మాలే: హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశమైన మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. తాజాగా అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. రానున్న 15 రోజులపాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రకటించారు.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొన్న 12 మంది ఎంపీలను మళ్లీ పదవుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధ్యక్షుడు యమీన్ పాటించకపోవడంతో దేశంలో రాజకీయ ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆందోళనలతో మాల్దీవులు అట్టుడుకుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు యమీన్ ఎమర్జెన్సీ విధించారు.
అధ్యక్షుడు యమీన్‌ను అభిశంసించేలా మాల్దీవుల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకూడదంటూ పోలీసులు, భద్రతా దళాలను ప్రభుత్వం తాజాగా ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో యమీన్ 9 మంది అసమ్మతి నేతలను జైలులో పెట్టించారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లిన మరో 12 మందిపై అనర్హత వేటు వేశారు. జైలులో ఉన్న 9 మందిని విడుదల చేయాలని, అలాగే, 12 మంది సభ్యులపై అనర్హతను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ ఆదేశాలను పాటించడానికి అధ్యక్షుడు యమీన్ అంగీకరించకపోవడంతో దేశంలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చి.. ఎమర్జెన్సీకి దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment