మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కి అన్నిరంగాలు ప్రభావితమయ్యాక వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి వచ్చింది.దీంతో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి పలు రంగాల ఉద్యోగులు అలవాటుపడ్డారు. కొంతకాలంగా పరిస్థితులు సద్దుమణగడంతో ఐటీతో సహా పలు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడం తప్పనిసరి చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల మనోగతం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘సీఐఈఎల్ హెచ్‌ఆర్’ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైబ్రిడ్ పనివిధానమే (ఆన్‌లైన్+ఆఫ్‌లైన్) మేలని అధికశాతం టెకీలు, ఇతర రంగాల ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తప్పనిసరిగా ఆఫీసుల నుంచే పనిచేయాలని పట్టుబట్టకుండా వర్క్ ఫ్రం హోం లేదా వారానికి ఒకరోజు ఆఫీసుకు రావడం లాంటి పద్ధతులను అనుమతించాలనే డిమాండ్ పెరుగుతోంది.
వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ విధానానికి అనుమతించకపోతే వేరే కంపెనీల్లోకి మారేందుకూ సిద్ధమని 73 శాతం టెకీలు, ఇతర ఉద్యోగులు చెప్పినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, 35 శాతం మంది మాత్రం ఆఫీసుల నుంచి పనిచేసే రోజుల సంఖ్యను పెంచడాన్ని స్వాగతించారు. 26 శాతం మంది ఆఫీసు నుంచి పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐటీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న 3,800 ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే నివేదిక రూపొందించారు.
వర్క్ ఫ్రం ఆఫీసుకు కంపెనీల మొగ్గు
ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది.
రెండువందలకు పైగా కంపెనీల్లో డెలాయిట్ ఇండియా బెనిఫిట్స్ ట్రెండ్స్ 2023 నిర్వహించిన సర్వేలో... 88 శాతం ఉద్యోగులు ఏదో ఒక రూపంలో తమకు అనుకూలమైన పని పద్ధతులను మార్చుకున్నట్లు వెల్లడైంది. ఐటీసీ సంస్థ వర్క్ ఫ్రం ఆఫీస్‌ను పునఃప్రారంభించడంతోపాటు కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులను వారానికి రెండురోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది.
డీబీఎస్ బ్యాంక్ ఇండియా నిర్వహించిన సర్వేలో హైబ్రిడ్ విధానానికి అత్యధికులు మొగ్గుచూపుతున్నట్టు తేలింది. దీనికి అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన హైబ్రిడ్ వర్క్‌మోడల్/ ఫ్లెక్సిబుల్ వర్క్ వసతులను రూపొందించినట్టు డీబీఎస్ బ్యాంక్ ఇండియా హెచ్‌ఆర్ కంట్రీ హెడ్ కిషోర్ పోడూరి తెలిపారు. హైబ్రిడ్ విధానంతో వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు ట్రాఫిక్‌రద్దీ, వాహన కాలుష్యం నుంచి ఉపశమనం దొరుకుతుందని ఉద్యోగులు భావిస్తున్నట్లు చెప్పారు.
అనుకూలమైన పని గంటలు
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండే సంప్రదాయ ఆఫీసు పనివేళల విధానం కాకుండా నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులు తమకు అనుకూలమైన పని సమయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతోంది. దీంతో వారు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. –నీలేశ్ గుప్తా, డైరెక్టర్, డెలాయిట్ ఇండియా
వర్క్‌ఫోర్స్ ఉండేలా...
ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పని ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన మార్పులపై కంపెనీలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఉత్పాదకతను పెంచే వర్క్‌ఫోర్స్, నైపుణ్య ఉద్యోగులు ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.–ఆదిత్య నారాయణ్ మిశ్రా, సీఈవో, సీఐఈఎల్ హెచ్‌ఆర్
హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ అంటే...
ఆఫీసు, ఇంటి నుంచి పనిచేయడాన్ని సమ్మిళితం చేస్తే హైబ్రిడ్ పనివిధానం అవుతుంది. ఇందులో వారంలో కొద్ది రోజులు ఆఫీసు నుంచి, కొద్దిరోజులు ఇంటి నుంచి పనిచేస్తారు. యాజమాన్యం, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పని విధానాన్ని, ఆఫీసు వేళలను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల ఇళ్లకు దగ్గర్లోని లేదా ఉద్యోగులకు అనుకూలంగా ఉండే కో వర్కింగ్ ప్లేస్‌ల నుంచి పనిచేసే వీలు కూడా కల్పిస్తారు. దీంతో యాజమాన్యాలు, ఉద్యోగులకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment