సాక్షి, హైదరాబాద్: నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రాంలతో కుస్తీ పట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోందని.. గతేడాది సుమారు 79 శాతం మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు ఐటీ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్, సెమినార్లు, మోటివేషనల్ తరగతులు నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. నగరంలో చిన్న, మధ్యతరహా, కార్పొరేట్ ఐటీ కంపెనీలు 1500 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 80 శాతం కంపెనీలు ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
నియామకాల్లోనూ నయా పద్ధతి..
► గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీల వెల్లువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతోపాటు.. సమీప భవిష్యత్‌లో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించేందుకు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూలు, పదోన్నతులు అన్నీ వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థుల బయోడేటాలను తనిఖీ చేయనున్నారు.
► వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు,వ్యక్తిత్వాన్ని అంచనా వేయనున్నారు. కాగా కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీలు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంటున్నారు. నగరంలోని కంపెనీలు 54 శాతం మందిని,విదేశీ కంపెనీలు 49 శాతం మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు హైసియా వర్గాలు తెలిపాయి.
► ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ), కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌తో పని విధానం సమూలంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. ఏఐ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. (క్లిక్: ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం)
Comments
Please login to add a commentAdd a comment