డిగ్రీకి డేంజర్‌ బెల్స్‌!  | Students More Interested In Computer Courses | Sakshi
Sakshi News home page

డిగ్రీకి డేంజర్‌ బెల్స్‌! 

Published Sat, Nov 5 2022 3:09 AM | Last Updated on Sat, Nov 5 2022 3:09 AM

Students More Interested In Computer Courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత సర్వీసులతో పాటు గ్రూప్‌–1 వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం విద్యార్థులు ఒకప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి కోర్సుల్లోనే ఎక్కువగా చేరేవారు. హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, ఆంత్రోపాలజీ, ఫిజిక్స్, జువాలజీ, కామర్స్‌ వంటి సబ్జెక్టులను ఆప్షన్లుగా ఎంచుకుని అభ్యర్థులు ఉద్యోగాల వేటలో విజయం సాధించేవారు. ఇలాంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులకు రానురాను ఆదరణ కరువవుతోంది.

కంప్యూటర్‌ కోర్సులపై ఏర్పడిన క్రేజ్‌తో భవిష్యత్తులో వాటి మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంటోంది. వృత్తి విద్యా కోర్సులతో, ముఖ్యంగా కంప్యూటర్‌ కోర్సులతోనే తక్షణ ఉపాధి సాధ్యమన్న విద్యార్థుల భావనే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు సాధారణ బీఏ, బీకాం,బీఎస్సీ కోర్సులు కన్పించకుండా పోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

గత కొన్నేళ్ళుగా డిగ్రీ కోర్సుల్లో తగ్గుతున్న ప్రవేశాలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1,080 డిగ్రీ కాలేజీలుంటే, వాటిల్లో వివిధ కోర్సులకు సంబంధించిన 4.68 లక్షల సీట్లున్నాయి. అయితే గత ఐదేళ్ళుగా 2 లక్షలకు పైగా సీట్లు భర్తీ కావడం లేదు. కాగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సైతం సంప్రదాయ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో సీట్లు గణనీయంగా మిగిలిపోతున్నాయి.  

ఈ ఏడాదిలో ఇప్పటికి 1.75 లక్షల సీట్లే భర్తీ.. 
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన దోస్త్‌ కౌన్సెలింగ్‌ ద్వారా 1.75 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో రెండురోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి కూడా 2 లక్షల సీట్ల కంటే ఎక్కువ భర్తీ కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 53 కాలేజీల్లో కనీసం ఒక్క విద్యార్థి కూడా చేరలేదంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ఏటా ఇంటర్‌ పాసయ్యే విద్యార్థులు 3.20 లక్షల మంది వరకు ఉంటున్నారు. 75 వేల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. కొందరు ఇతర కోర్సుల వైపు వెళ్తున్నారు. ఏతావాతా 2 లక్షల మంది డిగ్రీలో చేరే వాళ్ళుంటే, సీట్లు మాత్రం అంతకు రెట్టింపు ఉన్నాయి. అంటే సగం సీట్లు ఖాళీగానే ఉండిపోతున్నాయన్న మాట. ఇక భర్తీ అవుతున్న సీట్లలో అత్యధిక శాతం కంప్యూటర్‌ సంబంధిత కోర్సులవే కావడం గమనార్హం. 

ఈ పరిస్థితికి కారణమేంటి? 
దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల ట్రెండ్‌ మారింది. ఏ కోర్సులోనైనా కంప్యూటర్‌ అనుసంధాన సబ్జెక్టులు ఉంటేనే డిగ్రీకి విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో 
సంప్రదాయ డిగ్రీ స్వరూపమే మారిపోతోంది. విద్యామండళ్లు విభిన్న రకాల కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. బీఏలో గతంలో ఐదారు రకాల కోర్సులు మాత్రమే ఉండగా ప్రస్తుతం 68 రకాల కోర్సులొచ్చాయి.

అలాగే బీఎస్సీలో 73 రకాలు, బీకాంలో 13 రకాల కాంబినేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా బీబీఎం, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్, బ్యాచులర్‌ ఆఫ్‌ ఒకేషన్‌ (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ టూరిజం పరిపాలన) వంటి కోర్సులు విస్తరించాయి. బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా అప్లికేషన్‌ కోర్సులు తీసుకొచ్చారు.

అయితే ఇవన్నీ చాలావరకు హైదరాబాద్‌ వంటి నగరాలకే పరిమితమయ్యాయి. ఇంజనీరింగ్‌తో సమానంగా ఉండే డేటాసైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కోర్సులు కూడా కేవలం నగరంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దాదాపు 70 కాలేజీల్లో బీఏ కోర్సుల్లో కనీసం 15 శాతం విద్యార్థులు కూడా చేరకపోవడాన్ని గమనిస్తే గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీల పరిస్థితి అర్ధమవుతోంది. 

హేతుబద్ధీకరణ తప్పదు 
డిగ్రీ ట్రెండ్‌ మారుతోంది. ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు ఉపాధి కోసం వృత్తి విద్య కోర్సుల వైపు వెళ్తున్నారు. కోవిడ్‌ వల్ల ఇంటర్‌లో అందరినీ పాస్‌ చేయడం వల్ల గతేడాది 2.50 లక్షల ప్రవేశాలు దాటాయి. కానీ ఈ ఏడాది ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ ప్రభావం డిగ్రీ ప్రవేశాలపై కన్పిస్తోంది. 15% ప్రవేశాలు లేని కాలేజీల జాబితా తయారు చేస్తున్నాం.

ఇప్పటికే జీరో అడ్మిషన్లున్న 53 కాలేజీలను మూత వేయాలని ఆదేశించాం. ఏదేమైనా డిగ్రీలో హేతుబద్ధీకరణ తప్పదు. డిమాండ్‌ లేని కోర్సులను తగ్గించుకుని, డిమాండ్‌ ఉన్న కోర్సులనే నడపాలని చెబుతున్నాం. 
– ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్‌) 

సాంకేతిక కోర్సులకే డిమాండ్‌ 
డిగ్రీలో సాంకేతికత ఉన్న కంప్యూటర్‌ కోర్సులనే విద్యార్థులు అడుగుతున్నారు. ఈ కారణంగానే ఆ తరహా కాంబినేషన్‌ కోర్సుల్లో సీట్లు పెంచాల్సి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా డిగ్రీ కోర్సుల స్వరూపం మారుతోంది. ఈ మార్పును అందిపుచ్చుకోవడం ప్రస్తుతం కాలేజీలకు ఒక సవాలే.  
– ఎకల్దేవి పరమేశ్వర్‌ (పైవేటు డిగ్రీ కాలేజీల సంఘం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement