బీబీఏ, బీసీఏ కోర్సు కనీస ఫీజు రూ.18 వేలు | The minimum fee for BBA and BCA course is Rs 18 thousand | Sakshi
Sakshi News home page

బీబీఏ, బీసీఏ కోర్సు కనీస ఫీజు రూ.18 వేలు

Published Fri, Aug 2 2024 5:22 AM | Last Updated on Fri, Aug 2 2024 5:22 AM

The minimum fee for BBA and BCA course is Rs 18 thousand

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏడాదికి కనీస ఫీజును రూ.18 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుమారు 35 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఈ డిగ్రీ కోర్సులు తొలిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గరిష్ట ఫీజు రూ.30 వేలుగా నిర్ణయించారు. వాస్తవానికి బీబీఏ, బీసీఏ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి రావడంతో డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 

కాగా, రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ రెండు సార్లు వాయిదా పడింది. అయితే ఏఐసీటీఈ బీబీఏ, బీసీఏ కోర్సులు కోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్‌ కళాశాలలు అనుమతివ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తొలిసారిగా ఫీజులు నిర్ణయించడంలో డిగ్రీ అడ్మిషన్లు అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. గురువారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకుంటున్నారు. 

5వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించగా.. 6వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. 10వ తేదీన డిగ్రీ సీట్లు కేటాయింపు చేపట్టి 12వ తేదీ తరగతులు ప్రారంభించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 16వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.  

1.63 లక్షల దరఖాస్తులు 
ఏపీలోని డిగ్రీ కోర్సుల్లో మొత్తం 3.50 లక్షల సీట్లుండగా.. ఏటా 50 శాతం లోపు సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ ఏడాది 1.63 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల బీబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్‌ పెరగడంతోనే ఇంజనీరింగ్‌ కాలేజీలు సైతం ఈ కోర్సులను ప్రవేశపెట్టడం గమనార్హం. వీటితో పాటు మొత్తం డిగ్రీ కాలేజీల్లో దాదాపు 800 కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement