
చాంగ్‌కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది.
ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment