
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పీఏ వంశీకృష్ణతో సహా ముగ్గురు అరెస్ట్ అయ్యారు.
సిద్ధిపేట్ జిల్లా, నియోజకవర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. ఓ రైతుకు తెలీకుండా అతని డాక్యుమెంట్స్‌తో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేశారు. ఆ సిమ్‌ను వినియోగించి చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై చక్రధర్ గౌడ్ గతేడాది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుల్ని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28వరకు ముగ్గురికి రిమాండ్ విధించారు. కాగా, ఇదే కేసులో ఏ-1గా హరీష్ రావు,ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు.
