వివరాలు వెల్లడిస్తున్న ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలల్లో డిప్యుటేషన్‌పై అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరితోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించామన్నారు. ఉన్నత విద్యతోపాటు ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.
విశాఖపట్నం మద్దిలపాలెంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని శనివారం భాస్కరరావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. వీటిలో రూ.391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ.14.5 కోట్ల చొప్పున త్వరలో మంజూరు కానున్నాయన్నారు.
ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కాగా 124 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాడు– నేడు కింద భవనాల ఆధునికీకరణకు రూ.271 కోట్లు విడుదల కావాల్సి ఉందని భాస్కరరావు తెలిపారు. కొత్తగా వస్తున్న ఆరు డిగ్రీ కళాశాలల్లో ఒక్కో దానిలో 24 మంది అధ్యాపకులు, మరో 10 ఇతర పోస్టులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆరు కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి రూ.1.67 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విధానంలో భాగంగా కొత్తగా 54 కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. కళాశాలల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు.
డిగ్రీతోపాటు పలు ఉపాధి కోర్సులు
డిగ్రీ కోర్సులతోపాటు విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పలు కోర్సులను జోడించామని భాస్కరరావు తెలిపారు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్‌లో 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్.ఐ.విజయబాబు, అధ్యాపకులు
పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment