సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల అనుసంధానం చేసే క్లస్టర్ విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్లస్టర్ విధానం డిగ్రీ విద్యకు బూస్టర్‌లా పనిచేసే అవకాశముంది. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు ఈ విధానం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి దశలవారీగా రాష్ట్రమంతటా విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఈ అంశంపై వైస్‌చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్‌సహా తొమ్మిది కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. క్లస్టర్ విధానం అమలు కోసం మొత్తం మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. కోఠి మహిళా కళాశాల, నిజాం, సిటీ, బేగంపేట మహిళా, రెడ్డి మహిళా, సెయింట్ ఆన్స్ మెహిదీపట్నం, సెయింట్ ఫ్రాన్సిస్ బేగంపేట, భవన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సైనిక్‌పురి, లయోలా అకాడమీ అల్వాల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. విద్యాసంబంధిత అంశాలపై ఒక కమిటీ, మౌలిక వసతులు, వనరులపై మరో కమిటీ, మార్గదర్శకాల తయారీకి ఇంకో కమిటీని ఏర్పాటు చేశారు.
10 రోజుల్లో నివేదికలు
పరీక్షలు, క్రెడిట్లు, వాటి బదలాయింపు, కోర్సులు, వనరులు తదితర అంశాలను పరిశీలించి 10 రోజుల్లో నివేదికలను అందజేయాలని ఈ కమిటీలను పాపిరెడ్డి ఆదేశించారు. క్లస్టర్‌గా ఏర్పాటయ్యే కాలేజీలు పరస్పరం ఒప్పందం(ఎంవోయూ) చేసుకోవాలి. క్లస్టర్‌లోని కాలేజీలే కాకుండా, సంబంధిత యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి ఈ ఒప్పందంలో భాగస్వామ్యమవుతాయి. కాలేజీలు విద్యార్థుల సమయాన్ని బట్టి టైం టేబుల్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. సెకండియర్‌లో రెగ్యులర్ డిగ్రీయే కాకుండా, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లోని విద్యార్థులు సైతం క్లస్టర్ ఫలాలను పొందవచ్చు.
ప్రయోగశాలల పరస్పర వినియోగం
ఒకే క్లస్టర్‌లోని ప్రభుత్వ కాలేజీలోని విద్యార్థి ప్రైవేట్ కాలేజీలో చదవాల్సి వస్తే.. ఇందుకయ్యే ఫీజులను ఉన్నత విద్యామండలి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్లస్టర్ విధానంలో తొలుత డిగ్రీ స్థాయిలో ఒక కాలేజీలో చేరి మరో కాలేజీలో క్లాసులు వినేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఎక్కడైనా క్లాసులు వినేలా ఏర్పాట్లు చేస్తారు. బోధనా సిబ్బంది, అధ్యాపకుల మార్పిడితో ఒక కాలేజీలో పనిచేస్తున్నవారు అదే క్లస్టర్‌లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లు చేయడం ఇందులో కీలకాంశం. లైబ్రరీలను, ప్రయోగశాలలను కూడా పరస్పరం వినియోగించుకునే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment