గబ్బిలాలు ఆ ఊరిని ఆక్రమించాయి!
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ పట్టణంలోని ఓ తీర ప్రాంతం గబ్బిలాల సామ్రాజ్యంగా మారింది. వాటి కారణంగా అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల దైనందిన కార్యకలాపాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పదకొండు వేల జనాభా ఉన్న ఈ తీర ప్రాంతంలో దాదాపు ఒక లక్ష కు పైగా గబ్బిలాలు అక్కడి చెట్లను తమ నివాసాలుగా మార్చుకోవడంతో ఆ తీర ప్రాంత పట్టణాన్ని 'స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ'గా ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు.
ఈ గబ్బిలాల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతుండటంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వాటన్నింటిని అక్కడి నుంచి ఖాళీ చేయించే పనిలో పడ్డారు. గబ్బిలాలు ఎక్కువగా ఉండటంతో కనీసం ఇంటి కిటికీలు తెరవలేకపోతున్నామని.. అవి చేసే శబ్దాన్ని భరించలేకపోతున్నామని అక్కడి వాసులు వాపోతున్నారు. దాదాపు ఆస్ట్రేలియాలో నివసించే గ్రే-హెడ్ గబ్బిలాల్లో నాలుగింట ఒకటి ఇక్కడ నివసిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ జాతికి చెందిన గబ్బిలాలు అంతరించిపోయే దశలో ఉండటంతో వాటిని అధికారుల చంపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ పట్టణంలో ఉన్న చెట్లన్నింటినీ నరికేసే పనిలో పడ్డారు.