
అతను ఆమె నమ్మకాన్ని, గౌరవాన్ని పోగొట్టాడు
ఇంటిమేట్ వీడియో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం
క్రిమినల్ కేసు కొట్టేయాలంటూ భర్త వేసిన పిటిషన్ తిరస్కరణ
ప్రయాగ్‌రాజ్: భార్య తనతో ఉన్న ఇంటిమేట్ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వ్యక్తిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోగానే భార్యకు భర్త యజమాని అయిపోడని వ్యాఖ్యానించింది. అతనిపై క్రిమినల్ కేసు కొట్టేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
‘ఇంటిమేటెడ్ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి దరఖాస్తుదారుడు (భర్త) వివాహ బంధానికున్న పవిత్రతను ఉల్లంఘించారు. భార్య తనపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టారు. భార్య గౌరవాన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం భార్యాభర్తల మధ్య బంధాన్ని నిర్వచించే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది.
ఈ నమ్మక ద్రోహం వైవాహిక
బంధం పునాదినే దెబ్బతీస్తుంది’అని విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్ దివాకర్ వ్యాఖ్యానించారు. భార్య అంటే భర్తకు కొనసాగింపు కాదని, తనకంటూ సొంత హక్కులు, కోరికలు, ఉన్న వ్యక్తని ఆయన పేర్కొన్నారు. తామిద్దరూ సాన్నిహిత్యంతో ఉన్న వీడియోలను తన భర్త మొబైల్‌లో చిత్రీకరించి, తనకు తెలియకుండా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడని, తరువాత బంధువులు, గ్రామస్తులతో పంచుకున్నాడంటూ మీర్జాపూర్ జిల్లాలో ప్రద్యుమ్న్ యాదవ్ అనే వ్యక్తిపై అతని భార్య కేసు నమోదు చేసింది.
తాను ఆమె భర్త కాబట్టి అది నేరం కాదని, తనపై మోపిన క్రిమినల్ కేసులను కొట్టేయాలని ప్రద్యుమ్న్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది కాబట్టి.. కేసును కొట్టేయాలంటూ ఆయన తరపు న్యాయవాది సైతం వాదించారు. ఫిర్యాదుదారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అయినప్పటికీ, ఆమెను అశ్లీల వీడియో తీసి బంధువులకు, గ్రామస్తులకు పంపే హక్కు భర్తకు లేదని కోర్టు తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment