కోసిగి మండల తహసీల్దార్ కార్యాలయం
మంత్రాలయం: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగి గాడితప్పారు. టీడీపీ నాయకుల అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేయడమే కాకుండా..ప్రభుత్వ పథకాల అమలులో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించే వారు కరువయ్యారు. సహ ఉద్యోగులు ఎవరైనా పొరపాటున నోరు మెదిపితే..వేధింపులే వేధింపులు. ఉన్నతస్థాయి అధికారులతో పాటు టీడీపీ నేతలతో అతనికి మంచి సంబంధాలు ఉండడంతో కోసిగి తహసీల్దార్ కార్యాలయంలో మూడున్నరేళ్లుగా తిష్టవేశారనే ఆరోపణలు ఉన్నాయి. కౌతాళం మండలం ఆర్‌ఐగా మొదటిసారి ఆయన మంత్రాలయం నియోజకవర్గంలో అడుగుపెట్టారు.
అక్కడ రెండు నెలలు పనిచేసి కోసిగికి వచ్చారు. కోసిగి తహసీల్దార్ కార్యాలయంలో 2015 జనవరి నుంచి ప్రధాన పోస్టులో కొనసాగుతున్నారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రాముడు చేపల చెరువుల ఆరోపణల్లో 2015 నవంబర్ 4న సస్పెండ్ అయ్యారు. 2017లో లక్ష్మీదేవి తహసీల్దార్ వచ్చినా అనతికాలంలోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సదరు అధికారి మాత్రం మూడేళ్లు దాటి ఆరు నెలలు కావొస్తున్నా స్థానభ్రంశం లేకుండా చలామణి అవుతున్నారు.
అంతటా అక్రమాలే..
చౌకదుకాణాలు, పట్టాదారు పాసుపుస్తకాలు.. నిర్వహణలో సదరు ఉద్యోగిపై ఆరోపణలు లేకపోలేదు. ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా.. ఆయన్ని కోసిగి నుంచి ఎందుకు బదిలీ చేయడంలేదు. రాజకీయ అండదండలు మెండుగా ఉండటంతో ఆయన కుర్చీకి ప్రమాదమేమి లేదనే చర్చ నడుస్తోంది. ఇటీవల అన్ని మండలాలకు తహసీల్దార్ పోస్టింగ్‌లు ఇచ్చినా కోసిగి మండలానికి ఎవరినీ నియమించలేదు.
Comments
Please login to add a commentAdd a comment