సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులకు మరో అవకాశం లభించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి డిగ్రీలో చేరేందుకు సంబంధించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్ 15తో ముగిసింది. ఇప్పటివరకూ వివిధ కోర్సుల్లో దాదాపు 2.20 లక్షల మంది ప్రవేశాలు పొందారు.
అయితే ఇప్పటివరకూ బీఫార్మసీ, న్యాయవాద వృత్తి కోర్సుల్లో ప్రవేశానికి ప్రయత్నించిన విద్యార్థులు, అక్కడా సీటు రాకపోవడంతో డిగ్రీలో చేరేందుకు సిద్ధపడ్డారు. కానీ, దోస్త్ అడ్మిషన్ల తేదీ ముగియడంతో విద్యార్థులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి దోస్త్ ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ల తేదీని నిర్ణయించారు. దీంతో అనేకమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరబోతోంది. దీనివల్ల మరో 15 వేల వరకూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు లింబాద్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment