ఇంజినీరింగ్‌ పల్టీ | Engineering Course Not Interested Students In Nellore | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ పల్టీ

Published Thu, Aug 2 2018 9:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:23 PM

Engineering Course Not Interested Students In Nellore - Sakshi

జిల్లాలో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల ఆశలు, కలలు, ఆలోచనలు బూమరాంగ్‌ అయ్యాయి. గత రెండు.. మూడేళ్లుగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిల్లా మొత్తంగా ఉన్న కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా, రెండు కళాశాలల్లో ‘0’ శాతం, మరో రెండు కళాశాలల్లో 4 శాతం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరాల్లో భర్తీ కానీ సీట్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

నెల్లూరు (టౌన్‌): ఒకప్పుడు విద్యార్థులు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏ బ్రాంచ్‌లో అయినా పర్వాలేదు సీటు దొరికితే చాలు అదృష్టంగా భావించే వారు. అప్పట్లో కళాశాలల యాజమాన్యం చెప్పిందే వేదం. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఒక్క విద్యార్థి దొరికితే చాలు కళాశాలను నడుపుకుందామనే ధోరణిలో పలు కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఆయా కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆయా కళాశాలల్లో చేరిన విద్యార్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్‌ సమయంలో 106 మంది జారుకున్నారు.
  
జిల్లా వ్యాప్తంగా 56.56 శాతం భర్తీ 
ఇంజినీరింగ్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ గత నెల 31తో ముగిసింది. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. జిల్లాలో ఏ కళాశాలలోనూ 100 శాతం సీట్లు భర్తీ కాలేదు. కావలి ప్రాంతంలో ఉన్న ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మాత్రం 90.82 శాతం సీట్లు భర్తీ అయి ప్రథమ స్థానంలో, ఆ తర్వాత 88.62 శాతం భర్తీతో నారాయణ రెండో స్థానంలో నిలిచాయి. 87.04 శాతంతో శ్రీవెంకటేశ్వర మూడో స్థానం, 85.98 శాతంతో గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాల నాలుగో స్థానంలో నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,245 సీట్లు ఉన్నాయి. వాటిల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత 3,538 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,707 సీట్లు మిగిలి పోయాయి. జిల్లాలో రెండు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో జీరో శాతం అడ్మిషన్లు ఉండగా, మరో రెండు కళాశాలల్లో 4 శాతం లోపు అడ్మిషన్లు ఉండటం గమనార్హం. 20 శాతం లోపు 2 కళాశాలలో 50 శాతం లోపు 6 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని 10 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 50 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి.
 
సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌లకు డిమాండ్‌ 
ఇంజినిరింగ్‌లో సీఎస్‌ఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్‌ ఈ, ఈసీఈ, ఐటీ తదితర బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే సీఎస్‌ఈ, ఈఎస్‌ఈ బ్రాంచ్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఈ రెండు బ్రాంచ్‌ల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరవచ్చన్న భావనలో విద్యార్థులు ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పూర్తయిన బ్రాంచ్‌లను పరిశీలిస్తే సీఎస్‌ఈలో 70.20 శాతం సీట్లు భర్తీ కాగా ఈసీఈలో 65.3 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 38.4 శాతం, ట్రిపుల్‌ ఈ లో 41.1 శాతం, మెకానికల్‌లో 50.2 శాతం, ఐటీ 34.5 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం.

మూత దిశగా కొన్ని కళాశాలలు 
ఇంజినీరింగ్‌లో ఆశించిన మేర విద్యార్థులు చేరక పోవడంతో కొన్ని కళాశాలలు మూత పడే దిశలో ఉన్నాయి. గత ఏడాది అనుభావాలను దృష్టితో ఈ ఏడాది సుమారు 2 వేలు సీట్లను వదులుకున్నారు. ప్రధానంగా జిల్లాలో చదివిన విద్యార్ధులు ఇక్కడ ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరకుండా ఎక్కువ మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.  ఈ రీతిలో జిల్లా నుంచి ప్రతి ఏటా సుమారు 14 వేల మందికి పైగా విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ చదివేందుకు వెళుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎక్కువ కళాశాలల్లో బీటెక్‌ పూర్తి చేసిన వారితోనే బోధన చేయిస్తున్నారన్న ప్రచారం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement