government degree colleges
-
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏఐతో బోధన
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో ప్రపంచ స్థాయి బోధన ప్రమాణాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ)తో పాఠాలు బోధించనుంది. అధ్యాపకులు పాఠ్యపుస్తకాలు చూస్తూ, బ్లాక్ బోర్డులపై రాస్తూ పాఠాలు చెప్పే విధానాన్ని ఏఐతో భర్తీ చేయనుంది. విద్యార్థులను ఆకట్టుకుంటూ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంచేలా అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్)ల్లో బోధించనుంది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘వర్చువల్ లెర్నింగ్ ల్యాబ్స్’ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ అమెరికాకు చెందిన ‘జెడ్ స్పేస్’ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. తొలి దశలో సైన్స్ పాఠాలు.. విద్యార్థులకు పాఠ్యాంశాలను త్రీడీ విధానంలో విజువలైజ్ చేసి బోధించడం తాజా ప్రాజెక్ట్ లక్ష్యం. ఇందుకోసం జెడ్‌స్పేస్ అందించే ప్రత్యేక ల్యాప్‌టాప్‌ను వినియోగించనున్నారు. తొలి దశలో సైన్స్ కోర్సుల్లోని పలు సబ్జెక్టుల పాఠ్యాంశాలకు వర్చువల్ కంటెంట్‌ను తయారు చేసి బోధన చేయనున్నారు. సైన్స్ సబ్జెక్టుల్లో సుమారు 40 టాపిక్స్‌కు చెందిన కంటెంట్‌ను జెడ్‌స్పేస్ ఉచితంగా అందిస్తోంది. దీనికి అదనంగా మరో 60 టాపిక్స్‌కు కంటెంట్‌ను కళాశాల విద్యాశాఖ రూపొందించనుంది. దీనికోసం జెడ్‌స్పేస్ అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఏఐ బోధన.. ఇప్పటికే ప్రభుత్వం డిగ్రీ విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు తరగతి గది బోధనతోపాటు 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడం ద్వారా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే 2023–24లో సింగిల్ మేజర్, సింగిల్ మైనర్ సబ్జెక్టు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులో పరిపూర్ణ విజ్ఞానాన్ని సాధించేలా మార్గం సుగమం చేసింది. ఈ క్రమంలోనే కళాశాల విద్యాశాఖ సుమారు 80 రకాల సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్‌ను ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అందిస్తోంది. ఆర్ట్స్‌లో 23, కామర్స్‌లో 15, బయోలాజికల్ సైన్స్‌లో 15, ఫిజికల్ సైన్స్‌లో 15, కెమికల్ సైన్స్‌లో 5, మ్యాథ్స్‌లో 3, ఒకేషనల్ కోర్సుల్లో 4 ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టింది. తొలుత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ నాలుగు కోర్సుల్లో సింగిల్ మేజర్లు ఉన్న కళాశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ‘ఏఐ’ విధానంతో బోధనను తెస్తోంది. త్రీడీ అద్దాలు లేకుండానే.. జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్‌లు వర్చువల్ రియాలిటీ సామర్థ్యాలతో కూడిన పోర్టబుల్ వర్క్స్టేషన్లుగా పనిచేస్తాయి. దీన్ని ఉపయోగించే వ్యక్తులు త్రీడీ అద్దాలు ధరించాల్సిన అవసరం లేదు. ఇందులోని వర్చువల్ ఆబ్జెక్టులు స్క్రీన్ వెలుపల, లోపలకి కదలాడుతూ వాస్తవికంగా కనిపిస్తాయి. ఉదాహరణకు అనాటమీ టాపిక్ బోధనలో మానవ శరీర నిర్మాణాన్ని త్రీడీ ఇమేజ్‌ల ద్వారా ఒక్కో లేయర్‌ను వివరిస్తూ లోపలి భాగాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు వీలుగా బోధన చేయొచ్చు. వాస్తవానికి జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్ ఎదురుగా కూర్చుని ఆపరేట్ చేసే వ్యక్తికి మాత్రమే త్రీడీ ఎఫెక్ట్స్‌లో సబ్జెక్ట్ కనిపిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌కు ప్రత్యేకంగా జెడ్‌వ్యూ కెమెరాను అమర్చడం ద్వారా ప్రొజెక్టర్‌ను ఉపయోగించి ఎక్కువ మందికి స్క్రీన్‌పై త్రీడీ అనుభూతిని అందించవచ్చు. ఇందుకు వీలుగా సాధారణ ప్రొజెక్టర్స్ స్థానంలో అత్యాధునిక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత ఆరు కళాశాలల్లో.. ప్రస్తుత సెమిస్టర్ నుంచి ఏఐ టెక్నాలజీ సాయంతో బోధన చేసేందుకు వీలుగా కళాశాల విద్యాశాఖ ఆరు కళాశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. కడప (మహిళ), అనంతపురం (మెన్), రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ, విజయవాడ ఎస్ఆర్ఆర్– సీవీఆర్ డిగ్రీ కాలేజీ, గుంటూరు (మహిళ), విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జెడ్‌స్పేస్ ల్యాప్‌టాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా సుమారు 50 కళాశాలల్లో అమలు చేయనుంది. జెడ్‌స్పేస్ సాంకేతికత వినియోగంపై ఇప్పటికే అధ్యాపకులకు సైతం శిక్షణ పూర్తయింది. -
డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ షురూ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 11 సబ్జెక్టుల్లో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డిసెంబర్ 30న సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సబ్జెక్టుల వారీగా పోస్టులు, వేతనం, రిజర్వేషన్, విద్యార్హతలు వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్ కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. -
240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలల్లో డిప్యుటేషన్‌పై అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరితోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించామన్నారు. ఉన్నత విద్యతోపాటు ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని శనివారం భాస్కరరావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. వీటిలో రూ.391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ.14.5 కోట్ల చొప్పున త్వరలో మంజూరు కానున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాగా 124 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాడు– నేడు కింద భవనాల ఆధునికీకరణకు రూ.271 కోట్లు విడుదల కావాల్సి ఉందని భాస్కరరావు తెలిపారు. కొత్తగా వస్తున్న ఆరు డిగ్రీ కళాశాలల్లో ఒక్కో దానిలో 24 మంది అధ్యాపకులు, మరో 10 ఇతర పోస్టులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆరు కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి రూ.1.67 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విధానంలో భాగంగా కొత్తగా 54 కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. కళాశాలల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు. డిగ్రీతోపాటు పలు ఉపాధి కోర్సులు డిగ్రీ కోర్సులతోపాటు విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పలు కోర్సులను జోడించామని భాస్కరరావు తెలిపారు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్లో 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్.ఐ.విజయబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డిగ్రీ కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విలీనమైన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాల చెల్లింపు, ఇతర సర్దుబాటు చర్యల కోసం ప్రభుత్వం ఆయా కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం జీవో 17 విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చేసిన విధాన నిర్ణయం ప్రకారం ప్రభుత్వంలో తమ సిబ్బందిని విలీనం చేసేందుకు 125 ఎయిడెడ్ కాలేజీల యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. వీరిలో 895 మంది బోధన సిబ్బంది, 1,120 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. బోధన సిబ్బందిలో 864 మందిని వివిధ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న క్లియర్ వేకెన్సీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. మిగతా 31 మందిని కొత్తగా మంజూరుచేసిన కాలేజీల్లోకి పంపారు. అయితే అక్కడ ఇంకా మంజూరు కాని పోస్టుల్లో వారిని నియమించారు. అలాగే ప్రభుత్వంలో విలీనమైన 23 మంది ప్రిన్సిపాళ్లకు ఖాళీలు లేనందున ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. బోధనేతర సిబ్బందిలో 921 మందిని క్లియర్ వేకెన్సీల్లో సర్దుబాటు చేశారు. బోధనేతర సిబ్బందిలో మిగిలిన 199 మందితోపాటు 23 మంది ప్రిన్సిపాళ్లు, 31 మంది టీచింగ్ స్టాఫ్ కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు అవసరమని కాలేజీ విద్యా కమిషనర్ ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం ఆమేరకు పోస్టులు మంజూరు చేసింది. -
ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ‘ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాలు ఉండాలి. ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై ఉదాసీనత వద్దు. కొంత సమయమివ్వండి. అప్పటికీ ప్రమాణాలు పాటించకపోతే అనుమతులు ఇవ్వవద్దు’.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యా శాఖాధికారులకు పలు సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పలుమార్లు గడువిచ్చినా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేస్తోంది. జీరో అడ్మిషన్లు, 25 శాతం లోపు చేరికలు ఉన్న కాలేజీలకు అనుమతులు నిలిపివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే విద్యారంగంపై, ముఖ్యంగా ఉన్నత విద్యలో ప్రమాణాలపై దృష్టి సారించారు. కాలేజీల్లో ప్రమాణాల పెంపునకు ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి అధ్యయనం చేయించారు. నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సుల ఏర్పాటు, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్, కాలేజీలకు న్యాక్, ఎన్బీఏ గుర్తింపు పొందేలా చర్యలు, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు.. ఇలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు ఫీజులను పూర్తిస్థాయిలో రీయింబర్స్ చేయడమే కాకుండా వారికి వసతి, భోజనాల కోసం రూ.20 వేల వరకు ఏటా చెల్లిస్తున్నారు. ఇన్ని చేస్తున్నందున లక్ష్యాలకు అనుగుణంగా కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలకు ఉన్నత విద్యా మండలి చేపట్టింది. 337 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 91 ఇంజనీరింగ్, 21 ఫార్మా కాలేజీలు కాకినాడ జేఎన్టీయూకు కోట్ల రూపాయల రుసుములు బకాయి ఉన్నాయి. ఈ కాలేజీలకు ఈ ఏడాది పూర్తిగా అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది వీటికి కొన్ని షరతలతో అడ్మిషన్లు నిర్వహంచారు. ఈసారి మాత్రం నవంబరు 1వ తేదీ లోపు బకాయిలు చెల్లిస్తేనే అనుమతిస్తామని స్పష్టంచేసింది. కొన్నేళ్లుగా చేరికలు తగ్గుతూ ఒక్క విద్యార్థి కూడా చేరని కాలేజీలు అనంతపురం జేఎన్టీయూ పరిధిలో 28, కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 22 ఉన్నాయి. వీటికి కూడా ప్రవేశాలు నిలిపివేయనున్నారు. ఇక యూనివర్సిటీల గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 40 ప్రైవేటు అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిలిపివేసింది. 257 కాలేజీల్లో విద్యార్థుల చేరికలు లేని 454 ప్రోగ్రాముల్లో కూడా అడ్మిషన్లు నిలిపివేస్తున్నారు. డిగ్రీ కోర్సులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులన్నింటినీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా అందించే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానుంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్థానిక మాతృభాషల్లోనే బోధిస్తున్నారు. -
తగ్గిన చేరికలు..వెలవెలబోతున్న డిగ్రీ విభాగాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించాల్సిన కాలేజీల యాజమాన్యాల నిర్లిప్తతతో చేరికల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బోధనా సిబ్బంది, సదుపాయాల కల్పన విషయంలో యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీని పూర్తిగా ఆన్లైన్లో ప్రభుత్వమే ‘ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) ద్వారా పారదర్శకంగా నిర్వహించింది. విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో నచ్చిన సీటు పొందేలా అవకాశం కల్పించింది. ఈ అడ్మిషన్ల ప్రక్రియను మూడు విడతల్లో ఉన్నత విద్యామండలి నిర్వహించింది. 152 ప్రభుత్వ కాలేజీలు, 120 ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు, 1,062 ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేశారు. ఈ కాలేజీల్లో 4,96,055 సీట్లు ఉండగా 2,61,383 సీట్లను ఆన్లైన్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు కేటాయించారు. పలు కాలేజీల్లో సీట్లు సగానికి పైగా ఖాళీగా మిగిలాయి. సరైన ప్రమాణాలను పాటించకపోవడం, సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు వాటిల్లో చేరేందుకు విముఖత చూపారు. పలు కోర్సుల్లో సీట్లు ఖాళీ... మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం చేరికలను పరిశీలిస్తే పలు కాలేజీల్లో కొన్ని కోర్సుల్లో ఒకరిద్దరు మాత్రమే చేరగా మరికొన్ని చోట్ల 10 నుంచి 20 మంది లోపే ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని 48 విభాగాల్లో, ఎయిడెడ్ కాలేజీల్లోని 194 విభాగాల్లో, ప్రయివేటు కాలేజీల్లోని 1,309 విభాగాల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. దీంతో ఆయా కాలేజీల్లో కోర్సుల కొనసాగింపు సమస్యగా మారింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తక్కువ చేరికలున్న కోర్సుల విద్యార్థులను ఇతర కాలేజీలలోని అదే కోర్సులకు లేదా అక్కడే ఇతర కోర్సులలోకి మార్పు చేసే ప్రక్రియ చేపట్టారు. దాదాపు 1,600 మంది విద్యార్థులను ఇలా తరలిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో మాత్రం తక్కువ చేరికలున్న కోర్సుల నుంచి మార్పులు చేసుకొనేందుకు ఇదివరకే అడ్మిషన్ల సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు అవకాశం కల్పించింది. చేరికలు తక్కువగా ఉన్న కాలేజీలపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. సరైన ప్రమాణాలు పాటించని కాలేజీలకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ అడ్మిషన్ల కన్నా ముందుగానే నోటీసులు జారీచేసింది. 72 కాలేజీలు గత కొన్నేళ్లుగా యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండానే కొనసాగుతున్నాయి. 25 శాతం కన్నా తక్కువ చేరికలున్న 174 కాలేజీలు, ఒక్కరు కూడా లేకుండా కేవలం కాగితాలపై నడుస్తున్న కాలేజీలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. లోపాలను సవరించుకోకుండా కొనసాగుతున్న కాలేజీలపై 2020–21 ఆన్లైన్ అడ్మిషన్లకు ముందుగానే ఉన్నత విద్యామండలి కొరడా ఝళిపించింది. 48 కాలేజీలు స్పందించకపోవడంతో అనుమతులను రద్దుచేసింది. మరో 61 కాలేజీల్లో కోర్సులను ఉపసంహరించింది. -
ప్రభుత్వ డిగ్రీ సీట్లూ వెలవెల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలతోపాటు వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ తరువాత 114 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 24,178 సీట్లను విద్యార్థులెవరూ తీసుకోలేదు. అలాగే ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో 1,268 సీట్లు, ప్రముఖ ఎయిడెడ్, ఎయిడెడ్ అటానమస్ కాలేజీల్లోనూ 5,655 సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లోనూ 396 సీట్లు మిగిలిపోగా ప్రైవేటు, ప్రైవేటు అటానమస్ కాలేజీల్లో ఏకంగా 1,61,469 సీట్లు మిగిలిపోయాయి. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు, విద్యార్థులు ఆన్లైన్లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సీట్లను కేటాయించింది. అయితే అనేక మంది విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోకపోవడంతో వారికి సీట్లు లభించలేదు. పలు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనూ అదే జరిగింది. దీంతో ప్రైవేటు కాలేజీలే కాదు ప్రభుత్వ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. స్పందించని ప్రభుత్వం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నా కళాశాల విద్యా శాఖ స్పందించడం లేదు. ప్రైవేటు కాలేజీల్లో కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయే సీట్లలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం... ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయే సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో పేద విద్యార్థులు తాము కోరుకున్న డిగ్రీ కాలేజీల్లో, కోర్సుల్లో సీట్లు లభించక ఇష్టం లేకపోయినా ఏదో ఒక డిగ్రీ కాలేజీలో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. సీట్లు ఖాళీగా ఉంటున్నా వాటిని విద్యార్థులకు ఇవ్వలేని దుస్థితి నెలకొంటోంది. వృత్తి, సాంకేతిక విద్యలో ఎక్కువ పోటీ... రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లను లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ ప్రైవేటు కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది తప్ప ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా వందల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ ఎంతో డిమాండ్ కలిగిన 300 వరకు సీట్లు మిగిలిపోయాయి. విమర్శలొస్తాయనే ‘స్పాట్’ నిర్వహించట్లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తున్నందున స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తే మెరిట్ లేని వారు వచ్చే అవకాశం ఉంది. అది విద్యార్థుల మధ్య సమస్యగా మారొచ్చు. అందుకే ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్‌కు అనుమతించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!) -
సర్కారు కాలేజీలు సూపర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల కన్నా ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలే మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఉత్తీర్ణత శాతం విషయంలో ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తేలింది. విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ.. ఉన్నత విద్యలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని కాలేజీల పనితీరును అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో కమిటీ పేర్కొన్న ముఖ్యాంశాలివీ.. - ప్రభుత్వ రంగంలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉండగా ప్రైవేట్ సంస్థల్లో బాగా తక్కువగా ఉంది. - ప్రైవేట్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లిపోగా.. మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు. - 71% ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు (817) అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి. - అలాగే.. 40 శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో (464) 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. - 58 శాతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో (185)నూ 50% కన్నా తక్కువగానే అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుండగా అందులో 500 కాలేజీలను మూసివేయాలని కమిటీ తేల్చింది. అలాగే, మొత్తం 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలుండగా అందులో 200 కాలేజీలను మూసేయవచ్చునని కమిటీ సూచించింది. ఉత్తీర్ణతలో ‘ప్రైవేట్’ అథమం రాష్ట్రంలో 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత కేవలం 30 శాతమే ఉందని, అంతేకాక.. ఈ కాలేజీల్లో 40% మంది తుది పరీక్షకు గైర్హాజరవుతున్నారని కమిటీ గుర్తించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొన్ని కాలేజీలను కూడా సంస్కరించాల్సి ఉందని అభిప్రాయపడింది. అలాగే, 25 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు 40 ఎయిడెడ్ కాలేజీల్లో 25% కన్నా తక్కువగా అడ్మిషన్లు ఉంటున్నాయని తెలిపింది. మరోవైపు.. గత సర్కారు 13 ప్రభుత్వ కాలేజీలను మంజూరుచేసి చేతులు దులుపుకుందని, వాటికి సిబ్బందిని మంజూరు చేయలేదని కమిటీ పేర్కొంది. -
పేరుకు గెస్ట్.. బతుకు వేస్ట్!
రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో 30 శాతానికి పైగా కాలేజీలు గెస్ట్ ఫ్యాకల్టీ పైనే ఆధారపడి నడుస్తున్నాయి. నగరంలోని బేగంపేట డిగ్రీ కళాశాలలో 70 మంది లెక్చరర్స్ పనిచేస్తుండగా అందులో 32 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందులోనూ 10 మంది కాంట్రాక్టు లెక్చరర్స్ ఉన్నారు. మిగితా రెగ్యులర్ లెక్చరర్స్‌కు అడ్మినిస్ట్రేషన్ పనులు, యూజీసీ, ఎగ్జామ్స్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లుగా ఉంటే గెస్ట్ ఫ్యాకల్టీ బోధన చేస్తారు. కొంచెం అటూఇటూగా అన్నికళాశాలల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ముషీరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్స్‌తో తరగతులను నిర్వహించిన ప్రభుత్వం.. వారికి వేతనాలు ఇవ్వడం మరిచిపోయింది. 2018–19 విద్యా సంవత్సరం ముగిసి 2019–20 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా గతేడాది పనిచేసిన 10 నెలల వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో రాష్ట్రం లోని 863 మంది గెస్ట్ లెక్చరర్స్ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులను నియమిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్స్ పోస్టులను సృష్టించింది. వీరికి పని గంటలను పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో లెక్చరర్ నెలకు కనీసం 72 గంటలు బోధించేలా గంటకు రూ.300 వేతనాన్నినిర్ణయించింది. దాని ప్రకారం ఒకొక్కరికి నెలకు రూ.21,600 చెల్లించాలి. వీరికి సెలవు దినాల్లో ఎలాంటి వేతనం ఉండదు. రాష్ట్రంలోని 132 డిగ్రీ కళాశాలల్లో 863 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తుండగా హైదరాబాద్ జిల్లాల్లో 11 డిగ్రీ కళాశాలల్లో 123 మంది సేవలందిస్తున్నారు. విధులకు హాజరైతేనే రెన్యూవల్ జూన్ 13న కళాశాలలు ప్రారంభమయ్యాయి. గత 50 రోజులుగా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నా గెస్ట్ లెక్చరర్స్‌కు జీతం ఇవ్వకపోవడంతో పాటు ఈ విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయాలనే డిమాండ్‌తో విధులకు రావడంలేదు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు తరగతులు జరగక నష్టపోతున్నారు. అయితే, విధులకు వస్తేనే పాత బకాయిలు చెల్లిస్తామని, రెన్యూవల్ కూడా చేస్తా మని ప్రిన్సిపల్స్ బెదిరిస్తున్నట్లు సమాచారం. కా నీ, ఉన్నత విద్యాశాఖ కమిషన్ మాత్రం గెస్ట్ లెక్చరర్స్‌కు మళ్లీ ఇంటర్వ్యూలు, డెమో ఇచ్చి చేరాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు ఇచ్చినా.. స్కూళ్లలో విద్యా వలంటీర్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో గత ఏడాది పనిచేసిన గెస్ట్ లెక్చరర్స్‌నే ఈ ఏడాది కొనసాగించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. కానీ కళాశాల విద్యాశాఖ మాత్రం ఇప్పటికీ గెస్ట్ లెక్చరర్స్‌ను రెన్యూవల్ చేయలేదు. పైగా కొత్తవారిని తీసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీంతో 10 నెలల వేతనాల కోసం ఆందోళన చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్‌కు వేతనాలు రాకపోగా ఉన్న ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చింది. నిధులు విడుదలైనా.. అనేక విజ్ఞప్తుల తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీకి రావాల్సిన 10 నెలల వేతనం సీఎం కేసీఆర్ సంతకం చేసి జూన్ 18న ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించినట్లు తెలిసింది. దానికి జీఓ కూడా జారీ చేశారు. కమిషనర్ మాత్రం ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో మా బతుకులు దినదిన గండంగా మారింది. – కిషోర్ కుమార్, టీ–డిగ్రీ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు -
డిగ్రీలోనూ ‘ఇంగ్లిష్’ హవా!
సాక్షి, హైదరాబాద్: - హయత్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీలో తెలుగు మీడియం బీఎస్సీ మ్యాథ్స్ గ్రూపులో 60 సీట్లు ఉంటే గతేడాది అందులో 10 మందే చేరారు. - ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజీలోని తెలుగు మీడియం బీజెడ్సీలో 60 సీట్లు ఉంటే 29 సీట్లే భర్తీ అయ్యాయి. - కోరుట్ల డిగ్రీ కాలేజీ తెలుగు మీడియం బీఎస్సీ మ్యాథ్స్ గ్రూపులో 50 సీట్లు ఉంటే గతేడాది ఒక్కరూ చేరలేదు. - మణుగూరు డిగ్రీ కాలేజీలో బీకాం తెలుగు మీడియంలో 60 సీట్లు ఉంటే గతేడాది 10 మందే చేరారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. ఇందుకు కారణం ఆయా కాలేజీల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడమే. ఇదే సమయంలో అక్కడి ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు కాలేజీల్లో మాత్రం విద్యార్థులు బాగానే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కళాశాల విద్యా శాఖ నిర్ణయించింది. తెలుగు మీడియంలో విద్యార్థులు పెద్దగా చేరని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సగం తెలుగు మీడియం, సగం ఇంగ్లిష్ మీడియం కోర్సులను నిర్వహించేలా రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటే దిక్కు: రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల విద్యార్థులు ఇప్పటివరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుకోవాలంటే 90 శాతం మందికి తెలుగు మీడియమే దిక్కు. గత విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులు కొన్ని కాలేజీలు మినహా ఎక్కువ శాతం తెలుగు మీడియంలోనే ఉన్నాయి. ఇకపై ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుల స్వరూపం మారబోతోంది. ఉపాధి అవకాశాల్లో ఇంగ్లిష్ మీడియం వారికే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇంగ్లిష్ మీడియం కోర్సులను కళాశాల విద్యా శాఖ ప్రవేశ పెడుతోంది. మారనున్న కోర్సుల స్వరూపం.. ఇందులో భాగంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బీఏ)లో హిస్టరీ, ఎకనామిక్స్‌తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ రాబోతోంది. