
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం.
సంప్రదాయ చేతివృత్తులు చేసే వెనుకబడిన వర్గాల కోసంప్రారంభించిన కేంద్రప్రభుత్వ పథకం ఇది. దీని కింద మూడు లక్షల రూపాయల వరకు రుణసదుపాయాన్ని పొందవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి
దగ్గరలోని మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫోన్ నంబర్‌తో లింక్ అయిన ఆధార్‌కార్డ్, అడ్రస్ ప్రూఫ్‌గా రేషన్‌కార్డ్, రేషన్‌కార్డ్‌లోని కుటుంబ సభ్యులందరి ఆధార్‌కార్డ్‌లు, కులధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ సమర్పించాలి. వేలిముద్ర వేయాలి. అయితే రేషన్‌కార్డ్‌లోని కుటుంబ సభ్యులెవరైనా ఆదాయపన్ను కడుతున్నా, అంతకుముందు ముద్రాలోన్స్ కానీ, పీఎమ్‌ఈజీపీ పథకాలేవైనా కానీ పొంది ఉన్నా ఈ పథకానికి అనర్హులు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా ఈ పథకం వర్తించదు. దరఖాస్తులో పూర్తి వివరాలు నింపిన తరువాత మీ సేవాకేంద్రంలోనే వారే రుణాన్ని అందించే బ్యాంకును సూచిస్తారు. దరఖాస్తు సచివాలయానికి వెళ్తుంది. తనిఖీ పూర్తయ్యాక లోన్‌కి అనుమతి ఇస్తారు. అప్పుడా దరఖాస్తు కేంద్రప్రభుత్వానికి వెళుతుంది. వాళ్లు అప్రూవల్ సర్టిఫికెట్, ఐడీ కార్డ్‌ను మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత మండలకేంద్రంలోని ఫ్రీ ట్రైనింగ్ సెంటర్‌లో అయిదు రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి.
దానిపైన 15 రోజులు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్‌ను కూడా పొందవచ్చు. రోజుకు రూ. 500 చొప్పున శిక్షణాకాలంలో స్టైపండ్ ఉంటుంది. ఈ మొత్తాన్ని శిక్షణ ముగిసిన తరువాత అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. ట్రైనింగ్ పూర్తయిన వారికి 15 వేల రూపాయల టూల్ కిట్ లేదా రూ. 15 వేల ‘ఈ – రూపీ’ వోచర్‌ను ఇస్తారు. అభ్యర్థులు సంబంధిత షాప్స్‌లో ‘ఈ–రూపీ’ వోచర్‌ను ఇచ్చి టూల్ కిట్‌ను పొందవచ్చు.
లోన్ విషయానికి వస్తే తొలి విడతగా 40 పైసల వడ్డీతో లక్ష రూపాయలను ఇస్తారు.18 నెలల కాలంలో ఆ రుణాన్ని చెల్లించేశాక, మలి విడతగా 30 నెలల టెన్యూర్‌తో రెండు లక్షల రూపాయల రుణాన్ని పొందవచ్చు. అయితే అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ తీసుకున్నవారు మాత్రమే మలి విడత రుణసాయం పొందడానికి అర్హులు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం నిర్వహించే చేతివృత్తుల మేళాల్లో ఉచితంగా స్టాల్స్ పెట్టుకునే సౌకర్యాన్ని పొందవచ్చు. అయితే ప్రతి వ్యాపారీ తమ లావాదేవీలను క్యూఆర్ స్కానర్ ద్వారే నెరపాల్సి ఉంటుంది. దాని ద్వారానే బ్యాంక్ ఈఎమ్‌ఐ కట్ అవుతుంది కాబట్టి. ఈ విధానం వల్ల ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది శిక్షణ పొందారు, ఎంతమంది వ్యాపారాలు మొదలుపెట్టారు, తిరిగి చెల్లింపులు ఎలా ఉన్నాయి వంటి డేటా ఉంటుంది, మున్ముందు పథకాల ప్రణాళికను రచించడానికి వీలవుతుంది. ఈ ప్రత్యేక పథకం ద్వారా రుణం పొందడానికి ప్రత్యేక విద్యార్హతలు అవసరం లేదు. కులధ్రువీకరణ పత్రం ఉంటే చాలు.
కమ్మరి, శిల్పకారులు, స్వర్ణకారులు, వడ్రంగి, పడవ తయారీదారులు, కవచ తయారీదారులు, తాళాల తయారీదారులు, సుత్తి.. సాధన కిట్ తయారీదారులు, రాళ్లు పగులగొట్టేవారు, చర్మకారులు, పాదరక్షల తయారీదారులు, తాపీ పనిచేసేవారు, బుట్టు.. చాపలు.. చీపుర్లు తయారుచేసేవారు, దండల తయారీదారులు, బొమ్మల తయారీదారులు, క్షురక, ధోబీ, దర్జీ, చేపల వలల తయారీదారులు ఈ పథకానికి అర్హులు. 2023–24లో మొదలైన ఈ పథకం 2027–28 వరకు అమలులో ఉంటుంది. ఇప్పటి వరకు దీని కోసం కేంద్రప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది.
– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్
మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.com
నిర్వహణ : సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment