Approach
-
హైబ్రిడ్ వర్కే సో బెటరూ!
మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కి అన్నిరంగాలు ప్రభావితమయ్యాక వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి వచ్చింది.దీంతో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి పలు రంగాల ఉద్యోగులు అలవాటుపడ్డారు. కొంతకాలంగా పరిస్థితులు సద్దుమణగడంతో ఐటీతో సహా పలు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడం తప్పనిసరి చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల మనోగతం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘సీఐఈఎల్ హెచ్ఆర్’ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైబ్రిడ్ పనివిధానమే (ఆన్లైన్+ఆఫ్‌లైన్) మేలని అధికశాతం టెకీలు, ఇతర రంగాల ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తప్పనిసరిగా ఆఫీసుల నుంచే పనిచేయాలని పట్టుబట్టకుండా వర్క్ ఫ్రం హోం లేదా వారానికి ఒకరోజు ఆఫీసుకు రావడం లాంటి పద్ధతులను అనుమతించాలనే డిమాండ్ పెరుగుతోంది. వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ విధానానికి అనుమతించకపోతే వేరే కంపెనీల్లోకి మారేందుకూ సిద్ధమని 73 శాతం టెకీలు, ఇతర ఉద్యోగులు చెప్పినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, 35 శాతం మంది మాత్రం ఆఫీసుల నుంచి పనిచేసే రోజుల సంఖ్యను పెంచడాన్ని స్వాగతించారు. 26 శాతం మంది ఆఫీసు నుంచి పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐటీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న 3,800 ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే నివేదిక రూపొందించారు. వర్క్ ఫ్రం ఆఫీసుకు కంపెనీల మొగ్గు ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. రెండువందలకు పైగా కంపెనీల్లో డెలాయిట్ ఇండియా బెనిఫిట్స్ ట్రెండ్స్ 2023 నిర్వహించిన సర్వేలో... 88 శాతం ఉద్యోగులు ఏదో ఒక రూపంలో తమకు అనుకూలమైన పని పద్ధతులను మార్చుకున్నట్లు వెల్లడైంది. ఐటీసీ సంస్థ వర్క్ ఫ్రం ఆఫీస్‌ను పునఃప్రారంభించడంతోపాటు కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులను వారానికి రెండురోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా నిర్వహించిన సర్వేలో హైబ్రిడ్ విధానానికి అత్యధికులు మొగ్గుచూపుతున్నట్టు తేలింది. దీనికి అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన హైబ్రిడ్ వర్క్మోడల్/ ఫ్లెక్సిబుల్ వర్క్ వసతులను రూపొందించినట్టు డీబీఎస్ బ్యాంక్ ఇండియా హెచ్ఆర్ కంట్రీ హెడ్ కిషోర్ పోడూరి తెలిపారు. హైబ్రిడ్ విధానంతో వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు ట్రాఫిక్రద్దీ, వాహన కాలుష్యం నుంచి ఉపశమనం దొరుకుతుందని ఉద్యోగులు భావిస్తున్నట్లు చెప్పారు. అనుకూలమైన పని గంటలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండే సంప్రదాయ ఆఫీసు పనివేళల విధానం కాకుండా నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులు తమకు అనుకూలమైన పని సమయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతోంది. దీంతో వారు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. –నీలేశ్ గుప్తా, డైరెక్టర్, డెలాయిట్ ఇండియా వర్క్‌ఫోర్స్ ఉండేలా... ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పని ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన మార్పులపై కంపెనీలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఉత్పాదకతను పెంచే వర్క్‌ఫోర్స్, నైపుణ్య ఉద్యోగులు ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.–ఆదిత్య నారాయణ్ మిశ్రా, సీఈవో, సీఐఈఎల్ హెచ్ఆర్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ అంటే... ఆఫీసు, ఇంటి నుంచి పనిచేయడాన్ని సమ్మిళితం చేస్తే హైబ్రిడ్ పనివిధానం అవుతుంది. ఇందులో వారంలో కొద్ది రోజులు ఆఫీసు నుంచి, కొద్దిరోజులు ఇంటి నుంచి పనిచేస్తారు. యాజమాన్యం, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పని విధానాన్ని, ఆఫీసు వేళలను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల ఇళ్లకు దగ్గర్లోని లేదా ఉద్యోగులకు అనుకూలంగా ఉండే కో వర్కింగ్ ప్లేస్‌ల నుంచి పనిచేసే వీలు కూడా కల్పిస్తారు. దీంతో యాజమాన్యాలు, ఉద్యోగులకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. -
మధ్య తరగతికి చేరువ కండి
మధ్య తరగతికి మరింత చేరువ కావాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి లబ్ధి చేకూర్చిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత వివరంగా తెలియజేయాలన్నారు. ఆదివారం ఇక్కడ మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. బుధవారం సమర్పించబోయే కేంద్ర బడ్జెట్ గురించి చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు పేద, అణగారిన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూర్చడంతో పాటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని ఎంతో సుఖమయం చేశాయని మోదీ అన్నారు. ఈ విషయాలన్నింటినీ వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ బ్రిటిష్ వలస పాలనకు సంబంధించిన చిహ్నాలన్నింటినీ ఒక్కొక్కటిగా తప్పిస్తూ ముందుకు సాగుతున్నట్టు ప్రధాని చెప్పారు. భేటీలో మూడు అంశాలపై మంత్రులకు ప్రజెంటేషన్లు ఇచ్చారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన పనితీరుపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ గౌబా సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో సాధించిన ప్రగతిని కూడా వివరించారు. చిన్న, మధ్య తరహా నగరాల్లోనూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ల స్థాపన తదితరాలను ఉటంకించారు. విద్యా వ్యవస్థలో అన్ని స్థాయిల్లోనూ విద్యార్థుల చేరిక, కొనసాగింపు శాతం బాగా పెరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మానవ వనరులతో పాటు అన్నిరకాల వసతులనూ మెరుగు పరిచామన్నారు. ఇక కేంద్రం ప్రారంభించిన పలు ప్రాజెక్టుల వివరాలపై పరిశ్రమలు, అంతర్గత వర్తక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మంత్రులకు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మాధ్యమాలను మరింత మెరుగ్గా ఎలా వాడుకోవచ్చో సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తన ప్రజెంటేషన్‌లో వివరించారు. -
ఇద్దరిదీ ఒకే ఊరు.. సినిమాను తలపించే లవ్‌స్టోరీ.. పోలీస్‌స్టేషన్‌లో ప్రేమజంట..
పొన్నూరు(గుంటూరు జిల్లా): ప్రేమజంట పోలీసులను ఆశ్రయించిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రేమజంట తెలిపిన వివరాలు మేరకు.. వడ్డిముక్కల గ్రామానికి చెందిన శీలం అవినాష్, అదే గ్రామానికి చెందిన జె.ఏస్తేర్రాణి ఒకరినొకరు ప్రేమించుకొని ఆదివారం వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలతో తమకు హాని ఉందని రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ప్రేమజంటకు చెందిన ఇరుకుటుంబాలతో ఎస్ఐ భార్గవ్ మాట్లాడి అబ్బాయి అవినాష్ తల్లిదండ్రులతో ప్రేమజంటను పంపించారు. చదవండి: బ్రష్ చేయడం కూడా మరిచిపోతున్నారా?.. అయితే కారణం ఇదే.. -
పైలట్ ప్రాజెక్టుగా డిగ్రీలో క్లస్టర్ విధానం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల అనుసంధానం చేసే క్లస్టర్ విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్లస్టర్ విధానం డిగ్రీ విద్యకు బూస్టర్‌లా పనిచేసే అవకాశముంది. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు ఈ విధానం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి దశలవారీగా రాష్ట్రమంతటా విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఈ అంశంపై వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్సహా తొమ్మిది కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. క్లస్టర్ విధానం అమలు కోసం మొత్తం మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. కోఠి మహిళా కళాశాల, నిజాం, సిటీ, బేగంపేట మహిళా, రెడ్డి మహిళా, సెయింట్ ఆన్స్ మెహిదీపట్నం, సెయింట్ ఫ్రాన్సిస్ బేగంపేట, భవన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సైనిక్‌పురి, లయోలా అకాడమీ అల్వాల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. విద్యాసంబంధిత అంశాలపై ఒక కమిటీ, మౌలిక వసతులు, వనరులపై మరో కమిటీ, మార్గదర్శకాల తయారీకి ఇంకో కమిటీని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో నివేదికలు పరీక్షలు, క్రెడిట్లు, వాటి బదలాయింపు, కోర్సులు, వనరులు తదితర అంశాలను పరిశీలించి 10 రోజుల్లో నివేదికలను అందజేయాలని ఈ కమిటీలను పాపిరెడ్డి ఆదేశించారు. క్లస్టర్‌గా ఏర్పాటయ్యే కాలేజీలు పరస్పరం ఒప్పందం(ఎంవోయూ) చేసుకోవాలి. క్లస్టర్‌లోని కాలేజీలే కాకుండా, సంబంధిత యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి ఈ ఒప్పందంలో భాగస్వామ్యమవుతాయి. కాలేజీలు విద్యార్థుల సమయాన్ని బట్టి టైం టేబుల్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. సెకండియర్‌లో రెగ్యులర్ డిగ్రీయే కాకుండా, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లోని విద్యార్థులు సైతం క్లస్టర్ ఫలాలను పొందవచ్చు. ప్రయోగశాలల పరస్పర వినియోగం ఒకే క్లస్టర్‌లోని ప్రభుత్వ కాలేజీలోని విద్యార్థి ప్రైవేట్ కాలేజీలో చదవాల్సి వస్తే.. ఇందుకయ్యే ఫీజులను ఉన్నత విద్యామండలి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్లస్టర్ విధానంలో తొలుత డిగ్రీ స్థాయిలో ఒక కాలేజీలో చేరి మరో కాలేజీలో క్లాసులు వినేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఎక్కడైనా క్లాసులు వినేలా ఏర్పాట్లు చేస్తారు. బోధనా సిబ్బంది, అధ్యాపకుల మార్పిడితో ఒక కాలేజీలో పనిచేస్తున్నవారు అదే క్లస్టర్‌లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లు చేయడం ఇందులో కీలకాంశం. లైబ్రరీలను, ప్రయోగశాలలను కూడా పరస్పరం వినియోగించుకునే అవకాశముంది. -
రెండు ఫార్మా దిగ్గజాలు విలీనం!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిరోధానికి వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో ముందు వరుసలో వున్న రెండు ఫార్మా దిగ్గజ కంపెనీలు విలీనం కాబోతున్నాయనే వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఔషధ తయారీలో దిగ్గజ కంపెనీలు, ప్రత్యర్థుల అయిన అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్, బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా విలీన చర్చల్లో ఉన్నట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా, గిలియడ్ కంపెనీని సంప్రదించిందని విశ్వనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు చేసింది. అయితే ఈ అంచనాపై గిలియడ్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తిరస్కరించారు. ఇది ఇలా ఉంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని, ఆక్స్ఫర్డ్ ప్రయోగ పరీక్షల ఫలితాలు వచ్చేసరికే 200 కోట్ల డోసులను పంపిణీకి సిద్ధంగా ఉంచాలనేది తమ లక్ష్యమని ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ సోరియట్ ప్రకటించారు. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేస్తున్న కోివిడ్-19 ప్రయోగాత్మక వ్యాక్సిన్ (ఏజెడ్‌డీ1222)ను సెప్టెంబరుకల్లా 200కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామన్నారు. (కరోనా: రెమ్డిసివిర్ వాడేందుకు భారత్ అంగీకారం) కాగా గిలియడ్, ఆస్ట్రాజెనెకా ఇంకా అనేక ఇతర ఔషధ తయారీదారులు వ్యాక్యిన్ రూపకల్పనలో తలమునకలై వున్నాయి. ఎలీ లిల్లీ అండ్ కో, ఫైజర్, మెర్క్ అండ్ కో తదితర కంపెనీలు కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి పోటీ పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రస్తుతం 100కి పైగా ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. మరోవైపు గిలియడ్ యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌ను దేశంలో మార్కెటింగ్ చేసుకునేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
చందా కొచర్‌కు మరిన్ని చిక్కులు
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణంలో ఐసీఐసీఐ బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈస్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎండీ చందా కొచర్ నుంచి తామిచ్చిన బోనస్‌ను రికవరీ చేయాలని కోరింది. అలాగే తన తొలగింపు అక్రమమంటూ చందా కొచర్ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. తన తొలగింపు ద్వారా ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొనడం, బ్యాంకు విలువైన స్టాక్ ఆప్షన్‌ను పొందేందుకు, తప్పు దారి పట్టించే ప్రయత్నమని ఐసీఐసీఐ బ్యాంకు తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మేరకు జనవరి 10 న దావా వేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా పడింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా ఆమెను తొలగించిన తరువాత ఏప్రిల్ 2006- మార్చి 2018 వరకు ఆమెకిచ్చిన బోనస్ క్లాబ్యాక్ చేయాలని కోరుతోంది. (క్లాబ్యాక్ అంటే ఏదైనా దుష్ప్రవర్తన లేదా క్షీణించిన లాభాల విషయంలో ఒక ఉద్యోగి నుండి బోనస్ తదితర ప్రోత్సాహక-ఆధారిత వేతనాన్ని కంపెనీ తిరిగి తీసుకోవచ్చు) బ్యాంకు వ్యాపార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి బ్యాంకుతోపాటు వాటాదారులందరికీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించిందనీ, బ్యాంకుకు ప్రతిష్టకు తీరని నష్టం కలిగిందని ఆరోపించింది. తన భర్త దీపక్ కొచర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే వీడియోకాన్ గ్రూపునకు రూ .2,250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ పాత్ర ఉందని బ్యాంకు ఆరోపించింది. కాగా చందా కొచర్ తన పదవీకాంలో వీడియోకాన్‌కు క్విడ్ ప్రో కో ద్వారా చట్టవిరుద్ధంగా రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. అయితే మొదట్లో చందా కొచర్‌కు బాసటగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు జస్టిస్ (రిటైర్డ్) బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2019 జనవరిలో ఏర్పాటు చేసింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఆమెను పదవినుంచి తొలగించడంతోపాటు ఏప్రిల్ 2009- మార్చి 2018 మధ్య ఆమెకు చెల్లించిన అన్ని బోనస్, స్టాక్ ఆప్షన్లను తిరిగి తీసుకోవాలని బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు తన తొలగింపు చట్టవిరుద్ధమని పేర్కొంటూ బ్యాంకు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ (నవంబర్ 30, 2019న)చందా కొచర్ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం
హన్మకొండ చౌరస్తా: పసిపాపపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడికి విధించిన ఉరి శిక్షను తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని చిన్నారి శ్రీహిత తండ్రి కె.జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కుమార్‌పల్లిలో జూన్ 17 రాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న శ్రీహితను నిందితుడు ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆయన ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేశ సర్వోత్తమ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నాడు. -
ఎక్స్టీరియర్ సొల్యూషన్స్‌లోకి అపర్ణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ అపర్ణ ఎంటర్ప్రైజెస్ అల్యూమినియం ఎక్స్టీరియర్స్ సొల్యూషన్స్ విభాగంలోకి ప్రవేశించింది. హాంగ్‌కాంగ్ సంస్థ క్రాఫ్ట్ హాల్డింగ్స్తో కలిసి అపర్ణ క్రాఫ్ట్ ఎక్స్టీరియర్స్ పేరుతో సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేసింది. అపర్ణ క్రాఫ్ట్ బ్రాండ్‌లో అల్యూమినియం ఎక్స్టీరియర్స్ తయారీ, విక్రయం చేపడతామని అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఎండీ అశ్విన్ రెడ్డి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. జేవీలో తమ కంపెనీకి 74 శాతం వాటా ఉంటుందన్నారు. బాచుపల్లి వద్ద రూ.30 కోట్లతో తయారీ కేంద్రం నెలకొల్పామని అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఈడీ అపర్ణ రెడ్డి వెల్లడించారు. జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ విభాగం ద్వారా తొలి ఏడాది రూ.100 కోట్ల ఆదాయం ఆశిస్తున్నారు. అపర్ణ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30% వృద్ధితో రూ.850 కోట్ల టర్నోవరు నమోదు చేయబోతోందన్నారు. -
స్ట్రెచ్ యోగా సాగిపో హ్యాపీగా!
గత వారం ప్రాథమిక ఆసనాలైన సూర్య నమస్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని ప్రాథమిక ఆసనాలు... తాడాసనం, తాళాసనం, కటి చక్రాసనం గురించి తెలుసుకుందాం. ఇవి శరీరాన్ని చురుగ్గా ఉంచడంలో సాయం చేస్తాయి. కీళ్ల నొప్పులను, కండరాల బాధలను ఇవి దూరం చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాయి. యోగావగాహన.... శారీరక ధృఢత్వానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు, మునులు అందించిన శాస్త్రం హఠయోగం. దీనిని తొలుత 8వ శతాబ్దంలో స్వాత్మారామ అనే గురువు హఠయోగ ప్రదీపిక పేరిట గ్రంథ రూపంలో అందించారు. స్వాత్మారాముడు ప్రథమ శ్లోకంలోనే రాజయోగ ఉపయోగార్థం ఈ హఠయోగాన్ని ఇస్తున్నట్టు చెబుతాడు. పతంజలి ఇచ్చిన యోగ దర్శనానికి అనుగుణంగా ధ్యానానికి శరీరాన్ని సిద్ధం చేయడం హఠయోగ సాధన ముఖ్యోద్దేశం. శాస్త్రం కాబట్టి యోగాను శాస్త్రీయ దృక్పథంతోనే ఆచరించాలి. యోగా అనే పదం యంగ్ అనే పదంలో నుంచి వచ్చినట్టయితే దాని అర్థం సంయోగం. అంటే శరీరాన్ని, శ్వాసను మనసుతో అనుసంధానం చేసి సమన్వయం చేయడం. దీనికి మూలం ‘యోక్’ అయినట్లయితే దాని అర్థం కాడి. రైతు పొలం దున్నేటప్పుడు కాడికి కుడి ఎడమ వైపున కట్టిన ఎడ్ల కదలికలో సమతుల్యం ఉండేటట్టుగా ఎలా చూస్తాడో అలాగే యోగాసన, ప్రాణాయామ సాధన చేసేటప్పుడు శరీరంలో ఎడమ, కుడి భాగాలను మెదడులో ఎడమ, కుడి గోళార్ధములను, ఇడ-పింగళ నాడులను సమంగా పనిచేసేటట్టుగా చూడాలి. తాళాసన (తాళ అంటే తాడిచెట్టు) రెండు కాళ్లను ఒక చోట చేర్చి సమంగా నిలబడి నెమ్మదిగా చేతులను శరీరం పక్క నుంచి తలపైకి తీసుకెళ్లి, పైన ఆకాశం వైపు చూపుతూ వాటిని ఇంటర్ లాక్ చేయాలి. కాలిమడమలు పెకైత్తి మునివేళ్ల మీద నిలబడి శరీరాన్ని వీలైనంత వరకూ పైకి సాగదీస్తూ శక్తి ప్రవాహాన్ని వెన్నెముక కింది భాగం నుంచి తలపై భాగం వరకూ ప్రసరించడాన్ని గమనించాలి. దీని వల్ల వెన్నెముక ధృఢంగా అవడంతో పాటు వెన్నెముక పూసల మధ్య ఖాళీ పెరుగుతుంది. పూసల మధ్యలో ఉన్న డిస్క్‌లకు వ్యాకోచత్వం పెరిగి, స్లిప్డ్ డిస్క్ డిస్క్ ప్రోలాప్స్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఒక వయోపరిమితి వరకూ ఎత్తు పెరగడానికి కూడా ఈ ఆసనం ఉపకరిస్తుంది. శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి సాగదీసేటప్పుడు పొట్టని లోపలికి లాగడం ద్వారా పొట్టలో ఉన్న కొవ్వు కరిగే అవకాశంతో పాటు, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. తాడాసన (తాడ అంటే పర్వతము) నిటారుగా నిలుచుని వెన్నెముకను నిదానంగా సాగదీయాలి. చేతులు శరీరానికి పక్కగా ఉంచాలి. ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాసను పీలుస్తూ, వదులుతూ ఉండాలి. శరీరానికి ఇది చక్కటి విశ్రాంతిని అందిస్తుంది. కటి చక్రాసనం రెండు పాదాలను ఒక చోట చేర్చి నిటారుగా నిలబడాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ కుడిచేతిని పెకైత్తాలి. తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ (కుడిచేతిని తలకి ఆనంచి) దేహాన్ని ఎడమవైపునకు వంచాలి. ఆసనంలో కొద్దిసేపు ఉండి, నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదిలేస్తూ కుడిచేయి కిందకు తీసుకురావాలి. ఎడమవైపు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. దీని వల్ల నడుము కుడి ఎడమ భాగాల్లో కొవ్వు తగ్గడమే కాక వెన్నెముకలో ధృఢత్వం, సాగే గుణం పెరుగుతుంది. ఎ.ఎల్.వి. కుమార్ ట్రెడిషనల్ యోగా సెంటర్ -
అ.. అంటే అప్రోచ్! ఆ.. అంటే ఆప్షన్స్!!
ఒంగోలు కలెక్టరేట్ : అ.. అంటే అప్రోచ్! ఆ.. అంటే ఆప్షన్స్!! అంటూ పోస్టింగ్‌ల కోసం తహశీల్దార్లు సరికొత్త పల్లవి అందుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తాము కోరుకున్న మండలాల్లో పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు శతవిధాలా పోరాడుతున్నారు. జిల్లాకు చెందిన తహశీల్దార్లు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాలకు బదిలీ అయి తిరిగి సొంత జిల్లాకు వచ్చారు. ఇప్పటికే కలెక్టరేట్లో రిపోర్ట్ చేశారు. తహశీల్దార్లు పోస్టింగ్‌లకు ‘అప్రోచ్’ ఆప్షన్స్ మొదలయ్యాయి. ఎక్కువ మంది తహశీల్దార్లు అధికారపార్టీ నాయకులను అప్రోచ్ అయి కలెక్టరేట్‌కు చేరుకొని ఆప్షన్స్ ఇస్తున్నారు. అధికారపార్టీ అండదండలు ఉన్నవారికి కోరుకున్న చోట్ల పోస్టింగ్‌లు దాదాపుగా ఖరారయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి తహశీల్దార్ల పోస్టింగ్‌లకు డిమాండ్ పెరిగింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలురైన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఇప్పించేందుకు జాబితాలు సిద్ధం చేశారు. అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నచోట్ల వారు సూచించిన వారికే కోరుకున్న చోట్ల పోస్టింగ్‌లు దాదాపుగా దక్కనున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలు జాబితాలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 56 మండలాలకు తహశీల్దార్ల నియామకం ఒక కొలిక్కి వచ్చింది. ప్రతి తహశీల్దార్‌కు రెండు లేదా మండలాల చొప్పున జిల్లా యంత్రాంగం ఆప్షన్స్ ఇచ్చింది. దీంతో ఎక్కువ మంది తహశీల్దార్లు సంబంధిత నియోజకవర్గం పరిధిలోని మండలాలను మాత్రమే కోరుకోవడం గమనార్హం. చివరకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించిన విధంగా తహశీల్దార్లకు పోస్టింగ్‌లు రానున్నాయి. మొత్తం మీద పదేళ్ల తర్వాత తెలుగుదేశం నాయకులు చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చీ రాగానే నాయకులు ముందుగా కీలకమైన తహశీల్దార్లపై దృష్టి సారించారు. పొరుగు జిల్లాలో రాజధాని ఏర్పడే అవకాశం ఉండటంతో జిల్లాలోని ప్రభుత్వ భూములపై కొంతమంది తెలుగుదేశం నాయకుల కన్ను పడింది. వాటిని దక్కించుకునేందుకు తమ మాట వినే తహశీల్దార్లు ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగంపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. కసరత్తుకు గడువు తహశీల్దార్ల పోస్టింగ్‌ల కసరత్తుకు జిల్లా యంత్రాంగానికి గడువు దొరికినట్లయింది. వాస్తవానికి శుక్రవారం రాత్రికి జాబితాను క్లియర్ చేసి శనివారం విడుదల చేస్తారని ప్రచారం జరిగింది.అయితే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో జిల్లా యంత్రాంగానికి మరికొంత సమయం కలిసొచ్చింది. అధికార పార్టీ ఆమోదముద్ర పొందిన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కూడా రంగంలోకి దిగడం విశేషం. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న వారికి జిల్లా కేంద్రానికి, డివిజన్ కేంద్రాలకు దగ్గరగా పోస్టింగ్‌లు వచ్చే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎవరికి ఏ మండలం ఇచ్చారన్న విషయం తెలియాలంటే మరో 48 గంటలు ఎదురు చూడక తప్పదు.