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌తోనూ కంప్యూటర్స్ చేయవచ్చు. బీఎస్సీలో జువాలజీ, కెమిస్ట్రీతోపాటు బయో కెమిస్ట్రీ చదువుకోవచ్చు. మైక్రో బయాలజీ చేయవచ్చు. కోర్సుల్లో మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లను పెంచాలని నిర్ణయించింది. గతేడాది కంటే 17 వేలకుపైగా సీట్లను అదనంగా 2018–19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుతం 59,875 ఇంగ్లిష్ మీడియం సీట్లు ఉండగా, వాటిని 77,280కి పెంచనుంది. మరోవైపు పదిలోపు సీట్లు మాత్రమే భర్తీ అయిన తెలుగు మీడియం కోర్సులు రద్దు చేయాలని యోచిస్తోంది. కోర్సులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు డిగ్రీ కోర్సుల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సిలబస్‌లోనూ మార్పులు చేస్తున్నాం. అందుకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు గెస్ట్ లెక్చరర్లను నియమించి బోధన కొనసాగిస్తాం. – నవీన్ మిట్టల్, కళాశాల విద్యా కమిషనర్ నేడు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ఆన్లైన్లో ఈ ప్రవేశాలను చేపడుతున్నామని, నోటిఫికేషన్ 10న ఆన్లైన్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని, 14వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. నల్లకుంటలోని ఏకేఎల్ఆర్ ఓరియంటల్ కాలేజీని లింగ్విస్టిక్ కాలేజీగా మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కాలేజీలో బీఏ హిందీ, బీఏ అరబిక్ తదితర భాషా కోర్సులనూ ప్రవేశపెడుతున్నామన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2,487 పోస్టుల భర్తీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు కొత్త కాలేజీలకు మంజూరయ్యే పోస్టులనూ భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2,487 పోస్టులను ఏప్రిల్‌లోగా భర్తీ చేయాలని భావిస్తోంది. వీటిలో పాత డిగ్రీ కాలేజీల్లో 1,273 పోస్టులు, 2008–09 నుంచి ఇప్పటివరకు మంజూరైన 60 కాలేజీల్లో మరో 1,214 పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 75% పోస్టులను పదోన్నతుల ద్వారా, 25% పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 71 డిగ్రీ కాలేజీల్లో 2,761 డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. వాటిల్లో 1,488 పోస్టుల్లోనే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. మరో 1,273 పోస్టుల్లో 384 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 889 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వీటి భర్తీ కోసం కళాశాల విద్యా శాఖ గతంలో పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, కొత్త కాలేజీల్లో 1,214 పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ఇటీవల ప్రతిపాదనలు పంపించింది. -
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2,487 పోస్టుల భర్తీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు కొత్త కాలేజీలకు మంజూరయ్యే పోస్టులనూ భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2,487 పోస్టులను ఏప్రిల్‌లోగా భర్తీ చేయాలని భావిస్తోంది. వీటిలో పాత డిగ్రీ కాలేజీల్లో 1,273 పోస్టులు, 2008–09 నుంచి ఇప్పటివరకు మంజూరైన 60 కాలేజీల్లో మరో 1,214 పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 75% పోస్టులను పదోన్నతుల ద్వారా, 25% పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 71 డిగ్రీ కాలేజీల్లో 2,761 డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. వాటిల్లో 1,488 పోస్టుల్లోనే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. మరో 1,273 పోస్టుల్లో 384 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 889 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వీటి భర్తీ కోసం కళాశాల విద్యా శాఖ గతంలో పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, కొత్త కాలేజీల్లో 1,214 పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ఇటీవల ప్రతిపాదనలు పంపించింది.