ఉన్నత విద్యను నీరుగారుస్తున్న ప్రభుత్వం
ఉన్నత విద్యను నీరుగారుస్తున్న ప్రభుత్వం
Published Sat, Dec 10 2016 9:30 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
- ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మీనరసింహ
కర్నూలు(అర్బన్): ఉన్నత విద్యను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నదని బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మీనరసింహ అన్నారు. శనివారం స్థానిక మద్దూర్ నగర్‌లోని సమాఖ్య కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వి. భరత్‌కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ మాట్లాడుతూ. రాష్ట్రంలోని 439 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఎయిడెడ్ కళాశాలల్లో దాదాపు 4400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని, ఇంకా 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పదేళ్ల నుంచి ఎలాంటి నియామకాలు జరగలేదన్నారు. ఉన్న అధ్యాపకులను కూడా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇతర కళాశాలలకు పంపిస్తున్నారన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలను బలోపేతం చేయకుండా, ప్రైవేటు కళాశాలలపై నియంత్రణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 విశ్వ విద్యాలయాల పరిధిలో 145 ప్రభుత్వ, 126 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, వీటిలో దాదాపు 3 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే నాన్ టీచింగ్ పోస్టులు 4 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు ఇంతవరకు ఒక్క అధ్యాపకుని నియామకం కూడా జరగలేదన్నారు. ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో విద్యార్థి నాయకులు వినయ్, రాజు, బాషా తదితరులు పాల్గొన్నారు.
Advertisement