ఒంగోలు కలెక్టరేట్ : అ.. అంటే అప్రోచ్! ఆ.. అంటే ఆప్షన్స్!! అంటూ పోస్టింగ్‌ల కోసం తహశీల్దార్లు సరికొత్త పల్లవి అందుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తాము కోరుకున్న మండలాల్లో పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు శతవిధాలా పోరాడుతున్నారు. జిల్లాకు చెందిన తహశీల్దార్లు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాలకు బదిలీ అయి తిరిగి సొంత జిల్లాకు వచ్చారు. ఇప్పటికే కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేశారు. తహశీల్దార్లు పోస్టింగ్‌లకు ‘అప్రోచ్’ ఆప్షన్స్ మొదలయ్యాయి. ఎక్కువ మంది తహశీల్దార్లు అధికారపార్టీ నాయకులను అప్రోచ్ అయి కలెక్టరేట్‌కు చేరుకొని ఆప్షన్స్ ఇస్తున్నారు.
అధికారపార్టీ అండదండలు ఉన్నవారికి కోరుకున్న చోట్ల పోస్టింగ్‌లు దాదాపుగా ఖరారయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి తహశీల్దార్ల పోస్టింగ్‌లకు డిమాండ్ పెరిగింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలురైన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఇప్పించేందుకు జాబితాలు సిద్ధం చేశారు. అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నచోట్ల వారు సూచించిన వారికే కోరుకున్న చోట్ల పోస్టింగ్‌లు దాదాపుగా దక్కనున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిలు జాబితాలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 56 మండలాలకు తహశీల్దార్ల నియామకం ఒక కొలిక్కి వచ్చింది.
ప్రతి తహశీల్దార్‌కు రెండు లేదా మండలాల చొప్పున జిల్లా యంత్రాంగం ఆప్షన్స్ ఇచ్చింది. దీంతో ఎక్కువ మంది తహశీల్దార్లు సంబంధిత నియోజకవర్గం పరిధిలోని మండలాలను మాత్రమే కోరుకోవడం గమనార్హం. చివరకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించిన విధంగా తహశీల్దార్లకు పోస్టింగ్‌లు రానున్నాయి. మొత్తం మీద పదేళ్ల తర్వాత తెలుగుదేశం నాయకులు చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చీ రాగానే నాయకులు ముందుగా కీలకమైన తహశీల్దార్లపై దృష్టి సారించారు. పొరుగు జిల్లాలో రాజధాని ఏర్పడే అవకాశం ఉండటంతో జిల్లాలోని ప్రభుత్వ భూములపై కొంతమంది తెలుగుదేశం నాయకుల కన్ను పడింది. వాటిని దక్కించుకునేందుకు తమ మాట వినే తహశీల్దార్లు ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగంపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారు.
కసరత్తుకు గడువు
తహశీల్దార్ల పోస్టింగ్‌ల కసరత్తుకు జిల్లా యంత్రాంగానికి గడువు దొరికినట్లయింది. వాస్తవానికి శుక్రవారం రాత్రికి జాబితాను క్లియర్ చేసి శనివారం విడుదల చేస్తారని ప్రచారం జరిగింది.అయితే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో జిల్లా యంత్రాంగానికి మరికొంత సమయం కలిసొచ్చింది. అధికార పార్టీ ఆమోదముద్ర పొందిన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కూడా రంగంలోకి దిగడం విశేషం. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న వారికి జిల్లా కేంద్రానికి, డివిజన్ కేంద్రాలకు దగ్గరగా పోస్టింగ్‌లు వచ్చే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎవరికి ఏ మండలం ఇచ్చారన్న విషయం తెలియాలంటే మరో 48 గంటలు ఎదురు చూడక తప్పదు.
అ.. అంటే అప్రోచ్! ఆ.. అంటే ఆప్షన్స్!!
Published Mon, Jun 16 2014 2:20 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement