ఉద్యోగాలకు కత్తెర పెడుతున్న కంపెనీలు
2024లోనూ కొనసాగుతున్న లేఆఫ్స్
ఏఐ, ఎంఎల్‌తో ఉద్యోగాలు కోల్పోతున్న వైనం
2022, 2023లో వేల మందికి ఉద్వాసన
ఈ ఏడాది మే వరకు 75 వేల ఉద్యోగాల తొలగింపు
నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్న ఐటీ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగార్థుల కలల ప్రపంచం.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతులా సంపాదన, వీకెండ్ పార్టీలు, అప్పుడప్పుడూ టూర్లు. ఇక కరోనా వచ్చాక వర్క్ ఫ్రం హోం సౌలభ్యం. ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ సంక్షోభం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి. ఇక కొత్తగా ప్లేస్‌మెంట్స్ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు.
అన్ని కంపెనీలదీ అదే బాట..
కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు https://layoffs.fyi అనే సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల కోత 2024లోనూ కొనసాగుతోంది. 2024లోమే నాటికి 326 కంపెనీలు 98 వేల మందికి కత్తెరవేశాయి. పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి. ఇక కొన్ని కంపెనీలైతే నష్టాలను భరించలేక ఏకంగా తమ కార్యకలాపాలను నిలిపేశాయి.
డెల్ కంపెనీ గత ఏడాది 13వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వగా, ఈ ఏడాది 6వేల మందిని సాగనంపింది. టెస్లా కంపెనీలో ఎలాన్ మస్క్ రాత్రికి రాత్రే తమ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు మెయిల్స్ పంపారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ 1,900 మందికి కోతపెట్టగా, తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిన బైజూస్ 500 మందిని తొలగించింది. ఇంకా యాపిల్, డెల్, సోనీ, సిస్కో, స్విగ్గీ, యూట్యూబ్, గూగుల్, డుయోలింగో కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి.
ఇన్నొవేషన్ వల్లేనా..
ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ (ఎంఎల్), ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని అందరూ భావించారు. వీటి వాడకం వల్లే ఉద్యోగాల్లో కోత పడుతోందని లేఆఫ్స్ సంస్థ విశ్లేషించింది. ఇన్నొవేషన్ మూలంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. అయితే అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసిన తర్వాతే అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడతాయని అంటున్నారు.
మంచి పర్‌ఫార్మెన్స్ చూపించినా..
కంపెనీకి క్లయింట్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగించేస్తారు. ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ఎంతగా పర్‌ఫార్మెన్స్ చూపించినా కూడా వారికి అవసరం లేకపోయినా.. బడ్జెట్ లేకపోయినా ఉద్వాసన పలుకుతారు. ఎప్పుడు ఉద్యోగం తొలగిస్తారోనన్న భయంతో ఉద్యోగం చేయాల్సి వస్తోంది.
–మౌనిక, సాఫ్ట్‌వేర్ డెవలపర్, హైదరాబాద్
ఇద్దరి పని ఒక్కరిపైనే..
ఎజైల్ స్క్రమ్ మెథడాలజీ వ్యవస్థతో ఉద్యోగుల పనితీరును ప్రతి రోజూ అంచనా వేస్తుంటారు. ఇచి్చన టార్గెట్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అందుకు కారణాలను పై అధికారులకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండుసార్లు ఇలాగే జరిగితే చెప్పాపెట్టకుండా తొలగించేస్తారు. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఇద్దరి ముగ్గురి పని కూడా ఒకరిపైనే వేసి.. మిగిలిన వారికి పింక్ స్లిప్ ఇస్తున్నారు. ఐటీ రంగం ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు.
–పల్లె నరేశ్, ప్రిన్సిపల్ ఇంజనీర్
తప్పని పరిస్థితుల్లోనే..
కాస్త ఇబ్బందికరమే అయినా కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని లే ఆఫ్స్ ప్రకటిస్తుంటాం. ఆర్థిక మాంద్యం ప్రభావాలను తట్టుకోవడం మార్కెట్‌లో పోటీ, ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. చాలా కంపెనీల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత చాలా ఉంది. సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు కూడా నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగాలు కోల్పోక తప్పని పరిస్థితి ఉంది.
–కీర్తి రెడ్డి, బోల్డ్ ఫ్యూజ్ కంపెనీ సీఈవో, వ్యవస్థాపకురాలు
Comments
Please login to add a commentAdd a comment