lecturer posts
-
డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ షురూ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 11 సబ్జెక్టుల్లో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డిసెంబర్ 30న సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సబ్జెక్టుల వారీగా పోస్టులు, వేతనం, రిజర్వేషన్, విద్యార్హతలు వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్ కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. -
డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్–2, గ్రూప్–1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పోస్టులు, విద్యార్హతలు, వేతనం, పరీక్ష విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్–1) 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్–2 సంబంధిత సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్ మార్కులు ఉంటాయని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల సబ్జెక్టు సిలబస్ https://psc.ap.gov.inలో చూడవచ్చు. -
విద్యార్థులకు నష్టం లేకుండా ఉపాధ్యాయ బదిలీలు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా, విద్యా సంవత్సరానికి అంతరాయం రానీయకుండా ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తులు చేశారని, బదిలీలను పారదర్శకంగా టైం టు టైం చేపట్టేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. సీఎంతో చర్చి0చి విధివిధానాలు ప్రకటిస్తామని, సాధ్యమైనంత వరకు ఈ విద్యా సంవత్సరంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అలాగే విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా డీఎస్సీ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీల లెక్కలు తీస్తున్నామని.. దాదాపు 15 వేలకు పైనే పోస్టులున్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపైనా త్వరలో చర్యలు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపైనా చట్ట ప్రకారం త్వరలో చర్యలు తీసుకుంటామని, దీనిపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని బొత్స వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్దీకరణ చేస్తామన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారని, కసరత్తు ప్రారంభించినట్టు తెలిపారు. పాఠశాలల్లో రాగి జావ పంపిణీని ఎత్తివేసినట్టు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, ఇది అవాస్తవమన్నారు. ప్రస్తుతం ఒంటిపూట తరగతులు, పరీక్షలు ఉన్నాయని, పైగా ఉదయం విద్యార్థులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు అల్పాహారం తీసుకుని వచ్చేవారికి వెంటనే రాగిజావ ఇస్తే మధ్యాహ్నం భోజనం చేయలేరన్నారు. అందువల్లే రాగిజావకు బదులు చక్కీ ఇస్తున్నట్టు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం నుంచి తిరిగి రాగిజావ అందిస్తామన్నారు. త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ రాజధాని విషయంలో తమ విధానంలో మార్పు లేదని, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ మారుతుందన్నారు. శుక్రవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. చంద్రబాబు రాజధానుల విషయమై పస లేని కామెంట్లు చేస్తున్నారని, మూడు రాజధానులైతే మూడు చోట్లా కాపురం చేయాలనడంపై ఆయన స్పందించారు. ‘గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్‌లో కాపురం చేశారు. ఆయనలా ఎవరూ చేయరు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ పాలసీ అని, అందుకే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. న్యాయపరమైన అంశాలు తేలగానే చట్టపరంగా మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. గడచిన రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ముగ్గురు టీచర్లు ఆకస్మికంగా మరణించడం పట్ల బొత్స విచారం వ్యక్తం చేశారు. ఎండలను తట్టుకునేలా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కరరావు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలల్లో డిప్యుటేషన్‌పై అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరితోపాటు కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా కేటాయించామన్నారు. ఉన్నత విద్యతోపాటు ఉపాధికి బాటలు వేసేలా డిగ్రీ విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. విశాఖపట్నం మద్దిలపాలెంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని శనివారం భాస్కరరావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయన్నారు. వీటిలో రూ.391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ.14.5 కోట్ల చొప్పున త్వరలో మంజూరు కానున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాగా 124 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాడు– నేడు కింద భవనాల ఆధునికీకరణకు రూ.271 కోట్లు విడుదల కావాల్సి ఉందని భాస్కరరావు తెలిపారు. కొత్తగా వస్తున్న ఆరు డిగ్రీ కళాశాలల్లో ఒక్కో దానిలో 24 మంది అధ్యాపకులు, మరో 10 ఇతర పోస్టులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఆరు కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి రూ.1.67 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విధానంలో భాగంగా కొత్తగా 54 కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. కళాశాలల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు. డిగ్రీతోపాటు పలు ఉపాధి కోర్సులు డిగ్రీ కోర్సులతోపాటు విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పలు కోర్సులను జోడించామని భాస్కరరావు తెలిపారు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్లో 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్.ఐ.విజయబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నిధులూ లేవు.. సార్లూ లేరు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అవసరమైన లెక్చరర్ పోస్టులు భర్తీకాలేదు. గెస్ట్ లెక్చరర్ల నియామకంపై సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. సార్లు రాక కోసం విద్యారులు ఎదురు చూపులు చూడటం తప్ప పాఠాలు ముందుకు సాగ ట్లేదు. మరోవైపు కాలేజీల ఖాతాల్లో నిధులు లేక కనీ సం చాక్‌పీస్, డస్టర్లు కూడా కొనలేని పరిస్థితి. ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల దుస్థితి. కాంట్రాక్టు లెక్చరర్లే దిక్కు రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 1.7 లక్షల మంది వరకు ఉంటారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా లెక్చరర్లు మాత్రం లేరు. మెజార్టీ కాలేజీలు కాంట్రాక్టు లెక్చరర్లతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. గతేడాది జూనియర్ లెక్చరర్లకు పదో న్నతి ఇచ్చారు. దీంతో అన్ని కాలేజీలకు ప్రిన్సిపాళ్లు ఉన్నారు. కానీ లెక్చరర్లకు మాత్రం కొరత ఏర్పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంలో జూనియర్ లెక్చరర్లను బదిలీ చేయడంతో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గ్రామీణ ప్రాం తాల్లోని జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. గతేడాది గెస్ట్ లెక్చరర్లుగా పనిచేసి న వారిని ఈ ఏడాది కూడా కొనసాగించాలా లేదా అన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఆ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల సంగతిని కూడా ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. దీంతో వారూ అసంతృప్తితో ఉన్నారు. కాలేజీల ఖాతాలు ఖాళీ గతంలో ఓసీ, బీసీ విద్యార్థుల నుంచి సైన్స్ గ్రూపులకు రూ.835, హ్యుమానిటీస్ గ్రూపులకు రూ.530 చొప్పున వసూలు చేసి కాలేజీ ఖాతాలో జమ చేసేవారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ నుంచి రూ.350 ట్యూషన్ ఫీజుగా కాలేజీలు మినహాయించుకునేవి. దీంతో ఒక్కో కాలే జీ ఖాతాలో ‘అక్యుములేషన్ ఫీజు’రూపంలో సగటు న రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు నిల్వ ఉం డేవి. 2016–17 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు పరికరాల కోసం రూ.1.58 లక్షలు చొప్పున ‘అక్యుములేషన్’ ఖాతా నుంచి ఖర్చు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. 2011–12లో కొత్తగా మంజూరైన 102 జూనియర్ కాలేజీలకు కూడా పాత కాలేజీల అక్యుములేషన్ నిధులనే వినియోగించడంతో ఆయా కాలేజీల ఖాతాలు దాదాపు ఖాళీ అయ్యాయి. దీంతో ‘డే టు డే’నిధుల పేరిట కాలేజీల నిర్వహణకు 2017–18లో నిధులు ఇస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటిం చింది. అయితే విద్యా సంవత్సరం ముగిసినా నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో కాలేజీల్లో చాక్‌పీసులు, డస్టర్లు కూడా కొనే పరిస్థితి లేదని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ‘దహెగాం’ దయనీయ గాథ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ‘దహెగాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ’ 18 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇది నేటికీ జెడ్పీ స్కూల్ భవనంలోనే కొనసాగుతోంది. గతంలో రెండు గదుల షెడ్డు నిర్మించినా కరెంటు, తాగునీరు, ఫర్నిచర్ లేకపోవడంతో నిరుపయోగం గా మారాయి. గతేడాది పదోన్నతిపై వచ్చిన ప్రిన్సిపాల్ ఈ షెడ్డును వినియోగంలోకి తెచ్చి స్టాఫ్‌రూం, ప్రయోగశాల ఏర్పాటు చేశారు. తరగతులు మాత్రం శిథిలావస్థకు చేరిన హైస్కూల్ గదుల్లోనే నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మంది విద్యార్థులు ఉన్నారు. 10 మంది రెగ్యులర్ లెక్చరర్లకు గాను ఒక్కరూ లేక పోగా, 8 మంది కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. కాలేజీ నిర్వహణకు తాను ఖర్చు చేసిన రూ.60 వేలు ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్ పలుమార్లు ఇంటర్ బోర్డుకు లేఖలు రాసినా ఫలితం లేదు. గజ్వేల్‌లోనూ అదే పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ బాలికల జూనియర్ కాలేజీలో 720 మంది విద్యార్థులున్నారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా అత్యాధునిక వసతులతో భవనం నిర్మించారు. అయితే ప్రిన్సిపాల్ మినహా ఒక్క రెగ్యులర్ లెక్చరర్ కూడా లేరు. కేవలం ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. గతేడాది 14 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించారు. ప్రస్తుతం వారు కూడా లేరు. రెగ్యులర్ లెక్చరర్లు, సీనియర్ అసిస్టెంట్, పీడీ, లైబ్రేరియన్, వాచ్‌మన్, స్వీపర్ పోస్టులతో పాటు, ఫర్నిచర్ కావాలని బోర్డుకు లేఖలు రాసినా స్పందన లేదు. పాఠాలు చెప్పే వారేరీ? కాలేజీలో 170 మందికి పైగా విద్యార్థులు ఉన్నా గణిత, భౌతిక శాస్త్రాలకు మినహా మిగతా సబ్జెక్టులకు రెగ్యులర్ లెక్చరర్లు లేరు.కాలేజీ తెరిచి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. లెక్చరర్లు లేక విద్యార్థులు కూడా రెగ్యులర్‌గా కాలేజీకి రావడం లేదు. లెక్చరర్లు వస్తారని ఎదురు చూస్తూనే రెండు నెలలు గడిచిపోయాయి. – రాములు, ఇంటర్ సెకండ్ ఇయర్, సదాశివపేట జూనియర్ కాలేజీ, సంగారెడ్డి న్యాయం చేయలేకపోతున్నాం జూనియర్ కాలేజీల్లో ప్రస్తు తం మౌలిక వసతులు కొంత మెరుగయ్యాయి. రెగ్యులర్ లెక్చరర్లు లేక, కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీ జరగక, నిర్వహణ నిధుల్లేక కాలేజీల నిర్వహణ క్లిష్టతరంగా మారింది. ప్రభుత్వ కాలేజీల మీద భరోసాతో వస్తున్న పేద విద్యార్థులకు న్యా యం చేయలేకపోతున్నాం. గెస్ట్ లెక్చరర్ల నియామ కంతో పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. – కళింగ కృష్ణకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం -
డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొత్తగా 1,384 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2008 కంటే ముందున్న పాత డిగ్రీ కాలేజీల్లో 374 పోస్టులు, 2008 తర్వాత ప్రారంభమైన 57 కొత్త కాలేజీల్లో 1,010 పోస్టులను మంజూరు చేస్తూ.. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 115 కాలేజీల్లోని 1,384 పోస్టులకు సంబంధించి పేస్కేలు తదితర వివరాలనూ అందులో పేర్కొన్నారు. ఈ పోస్టుల్లో ప్రిన్సిపాల్ పోస్టులు 15, డిగ్రీ లెక్చరర్ 1,214, ఫిజికల్ డైరెక్టర్ 67, లైబ్రేరియన్ 64, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులు 24 ఉన్నాయి. పాలిటెక్నిక్‌లలో 199 లెక్చరర్ పోస్టులు: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 199 లెక్చరర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్, రామంతాపూర్, క్యూక్యూ ప్రభుత్వ కాలేజీలు, సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లి కాలేజీ, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, సిరిసిల్ల, నల్లగొండ, కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ పోస్టులను మంజూరు చేసింది. విభాగాల వారీగా పోస్టుల వివరాలను ఉత్తర్వుల్లో పొందుపరిచింది. -
ఉన్నత విద్యను నీరుగారుస్తున్న ప్రభుత్వం
- ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మీనరసింహ కర్నూలు(అర్బన్): ఉన్నత విద్యను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మీనరసింహ అన్నారు. శనివారం స్థానిక మద్దూర్ నగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వి. భరత్‌కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ మాట్లాడుతూ. రాష్ట్రంలోని 439 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఎయిడెడ్ కళాశాలల్లో దాదాపు 4400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని, ఇంకా 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పదేళ్ల నుంచి ఎలాంటి నియామకాలు జరగలేదన్నారు. ఉన్న అధ్యాపకులను కూడా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇతర కళాశాలలకు పంపిస్తున్నారన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలను బలోపేతం చేయకుండా, ప్రైవేటు కళాశాలలపై నియంత్రణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 విశ్వ విద్యాలయాల పరిధిలో 145 ప్రభుత్వ, 126 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, వీటిలో దాదాపు 3 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే నాన్ టీచింగ్ పోస్టులు 4 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు ఇంతవరకు ఒక్క అధ్యాపకుని నియామకం కూడా జరగలేదన్నారు. ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో విద్యార్థి నాయకులు వినయ్, రాజు, బాషా తదితరులు పాల్గొన్నారు. -
లెక్చరర్ పోస్టుల భర్తీకి టీసర్కార్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ బుధవారం జీవో 72 జారీ చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ బీఎడ్ కాలేజీలు అయిన కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(సీటీఈ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ), డీఎడ్ కాలేజీలు అయిన జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డెరైక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ బాధ్యతలను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్, జిల్లా విధానం వర్తిస్తుందని, రోస్టర్ కమ్ రిజర్వేషన్ల ప్రకారం వీటిని భర్తీ చేయాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలను పాఠశాల విద్యాశాఖ టీఎస్పీఎస్సీకి అందజేయాలని వివరించారు. సర్వీసు రూల్స్ సమస్య తేలితేనే మరో 70 శాతం పోస్టులు! 30 శాతం డెరైక్టు రిక్రూట్మెంట్ కోటా పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా పదోన్నతులపై భర్తీ చేయాల్సిన మరో 70 శాతం పోస్టుల భర్తీ తేలాల్సి ఉంది. సర్వీసు రూల్స్ సమస్య కారణంగా గత 15 ఏళ్లుగా పదోన్నతులపై భర్తీ పోస్టుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ లెక్చరర్ పోస్టులకు తామే అర్హులమని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటుండగా, ఎక్కువ సంఖ్యలో ఉన్న తమకు ఆ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ టీచర్లు పట్టుపడుతున్నారు. దీంతో ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఎటూ తేలలేదు. -
కీలక పోస్టుల భర్తీ లేనట్లే!
* విభజన పూర్తయ్యే వరకూ ఆగిపోనున్న గ్రూప్-1 భర్తీ * విభాగాధిపతి కార్యాలయాల్లో ఖాళీల పరిస్థితీ అంతే.. * గ్రూప్-2, జోనల్, జిల్లా పోస్టుల భర్తీకి మాత్రం అవకాశాలు * అదీ ఉన్న రెండు జోన్లను యథాతథ ంగా కొనసాగిస్తేనే.. * లెక్చరర్ పోస్టుల భర్తీకి ‘క్రమబద్ధీకరణ’తో లింకు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాల భర్తీలో మరింత ఆలస్యం తప్పేలా లేదు. పలు కేటగిరీలకు చెందిన జోనల్ పోస్టులు, జిల్లా స్థాయి ఉద్యోగాలు మినహా గ్రూప్-1, శాఖాధిపతుల కార్యాలయాల్లో పోస్టులు వంటివాటి భర్తీకి ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర స్థాయి, విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది విభజనను కమల్‌నాథన్ కమిటీ తేల్చాకే... ఆయా విభాగాల్లో ఖాళీలపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఇక ఇంజనీర్లు, గ్రూప్-2 వంటి పోస్టుల భర్తీ అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం. వీటికి సంబంధించి జోనల్ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలా? లేక జోన్లను పునర్విభజించాలా? అన్నదానిపై వాటి భర్తీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ విషయం కూడా... కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తీసుకోకపోతే జాప్యం తప్పదు. ఇక టీచర్ పోస్టుల వ్యవహారం పరిస్థితీ ఇంతే. 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినా..వేసవిలో హేతుబద్ధీకరణతో వాటిల్లో ఎన్ని మిగులుతాయనేది సందేహమే. 20 శాఖల్లోనే ఆప్షన్లకు అవకాశం.. 127 ప్రభుత్వ శాఖల్లో ఇప్పటివరకు 20 శాఖల్లోని ఉద్యోగులు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కమిటీ కల్పించింది. ఇంకా 107 శాఖల ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించాల్సి ఉంది. ఆ తరువాత ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 1,07,774 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కమల్‌నాథన్ కమిటీ లెక్కలు వేసినా... పోస్టుల విభజన పూర్తయ్యాకే కేటగిరీల వారీగా ఖాళీలపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది. కాంట్రాక్టు క్రమబద్ధీకరణతో లింకు.. లెక్చరర్ పోస్టుల భర్తీ అంశం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,377 డిగ్రీ లెక్చరర్, 3,173 జూనియర్ లెక్చరర్, 812 వొకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో... డెరైక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ వాటిని డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే... కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి నెలకొంది. విభజనపై తేల్చేదెప్పుడు? కమల్‌నాథన్ కమిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 127 శాఖల్లో 72 వేల పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం అందులో 52 వేల మంది రాష్ట్రస్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది తెలంగాణ వారు ఏపీ ప్రభుత్వంలో, ఏపీ వారు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వారందరి పంపకం పూర్తయ్యే వరకు గ్రూప్-1లోని వివిధ కేటగిరీలు, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల మొత్తం ఖాళీల సంఖ్య తేలే అవకాశం లేదు. అప్పటిదాకా ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై స్పష్టత రాదు. అసలు ఈ విభజనకు ఎంత సమయం పడుతుందనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. జోన్లను యథాతథంగా కొనసాగిస్తేనే.. రాష్ట్ర పరిధిలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను యథాతథంగా కొనసాగిస్తే మాత్రం గ్రూప్-2, ఇంజనీర్లు వంటి జోనల్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ కోసం ఐదు వేలకుపైగా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది. వాటికి కూడా ప్రస్తుత జోన్ల విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం జోన్ల పునర్వ్యవస్థీకరణ దిశగా యోచిస్తే వాటి భర్తీకి అడ్డంకులు తప్పవు. ఏపీలో 13 జిల్లాలకు 4 జోన్లు ఉండగా, తెలంగాణలో పది జిల్లాలకు రెండే జోన్లు ఉన్నాయి. రాష్ట్ర ఉద్యోగుల్లో కూడా జోన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపైనే గ్రూప్-2, ఇంజనీఇర్ వంటి పోస్టుల భర్తీ ఆధారపడి ఉంది. ఇక జిల్లా స్థాయి పోస్టుల భర్తీపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.