సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిరోధానికి వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో ముందు వరుసలో వున్న రెండు ఫార్మా దిగ్గజ కంపెనీలు విలీనం కాబోతున్నాయనే వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఔషధ తయారీలో దిగ్గజ కంపెనీలు, ప్రత్యర్థుల అయిన అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్, బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా విలీన చర్చల్లో ఉన్నట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా, గిలియడ్ కంపెనీని సంప్రదించిందని విశ్వనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు చేసింది.
అయితే ఈ అంచనాపై గిలియడ్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తిరస్కరించారు. ఇది ఇలా ఉంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని, ఆక్స్‌ఫర్డ్ ప్రయోగ పరీక్షల ఫలితాలు వచ్చేసరికే 200 కోట్ల డోసులను పంపిణీకి సిద్ధంగా ఉంచాలనేది తమ లక్ష్యమని ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ సోరియట్ ప్రకటించారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేస్తున్న కోివిడ్-19 ప్రయోగాత్మక వ్యాక్సిన్ (ఏజెడ్‌డీ1222)ను సెప్టెంబరుకల్లా 200కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామన్నారు. (కరోనా: రెమ్‌డిసివిర్ వాడేందుకు భారత్ అంగీకారం)
కాగా గిలియడ్, ఆస్ట్రాజెనెకా ఇంకా అనేక ఇతర ఔషధ తయారీదారులు వ్యాక్యిన్ రూపకల్పనలో తలమునకలై వున్నాయి. ఎలీ లిల్లీ అండ్ కో, ఫైజర్, మెర్క్ అండ్ కో తదితర కంపెనీలు కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి పోటీ పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రస్తుతం 100కి పైగా ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. మరోవైపు గిలియడ్ యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌ను దేశంలో మార్కెటింగ్ చేసుకునేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment