ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు | Andhra Pradesh Govt Strict action against colleges that do not meet standards | Sakshi
Sakshi News home page

ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు

Published Thu, Oct 28 2021 3:16 AM | Last Updated on Thu, Oct 28 2021 3:16 AM

Andhra Pradesh Govt Strict action against colleges that do not meet standards - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాలు ఉండాలి. ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై ఉదాసీనత వద్దు. కొంత సమయమివ్వండి. అప్పటికీ ప్రమాణాలు పాటించకపోతే అనుమతులు ఇవ్వవద్దు’..  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత విద్యా శాఖాధికారులకు పలు సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పలుమార్లు గడువిచ్చినా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేస్తోంది. జీరో అడ్మిషన్లు, 25 శాతం లోపు చేరికలు ఉన్న కాలేజీలకు అనుమతులు నిలిపివేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే విద్యారంగంపై, ముఖ్యంగా ఉన్నత విద్యలో ప్రమాణాలపై దృష్టి సారించారు.

కాలేజీల్లో ప్రమాణాల పెంపునకు ప్రొఫెసర్‌ బాలకృష్ణన్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి అధ్యయనం చేయించారు. నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ కోర్సుల ఏర్పాటు, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్, కాలేజీలకు న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు పొందేలా చర్యలు, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు.. ఇలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు ఫీజులను పూర్తిస్థాయిలో రీయింబర్స్‌ చేయడమే కాకుండా వారికి వసతి, భోజనాల కోసం రూ.20 వేల వరకు ఏటా చెల్లిస్తున్నారు. ఇన్ని చేస్తున్నందున లక్ష్యాలకు అనుగుణంగా కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలకు ఉన్నత విద్యా మండలి చేపట్టింది.

337 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 91 ఇంజనీరింగ్, 21 ఫార్మా  కాలేజీలు కాకినాడ జేఎన్‌టీయూకు కోట్ల రూపాయల రుసుములు బకాయి ఉన్నాయి. ఈ కాలేజీలకు ఈ ఏడాది పూర్తిగా అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది వీటికి కొన్ని షరతలతో అడ్మిషన్లు నిర్వహంచారు. ఈసారి మాత్రం నవంబరు 1వ తేదీ లోపు బకాయిలు చెల్లిస్తేనే అనుమతిస్తామని స్పష్టంచేసింది. కొన్నేళ్లుగా చేరికలు తగ్గుతూ ఒక్క విద్యార్థి కూడా చేరని కాలేజీలు అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో  28, కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలో 22 ఉన్నాయి. వీటికి కూడా ప్రవేశాలు నిలిపివేయనున్నారు. ఇక యూనివర్సిటీల గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 40 ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిలిపివేసింది. 257 కాలేజీల్లో విద్యార్థుల చేరికలు లేని 454 ప్రోగ్రాముల్లో కూడా  అడ్మిషన్లు నిలిపివేస్తున్నారు.


డిగ్రీ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే
విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులన్నింటినీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే అందించేలా ప్రభుత్వం చర్యలు  చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా అందించే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కానుంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్థానిక మాతృభాషల్లోనే బోధిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement