పట్టుకోండి చూద్దాం! | ACB Officials Hunting For Gudur Tahsildar | Sakshi
Sakshi News home page

పట్టుకోండి చూద్దాం!

Published Thu, Nov 14 2019 12:15 PM | Last Updated on Thu, Nov 14 2019 12:15 PM

ACB Officials Hunting For Gudur Tahsildar - Sakshi

ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న గూడూరు తహసీల్దారు హసీనాబీ, కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్య కలిసి ఉన్న ఫొటో

గూడూరు తహసీల్దార్‌ ఏసీబీ అధికారులనే ముప్పుతిప్పలు పెడుతోంది. ఓ రైతు నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటూ తన బినామీ చిక్కిన వెంటనే అప్రమత్తమైన ఆమె.. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆపై స్థావరాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతోంది. బుధవారం అనంతపురంలో చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకుంది. ఎలాగైనా అరెస్ట్‌ చేసి బోనులో నెలబెట్టేందుకు ఏసీబీ అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులోభాగంగానే ఆశ్రయమిచ్చిన కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్యపై కేసు నమోదు చేసి, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

కోడుమూరు/కర్నూలు సిటీ: కోర్టు వివాదంలో ఉన్న భూమికి వెబ్‌ల్యాండ్‌లో డిజిటల్‌ సిగ్నేచర్‌ తొలగింపు కోసం రూ.4లక్షలు డిమాండ్‌ చేస్తూ ఏసీబీకి పట్టుబడిన గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ కోసం ఏసీబీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నెల 7న గూడూరు తహసీల్దార్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసుకొని హసీనాబీ పరారీలో ఉన్నారు. నిందితురాలిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు. బుధవారం అనంతపురంలో తమ బంధువుల వద్ద ఆశ్రయం పొందినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లేలోగా, విషయం గమనించిన నిందితురాలు పరారైనట్లు సమాచారం. 

కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్యపై కేసు నమోదు
గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ, కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్య గతంలో కలెక్టరేట్‌లోని రెవెన్యూ సెక్షన్‌లో పని చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇతడి సహకారంతోనే తప్పించుకు తిరుగుతున్నట్లు గ్రహించిన ఏసీబీ అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ నెల 8న ఎంపీడీఓ గిడ్డయ్య కూడా సెలవు పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుసుకుని అతడు నివాసం ఉంటున్న సీక్యాంపు సెంటర్‌ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్‌కు వెళ్లారు. తాళం వేసి ఉండటంతో కల్లూరు తహసీల్దార్‌ రవికుమార్‌ సమక్షంలో తాళం పగులగొట్టి సోదాలు నిర్వహించారు. తహసీల్దారు, ఎంఈడీఓ కలిసి దిగిన ఫొటోలు, కీలక పత్రాలు, తహసీల్దారు ఊత కర్ర, గుర్తింపు కార్డు లభ్యమయ్యాయి. దీంతో ఎంపీడీఓపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.

ఆరు హాస్టళ్లలో నివాసం..
గూడూరు తహసీల్దార్‌పై కేసు నమోదైన అనంతరం ఏసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. కర్నూలులోని వివిధ ప్రాంతాల్లోని ఆరు హాస్టళ్లలో నివాసముంటున్నట్లు ఏసీబీ పోలీసులు గుర్తించారు. ఆరు ప్రాంతాల్లో నిందితురాలికి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరు హాస్టళ్లకు నెలనెలా అద్దె చెల్లిస్తున్నట్లు ఏసీబీ అధికారులకు హాస్టళ్ల యజమానులు తెలియజేశారు. ఒకే వ్యక్తి ఆరు చోట్లా నివాసముండేందుకు హాస్టళ్లలో ఎందుకు అద్దె కడుతుందనే విషయం అంతుపట్టడం లేదు. కాగా కొత్తపల్లి గిడ్డయ్య కేసు నుంచి బయటపడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. సీనియర్‌ అడ్వకేట్లను సంప్రదించి కేసు నుంచి ఎలా బయటపడాలి, నేరుగా కోర్టుకు హాజరైతే బాగుంటుందా అనే విషయాలపై అడ్వకేట్లను అమరావతిలో కలిసి చర్చించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement