
భోపాల్‌లో దిగిపోవాలనుకున్న ముఖియా గ్యాంగ్
అదే జరిగి ఉంటే అందరూ చిక్కడం కష్టసాధ్యమే
నిందితులు దొరికినా చోరీ సొత్తు రికవరీ దుర్లభమే
స్నేహలత దేవి ఉదంతమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ
సాక్షి, హైదరాబాద్ : నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ అధినేత రోహిత్ కేడియా ఇంటి నుంచి రూ.40 కోట్ల సొత్తు, నగదుతో ఉడాయించిన త్రయం మోల్హు ముఖియా, సుశీల్ ముఖియా, బసంతి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కింది. నగరం నుంచి ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కిన వీరు ముగ్గురూ భోపాల్‌లో ట్రైన్ దిగిపోవాలని భావించారు. అదే జరిగితే వారు చిక్కడం కష్టసాధ్యమయ్యేదని, నిందితులు దొరికినా సొత్తు రికవరీ అయ్యేది కాదని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరిలో దోమలగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకున్న స్నేహలత దేవి ఉదంతాన్నే ఉదాహరణగా చూపుతున్నారు.
నమ్మకంగా పని చేసిన మహేష్ కుమార్..
బీహార్ రాష్ట్రం, మధుబని జిల్లా, బిరోల్‌కు చెందిన చెందిన మహేష్‌కుమార్ ముఖియా 2023 డిసెంబర్‌లో నగరానికి వలసవచ్చాడు. తన సోదరి వద్ద ఉంటూ... స్నేహితుడి ద్వారా దోమలగూడకు చెందిన సువర్య పవ గుప్తా ఇంట్లో కేర్ టేకర్‌గా చేరాడు. గుప్తా తల్లి స్నేహలత దేవి (62) వయస్సు రీత్యా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు సపర్యలు చేస్తూ నమ్మకం సంపాదించుకున్నాడు. గుప్తాతో పాటు అతడి కుటుంబీకులు ప్రతి రోజూ తమ వ్యాపార కార్యకలాపాల కోసం ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేవారు. ఆ సమయంలో స్నేహలత మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఈ విషయం తెలిసిన మహేష్ ఆమెను బంధించి, ఇంట్లో ఉన్న సొమ్ము, సొత్తు కాజేయాలని గత ఏడాది జనవరిలో పథకం వేశాడు.
మోల్హు ముఖియాను పిలిపించి...
దీనికి సహకరించడానికి తన గ్రామానికే చెందిన మోల్హు ముఖియాను పిలిపించుకున్నాడు. గత ఏడాది జనవరి 27న వచ్చిన ఇతగాడు మహేష్ వద్దే ఉన్నాడు. వృద్ధురాలిని బంధించడానికి, నోటికి వేయడానికి అవసరమైన తాళ్లు, టేపు తదితరాలతో పాటు ఓ బ్యాగ్‌ను కొనుగోలు చేశాడు. గత ఏడాది జనవరి 31న ఎప్పటిలానే పనికి వచ్చిన మహేష్... కుటుంబీకులు అంతా బయటకు వెళ్లిన తర్వాత మనోజ్‌ను రప్పించాడు. ఆ సమయంలో హాల్‌లోని సోఫాలో కూర్చున్న స్నేహలతపై ఇరువురూ దాడి చేశారు. ఆమెను చంపేసి రూ.కోటి విలువైన ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని ఉడాయించారు.
మూడుసార్లు బీహార్ వెళ్లిన టాస్క్‌ఫోర్స్...
అప్పట్లో ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సువర్య
పవ గుప్తా వద్ద మహేష్ ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంగా బీహార్ వెళ్లింది. అతడి ఆచూకీ లేకపోవడంతో మరో మూడు నెలలకు మరోసారి వెళ్లి... అతడి గ్రామానికి చెందిన వ్యక్తిని ఇన్‌ఫార్మర్‌గా మార్చుకువచ్చింది. ఎట్టకేలకు గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలో మహేష్ తన గ్రామానికి చేరుకున్నాడు.
ఈ విషయం ఇన్‌ఫార్మర్ ద్వారా తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు హుటాహుటిన వెళ్లి మహేష్ ను అరెస్టు చేశారు. అయితే సొత్తు మొత్తం తమకు సహకరించిన మోల్హుతో పాటు రాహుల్ అనే మరో నిందితుడి దగ్గర ఉన్నట్లు అతడు చెప్పాడు. దీంతో ఎనిమిది నెలల తర్వాత మహేష్, తాజా నేరంలో మోల్హు పట్టుబడినా . ఆ కేసుకు సంబందించి కనీసం రూ.100 విలువైన సొత్తు కూడా రికవరీ కాలేదు. కేడియా ఇంట్లో చోరీ చేసిన ముగ్గురూ కూడా భోపాల్‌లో రైలు దిగి ఉంటే ఇదే పరిస్థితి ఉండేదని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment