కీలక పోస్టుల భర్తీ లేనట్లే!
* విభజన పూర్తయ్యే వరకూ ఆగిపోనున్న గ్రూప్-1 భర్తీ
* విభాగాధిపతి కార్యాలయాల్లో ఖాళీల పరిస్థితీ అంతే..
* గ్రూప్-2, జోనల్, జిల్లా పోస్టుల భర్తీకి మాత్రం అవకాశాలు
* అదీ ఉన్న రెండు జోన్లను యథాతథ ంగా కొనసాగిస్తేనే..
* లెక్చరర్ పోస్టుల భర్తీకి ‘క్రమబద్ధీకరణ’తో లింకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాల భర్తీలో మరింత ఆలస్యం తప్పేలా లేదు. పలు కేటగిరీలకు చెందిన జోనల్ పోస్టులు, జిల్లా స్థాయి ఉద్యోగాలు మినహా గ్రూప్-1, శాఖాధిపతుల కార్యాలయాల్లో పోస్టులు వంటివాటి భర్తీకి ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర స్థాయి, విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది విభజనను కమల్‌నాథన్ కమిటీ తేల్చాకే... ఆయా విభాగాల్లో ఖాళీలపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఇక ఇంజనీర్లు, గ్రూప్-2 వంటి పోస్టుల భర్తీ అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం. వీటికి సంబంధించి జోనల్ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలా? లేక జోన్లను పునర్విభజించాలా? అన్నదానిపై వాటి భర్తీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ విషయం కూడా... కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తీసుకోకపోతే జాప్యం తప్పదు. ఇక టీచర్ పోస్టుల వ్యవహారం పరిస్థితీ ఇంతే. 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినా..వేసవిలో హేతుబద్ధీకరణతో వాటిల్లో ఎన్ని మిగులుతాయనేది సందేహమే.
20 శాఖల్లోనే ఆప్షన్లకు అవకాశం..
127 ప్రభుత్వ శాఖల్లో ఇప్పటివరకు 20 శాఖల్లోని ఉద్యోగులు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కమిటీ కల్పించింది. ఇంకా 107 శాఖల ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించాల్సి ఉంది. ఆ తరువాత ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 1,07,774 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కమల్‌నాథన్ కమిటీ లెక్కలు వేసినా... పోస్టుల విభజన పూర్తయ్యాకే కేటగిరీల వారీగా ఖాళీలపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది.
కాంట్రాక్టు క్రమబద్ధీకరణతో లింకు..
లెక్చరర్ పోస్టుల భర్తీ అంశం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,377 డిగ్రీ లెక్చరర్, 3,173 జూనియర్ లెక్చరర్, 812 వొకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో... డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ వాటిని డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే... కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి నెలకొంది.
విభజనపై తేల్చేదెప్పుడు?
కమల్‌నాథన్ కమిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 127 శాఖల్లో 72 వేల పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం అందులో 52 వేల మంది రాష్ట్రస్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది తెలంగాణ వారు ఏపీ ప్రభుత్వంలో, ఏపీ వారు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వారందరి పంపకం పూర్తయ్యే వరకు గ్రూప్-1లోని వివిధ కేటగిరీలు, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల మొత్తం ఖాళీల సంఖ్య తేలే అవకాశం లేదు. అప్పటిదాకా ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై స్పష్టత రాదు. అసలు ఈ విభజనకు ఎంత సమయం పడుతుందనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
జోన్లను యథాతథంగా కొనసాగిస్తేనే..
రాష్ట్ర పరిధిలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను యథాతథంగా కొనసాగిస్తే మాత్రం గ్రూప్-2, ఇంజనీర్లు వంటి జోనల్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ కోసం ఐదు వేలకుపైగా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది. వాటికి కూడా ప్రస్తుత జోన్ల విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం జోన్ల పునర్‌వ్యవస్థీకరణ దిశగా యోచిస్తే వాటి భర్తీకి అడ్డంకులు తప్పవు. ఏపీలో 13 జిల్లాలకు 4 జోన్లు ఉండగా, తెలంగాణలో పది జిల్లాలకు రెండే జోన్లు ఉన్నాయి. రాష్ట్ర ఉద్యోగుల్లో కూడా జోన్ల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపైనే గ్రూప్-2, ఇంజనీఇర్ వంటి పోస్టుల భర్తీ ఆధారపడి ఉంది. ఇక జిల్లా స్థాయి పోస్టుల భర్తీపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.