
అమెరికా నగరంలో ఎమర్జెన్సీ
అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఉన్న షార్లట్ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు.
షార్లట్: అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఉన్న షార్లట్ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు. పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుడి మృతి చెందడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. మంగళవారం పోలీసు అధికారి బ్రింట్లీ విన్సెంట్ జరిపిన కాల్పుల్లో 43ఏళ్ల కీత్ లామంట్ స్కాట్ మృతి చెందడంతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. వరుసగా రెండో రోజు ఆందోళనలతో షార్లట్ అట్టుడికింది. దీంతో షార్లట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో షార్లట్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఉత్తర కరోలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ ప్రకటించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. ఆందోళనకారులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. షార్లట్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు చేపట్టామని మేయర్ జెన్నిఫర్ రాబర్ట్స్ తెలిపారు. ఆందోళనకారులు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, పోలీసు కాల్పుల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపడతామని హామీయిచ్చారు.