
వ్యాయామాల అన్నింటిలోనూ అత్యుత్తమమైనది సైకిలింగ్. ఆరోగ్యానికీ ఇది ఎంతో మంచిది. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు పర్యావరణ కాలుష్యం పట్ల పెరుగుతున్న అవగాహన వెరసి హైదరాబాద్‌నగర వాసుల్లో సైక్లింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు వారాంతాల్లో గ్రూపులుగా మారి సైకిలింగ్ చేయడం ప్రస్తుతం హాబీగా మారింది. ఈ అలవాటు క్రమంగా విస్తరిస్తోంది.
దీంతో విభిన్న రకాల సంస్థలు సైక్లిస్ట్‌ల కోసం రైడ్స్ నిర్వహిస్తుండడంతో తెలంగాణలోని హైదరాబాద్ నగరవాసులు భాగ్యనగర వీధుల నుంచి విదేశీ విహారాల వరకూ రైయ్ రైయ్ మంటూ సైకిల్‌పై సవారీ చేస్తున్నారు. ఎడా పెడా దూసుకొచ్చే బైక్స్, కార్స్, ఆటోల మధ్య తాదూరే సందు.. లేదు మెడకో డోలు అన్నట్టు ఉంది..భాగ్యనగరంలో సైకిల్ సవారీ.
సరదా ఉంది కదా అని కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ప్రత్యేక ట్రాక్స్ వెతుక్కోవాల్సిందే తప్ప.. నగర రోడ్లపై పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
నగరంలో సైకిల్ ట్రాక్స్ ఉన్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో సైక్లిస్ట్స్ రైడింగ్ కోసం ప్రత్యేక మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. ఈ క్రమంలోనే సైకిల్‌పై లాంగ్ జర్నీ చేయాలనుకునే నగరవాసుల కోసం విభిన్న రకాల రైడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.
నైట్.. రైట్..
ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి వారాంతపు సెలవుదినాలను ఎంచుకుంటున్నారు ఎక్కువ మంది సైక్లిస్ట్‌లు. తమ హాబీని ఎంజాయ్ చేయడం కోసం.. మరింత సౌకర్యంగా వీధుల్లో విహరించాలని రాత్రి సమయాల్లో జాయ్ రైడ్స్‌కి జై కొడుతున్నారు. ‘పగలు ట్రాఫిక్ రద్దీతో పాటు పొల్యూషన్ కూడా ఎక్కువ. అందుకే వీలైనంత వరకూ రాత్రిపూట సైక్లింగ్ చేస్తా’ అని చెప్పారు ఐటీ ఉద్యోగి సౌరభ్.
సాధారణంగా ఈ నైట్ రైడ్స్ రాత్రి 7గంటల ప్రాంతంలో మొదలై పరిస్థితులు, పాల్గొన్నవారి ఆసక్తిని బట్టి.. 10 నుంచి 12గంటల వరకూ కొనసాగుతున్నాయి. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రైడ్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రసిద్ధ క్రీడా పరికరాల ఉత్పత్తి కంపెనీ డెకథ్లాన్ ప్రతినిధి చరణ్ తెలిపారు.
బ్రేక్‌ఫాస్ట్ రైడ్స్ షురూ..
నగరంలో ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉండే ఉదయపు వేళల్లో బ్రేక్ ఫాస్ట్ రైడ్స్ షురూ అయ్యాయి. తెల్లవారుజామున మొదలై ఉదయం 8–9 గంటల లోపు ముగిసిపోయే ఈ తరహా రైడ్ పూర్తయిన అనంతరం ఏదైనా ప్రత్యేక రెస్టారెంట్ లేదా దాబాల్లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు.
‘ఒకప్పుడు జిమ్‌లో కార్డియో వ్యాయామంలో భాగంగా ఎక్కువ సైకిల్ తొక్కేదానిని. అయితే దాని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వైద్యుల సూచన మేరకు రోడ్స్ మీద సైక్లింగ్‌ను ఎంచుకున్నా’ అని సైక్లిస్ట్ నీలిమారాణి చెప్పారు.
సుదూర ప్రాంతాలకూ రెడీ..
సైక్లింగ్‌పై ఉన్న ఇష్టం నగరవాసులను దూరాభారం లెక్కజేయనీయడం లేదు. నగరం నుంచి విభిన్న ప్రాంతాలకు లాంగ్‌రైడ్స్‌కూ వెనుకాడడం లేదు. ఈ విషయంలో బైకర్ క్లబ్స్‌తో వీరు పోటీపడుతున్నారని చెప్పొచ్చు. ‘కనీసం 100 నుంచి 250 కి.మీ వరకూ దూరంలో ఉండే గమ్యాలను చేరుకోడానికి నగరంలోని సైక్లిస్ట్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తరచూ లాంగ్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నాం’ అని బైక్ అఫైర్స్ నిర్వాహకులు వివరించారు.
విదేశాల్లోనూ.. రయ్ రయ్..
నగరం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి రోడ్స్‌పై రైడ్స్ చేయాలనుకునే ఆసక్తి కలిగిన నగరవాసుల కోసం అక్కడ సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ‘మల్టీ డే బైస్కిల్ రైడ్స్ పేరిట విదేశాల్లో సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం.
నార్తర్న్ థాయ్‌లాండ్‌లో గత ఫిబ్రవరిలో ఒక రైడ్ నిర్వహించాం. పలువురు సిటిజనులు అందులో పాల్గొన్నారు. త్వరలో స్పెయిన్‌లోనూ ఈ తరహా రైడ్ నిర్వహించనున్నాం’ అని చెప్పారు బార్నోల్ అడ్వెంచర్స్ సంస్థ నిర్వాహకులు.
పెడలింగ్.. ఈవెంట్స్..
నగరవాసుల్లో నైట్‌రైడ్స్ పట్ల పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా డెకథ్లాన్, బైక్ అఫైర్స్ తదితర సంస్థలు ప్రత్యేక సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వాహనం ఉండి, సైక్లింగ్‌పై ఆసక్తి ప్రధాన అర్హతగా, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా కూడా పాల్గొనేందుకు వీటిని నిర్వహిస్తున్నవారు సైక్లిస్ట్‌లకు అవకాశం కల్పిస్తున్నారు.
ఈ తరహా రైడ్స్‌లో భాగంగా సైక్లిస్ట్‌లకు కొత్త కొత్త సైకిళ్ల గురించిన సమాచారం, వాహన నిర్వహణపై అవగాహన, ఆరోగ్యకరమైన అభిరుచిగా తీర్చిదిద్దుకోవడంపై మెళకువలు అందిస్తున్నారు. చిన్న చిన్న రైడ్స్ కోసం కెబీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్ ఎంచుకునే వీరు.. రైడ్ ఈవెంట్స్‌కి శంకర్‌పల్లి నుంచి కోకాపేట్ టూ శంకర్‌పల్లి టౌన్, శంకర్ పల్లి నుంచి కంది రోడ్, మేడ్చల్ రోడ్/నాగ్‌పూర్ హైవే వంటివి ఎంచుకుంటున్నారు.
బిగినర్స్.. సిగ్నేచర్..
ఆలోచనలు, ఆసక్తికి అనుగుణంగా విభిన్న రకాల ఈవెంట్ మేనేజర్స్ రైడ్స్ డిజైన్ చేస్తున్నారు. ప్రారంభకుల కోసం 15 నుంచి 20 కి.మీ వేగం పరిమితితో బిగినర్స్ రైడ్ నిర్వహిస్తున్నారు. ఈ తరహా రైడ్స్ కోసం 25 నుంచి 30 కి.మీ దూరాన్ని ఎంచుకుంటున్నారు.
ఇటు ప్రారంభకులు అటు అలవాటైన వారు కాకుండా మధ్యస్థంగా ఉండే వారికి సిగ్నేచర్ రైడ్ నిర్వహిస్తారు. దీని కోసం సుమారు 70 కి.మీ దూరాన్ని నిర్ణయిస్తున్నారు. కనీసం 25 నుంచి 30 కి.మీ వేగంతో 80 నుంచి 100 కి.మీ దూరం ప్రయాణం చేసే రైడ్స్‌ని ఫాస్ట్ రైడ్స్‌గా పేర్కొంటున్నారు. ఇవి నైపుణ్యం కలిగిన వారికి ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment