నార్త్ కరోలినా : అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. చార్లెట్ క్యాంపస్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అకడమిక్ ఇయర్ ముగింపు రోజే యూనివర్సిటీలో ఈ ఘటన చోటుసుకుంది. ఇందుకు బాధ్యుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారమివ్వడంతో పాటుగా.. విద్యార్థులను వెంటనే అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘పరుగెత్తండి, దాక్కోండి, ఫైట్ చేయండి. మిమ్మల్ని కాపాడుకోండి. క్యాంపస్‌లో కాల్పులు జరిగినందు వల్ల పోలీసులు అన్ని బిల్డింగ్‌లలో దుండగుడి కోసం అన్వేషిస్తున్నారు’ అంటూ క్యాంపస్ ఎమర్జెన్సీ ఆఫీస్ ట్వీట్ చేసింది.
ఈ విషయం గురించి ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘నాతో పాటు మరో 30 మంది ఫిల్మ్ క్లాసులో ఉన్నాం. అప్పుడు ఓ విద్యార్థి పరిగెత్తుకు వచ్చి క్యాంపస్‌లో కాల్పులు జరుగుతున్నాయని చెప్పాడు. అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. షాక్ అయ్యాను. వెంటనే అప్రమత్తమై మేమందరం లోపల నుంచి లాక్‌చేసుకున్నాం. ఇక అప్పటి నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు నా తల్లిదండ్రులకు మెసేజ్ చేస్తూనే ఉన్నాను. దాదాపు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మమ్మల్ని గది నుంచి బయటికి రావాల్సిందిగా చెప్పారు భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు యూఎన్‌సీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ హ్యారీ స్మిత్ పేర్కొన్నారు. చార్లెట్‌లో క్యాంపస్‌లో చోటుచేసుకున్న ఈ హింస తమను తీవ్రంగా కలచివేసిందని, మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment