతంగా ఉందామన్నా, చదువుకుందామన్నా కుదరడం లేదు' అని డానియెల్ స్మిత్ వాపోయాడు. నగరంలోని ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఫ్లయింగ్ ఫాక్స్ టాస్క్ ఫోర్స్.. 'గతంలో ఎన్నడూ ఊహించని విపత్కర పరిస్థితి ఇది. ఇంత పెద్దమొత్తంలో గబ్బిలాలు రావడం గతంలో ఎన్నడూ చూడలేదు' అని ఒక ప్రకటనలో పేర్కొంది. గబ్బిలాలు అంతరించిపోయే ప్రాణులు జాబితాలో ఉండటంతో అధికారులు వాటిని చంపలేని పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పొగపెట్టి, శబ్దాలు చేస్తూ వాటిని తరిమేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.