కడప కార్పొరేషన్: జిల్లాకేంద్రమైన కడపలో తహసీల్దార్ బదిలీ వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. అదికాస్తా పెనుతుపానులా మారి అ«ధికారపార్టీలో అంతర్గత కుమ్ములాటలకు మరోసారి ఆజ్యం పోసింది. ఇదివరకే ఉప్పు నిప్పులా ఉన్న టీడీపీ నేతల మధ్య ఈ వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. కడప నగరంలో ఇటీవల పంపిణీ చేసిన ఇంటిస్థలాల విషయమే దీనికి కేంద్ర బిందువుగా మారింది. పట్టాల పంపిణీలో అక్రమాలపై పత్రికల్లో కథనాలు రావడం, వామపక్షాలు పక్కా ఆధారాలిస్తామని వరుస ఆందోళనలు చేస్తుండటంతో కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు.
త్వరలో జరిగే బదిలీల్లో తహసీల్దార్‌ను బదిలీ చేయనున్నట్లు కూడా సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఇదే తరహా వైఖరితో టీడీపీలోని ఓ వర్గం కూడా ఉంది. కొన్ని డివిజన్లలోనే పట్టాలిచ్చారని, తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి, కొందరు జన్మభూమి కమిటీ సభ్యులకు మాత్రమే ఇచ్చారని ప్రముఖ పదవిలో ఉన్న ఓ నాయకుడు, రాష్ట్రస్థాయి పార్టీ పదవుల్లో ఉన్న ప్రముఖులు వాదిస్తున్నారు. తమ మాట పెడచెవిన పెట్టారని, డబ్బులు తీసుకొని పట్టాలిచ్చారని ఆరోపిస్తూ వారు తహసీల్దార్‌ను బదిలీ చేయాల్సిందిగా పైస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.
తహసీల్దార్ పంపితే ఊరుకోం
ఇదిలా ఉండగా అందులో తహసీల్దార్ తప్పేమీ లేదని, నిష్పక్షపాతంగానే పట్టా ల పంపిణీ జరిగిందని మరో వర్గం వాదిస్తోంది. తమకు సహాయం చేశారనే కారణంతో తహసీల్దార్‌ను బదిలీ చేస్తే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులు కలెక్టర్‌ను కలిసినట్లు తెలిసింది. రాజీనామా లేఖలను వారు తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. తహసీల్దార్‌ను బదిలీ చేసే పక్షమైతే తమ రాజీనామాలను ఆమోదించాలని వారు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడపలో అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలో తహసీల్దార్ బదిలీ వ్యవహారం మరిన్ని చీలికలు తెచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అ«ధికారపార్టీ నాయకులు వ్యవహారం జిల్లా ఉన్నతాధికారిని సంకట స్థితిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఆ తహసీల్దార్‌ను బదిలీ చేస్తే ఒక తంటా, చేయకపోతే మరో తంటా అనే విధంగా పరిçస్థితి తయారైంది. ఈ పరిస్థితిలో కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment