గ్రూప్-1,2 వంటి పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌లో ముఖ్యమైన భాగం.. చరిత్ర. ఏ నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థికైనా చక్కని స్కోరు సాధించడానికి ఈ సబ్జెక్టు తోడ్పడుతుంది. ఇతర సబ్జెక్ట్‌లతో పోల్చితే సిలబస్ పరిధి కొంచెం విస్తృతం.. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇందులోని అంశాలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.. కాబట్టి కొద్దిగా శ్రమిస్తే చరిత్రలో మెరుగైన మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.. ఈ క్రమంలో చరిత్రకు సంబంధించి ముఖ్యాంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై సూచనలు...
కె. యాకూబ్ బాష,
సీనియర్ ఫ్యాకల్టీ.
జనరల్ స్టడీస్‌లో చరిత్రలో భాగంగా ఇండియన్ హిస్టరీ నుంచి అత్యధికంగా ప్రశ్నలు వస్తాయి. రాజులు, వంశాలు, సాంఘిక-ఆర్థిక పరిస్థితులు, సామాజిక ఉద్యమాలు వంటి అంశాలు ప్రధాన నేపథ్యంగా ప్రశ్నలు అడుగుతుంటారు. దాదాపుగా ప్రశ్నలన్నీ అభ్యర్థుల అవగాహనను పరీక్షిస్తాయి. కాబట్టి సంబంధిత అంశాలను క్షుణ్నంగా చదవడం ప్రయోజనకరం.
రెండు రకాల ప్రశ్నలు
చరిత్రలో సాధారణంగా రెండు రకాల ప్రశ్నలు అడుగుతారు. అవి.. నేరుగా అడిగే ప్రశ్నలు-వీటిని ఏక పద సమాధాన ప్రశ్నలు లేదా ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలుగా వ్యవహరిస్తారు. ఉదాహరణ-నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడెవరు?
(సమాధానం- కుమారగుప్తుడు). ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే విషయ పరిజ్ఞానం సరిపోతుంది. ఇన్‌డెరైక్ట్ ప్రశ్నలు- వీటిని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు అంటారు. ఉదాహరణకు-జూన్ 3, 1947 మౌంట్ బాటన్ ప్రణాళికలో లేని అంశం?
1) సమాఖ్య ఫ్రభుత్వ నిర్మాణం
2) రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు
3) {బిటిషర్ల నుంచి భారతీయులకు అధికార మార్పిడి
4) దేశంలో జరుగుతున్న మత ఘర్షణలను నిరోధించడం
సమాధానం: 4.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఉండాలి.
సరళి మారుతోంది
హిస్టరీ నుంచి దాదాపుగా 20-30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ప్రశ్నల సరళి కూడా క్రమంగా మారుతోంది. కాబట్టి ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహనను ఏర్పర్చుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై స్పష్టత వస్తుంది. అంతేకాకుండా పునరావృతం అవుతున్న ప్రశ్నలను ఏయే అంశాల నుంచి ఏ కోణంలో అడుగుతున్నారనే విషయం అవగతమవుతుంది. దానికి అనుగుణంగా సంబంధిత అంశంపై సినాప్సిస్ రూపొందించుకోవాలి. తద్వారా అంశాల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రిపరేషన్ సాగించవచ్చు. మిగతా అంశాలపై కనీస అవగాహన స్థాయిని చేరుకుంటే తక్కువ సమయంలోనే మెరుగైన మార్కులు సాధించవచ్చు.
తప్పనిసరిగా
భారతదేశ చరిత్రలో కొన్ని చాప్టర్ల నుంచి ప్రతి పరీక్షలో ఏదో ఒక ప్రశ్నను తప్పనిసరిగా అడుగుతూనే ఉంటారు. ఉదాహరణకు-వైదిక నాగరికత, బౌద్ధ మతం, ఢిల్లీ సూల్తాన్‌లు, మొగలులు, స్వాతంత్రోద్యమం తదితరాలు. కాబట్టి ఈ అంశాలను సమయానుకూలంగా పునశ్చరణ చేయడం తప్పనిసరి. అంతేకాకుండా అభ్యర్థులు రిమోట్ ఏరియాస్‌గా భావించే అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. ఉదాహరణకు - మొదటిసారి వడ్డీ వ్యాపారం గురించి ప్రస్తావిస్తున్న గ్రంథం? (శతపత బ్రాహ్మణం). కాబట్టి ఇలాంటి అంశాలపైనా కూడా దృష్టి సారించాలి.
గమనించాల్సిన విషయం
నాన్ ఆర్ట్స్ అభ్యర్థులు చరిత్ర విషయంలో కొంత ఆందోళనతో ఉంటారు. వంశాల పేర్లు, రాజులు, రాజధానులు, సంవత్సరాలు వంటి వాటి విషయాలను గుర్తుంచుకోవడాన్ని క్లిష్టంగా భావిస్తుంటారు. కానీ గమనించాల్సిన విషయం.. ఈ మధ్య నిర్వహించిన కొన్ని పరీక్షలను పరిశీలిస్తే ఈ అంశాల నుంచి అడిగిన ప్రశ్నలు అతి స్వల్పం మాత్రమే. ఒకవేళ వచ్చినా గతంలో అడిగిన ప్రశ్నల్లోంచి అధిక శాతం ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. అంతేకాకుండా అధిక శాతం ప్రశ్నలు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక అంశాల ఆధారంగా ఉంటున్నాయి.
ఉదాహరణ-మొగల్ వంశస్థాపకుడెవరు? గుప్త వంశంలో ప్రముఖ రాజెవరు? వంటి ప్రశ్నలు గతంలో వచ్చేవి. ప్రస్తుతం బాబర్ రాసిన గ్రంథం? దాన్ని ఏ భాషలో రచించారు? గుప్తుల ఆస్థానంలోని నవరత్నాల్లో లేని వారెవరు? వంటి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఆయా అంశాలను చదివేటప్పుడు.. మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక అంశానికి సంబంధించి నేపథ్యం మొదలు విస్తృతమైన అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల సబ్జెక్ట్‌పై పట్టు సాధించే అవకాశం లభిస్తుంది.
ఇలా చదవాలి
బిట్స్ రూపంలోని మెటీరియల్‌ను కాకుండా విషయంపై పూర్తి అవగాహనను కలిగించే లోతైన అధ్యయనానికి ఆస్కారముండే ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఎంచుకోవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు దాన్నుంచి ఏయే కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో అంచనా వేసుకుంటూ చదవడం ప్రయోజనకరం.
మూడు భాగాలుగా భారతదేశ చరిత్రను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించుకోవాలి. అవి.. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మూడు యుగాల (ప్రాచీన, మధ్య, ఆధునిక)కు సమ ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించాలి.
ప్రాచీన భారతదేశ చరిత్ర
ఈ విభాగంలో ముఖ్యాంశాలు-సింధు నాగరికత, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులు, హర్ష సామాజ్య్రం మొదలైనవి. ఇందులో సింధు, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు..
భారతీయ బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించిన భారతీయ బౌద్ధ మతాచార్యుడెవరు?
1) కశ్యప మాతంగుడు 2) ఆచార్య నాగార్జునుడు
3) ఆర్య అసంగుడు 4) ధర్మ కీర్తి
సమాధానం: 2
కింది వాటిలో దాదాపుగా హరప్పా ముద్రికలన్నింటిపై ముద్రించిన జంతువు?
1) ఏక సింఘ 2) ఏనుగు
3) ఖడ్గమృగం 4) పులి
సమాధానం: 1
వాసుదేవ కృష్ణునికి సమీప బంధువు కూడా అయిన జైన తీర్థంకరుడెవరు?
1) రుషభనాథుడు 2) పార్శ్వనాథుడు
3) నేమినాథుడు 4) మహావీరుడు
సమాధానం: 3
మౌర్యుల ఆర్థిక సంవత్సరం ఏ నెల నుంచి ప్రారంభమవుతుంది?
1) ఫాల్గుణం 2) ఆషాఢం
3) జ్యేష్టం 4) మాఘం
సమాధానం: 2
కింది వాటిలో అత్యధిక సంఖ్యలో రోమన్ నాణేలు బయటపడిన ప్రాంతం?
1) కేరళ 2) ఆంధ్ర
3) తమిళనాడు 4) కర్ణాటక
సమాధానం: 3
మధ్య యుగ భారతదేశ చరిత్ర
ఈ యుగం హర్షుని అనంతర కాలం నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ సుల్తానులు, రాజపుత్ర రాజ్యాలు, చోళులు, చాళుక్యులు, విజయనగర సామాజ్య్రం, మొగలులు, మరాఠాలు తదితరాలు ఈ విభాగంలోని ముఖ్యాంశాలు. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు..
దక్షిణ భారతదేశంలో భూ దానాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన వారెవరు?
1) సైనికులు, అధికారులు 2) బ్రాహ్మణులు
3) దేవాలయాలు 4) 2, 3
సమాధానం: 4
మహ్మద్ ఘోరీ తొలిసారిగా భారతదేశంపై దండెత్తిన ప్రాంతం?
1) గుజరాత్ 2) పంజాబ్
3) సింధ్ 4) ముల్తాన్
సమాధానం: 3
మంగోలుల దాడులను అత్యధికంగా ఎదుర్కొన్న ఢిల్లీ సుల్తాన్?
1) ఫిరోజ్‌షా తుగ్లక్ 2) మహ్మద్ బిన్‌తుగ్లక్
3) అల్లాఉద్దీన్ ఖిల్జీ 4) బాల్బన్
సమాధానం: 2
విజయనగర సామాజ్య్ర నిర్మాణంలో భాగంగా భావించే వ్యక్తి (కింది వారిలో)?
1) మాధవాచార్యులు 2) మాధవ విద్యారణ్యులు
3) సాయనాచార్యులు 4) వ్యాసరామాచార్యులు
సమాధానం: 2
అక్బర్‌ను ఇస్లాం వ్యతిరేకి అని దూషించిన సమకాలీన చరిత్రకారుడెవరు?
1) అబ్బాస్ ఖాన్ షేర్వాణి
2) నిజాముద్దీన్ అహ్మద్
3) అబ్దుల్ హమీద్ లాహోరి 4) బదౌని
సమాధానం: 4
ఆధునిక భారతదేశ చరిత్ర
క్రీ.శ. 1707 నుంచి 1947 వరకు గల కాలాన్ని ఆధునిక భారతదేశ చరిత్రగా చదవాలి. ఔరంగజేబు మరణించిన సంవత్సరం (1707) నుంచి ఈ యుగం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చివరి మొగల్ రాజులు, బ్రిటషర్ల రాక, భారతదేశ ఆక్రమణ, వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు-ఉద్యమాలు, సామాజిక మత సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం, గవర్నర్ జనరల్‌లు, వైస్రాయ్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. మిగతా విభాగాల కంటే ఈ అంశం నుంచే ప్రశ్నలు అధికంగా అడిగే అవకాశం ఉంది. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు..
శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి గత ఉద్యమాల కంటే భిన్నమైన అంశం?
1) రైతులు పాల్గొనడం
2) విద్యార్థులు పాల్గొనడం
3) వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడం
4) మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం
సమాధానం: 4
1928లో హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) లాహోర్ 2) ఢిల్లీ
3) అలహాబాద్ 4) కాన్పూర్
సమాధానం: 2
స్వదేశీ ఉద్యమాన్ని భారతదేశమంతా వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారెవరు?
1) లాలాలజపతిరాయ్ 2) బిపిన్‌చంద్రపాల్
3) బాలగంగాధర్ తిలక్ 4) అరబిందోఘోష్
సమాధానం: 3
భారతదేశంలో మహిళా ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా వీరిని భావించవచ్చు?
1) రాందేవ్ 2) సరోజినీనాయుడు
3) అనిబిసెంట్ 4) విజయలక్ష్మి పండిట్
సమాధానం: 1
భారతీ జాతీయ కాంగ్రెస్‌లో రెండో చీలికకు కారణం?
1) 1916 లక్నో ఒప్పందం
2) 1918 మాంటెగ్ ప్రకటన
3) అనిబిసెంట్ ఐఎన్‌సీ అధ్యక్షురాలిగా ఎన్నికవటం (1917)
4) 2, 3
సమాధానం: 2
{బిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మారు పేరు?
1) జాబ్ భార్నగ్ కంపెనీ
2) లండన్ వ్యాపారుల కంపెనీ
3) జాన్ కంపెనీ
4) జేమ్స్ కంపెనీ
సమాధానం: 3
రాబర్ట్ క్లైవ్ జాకెట్‌గా ఏవరిని వర్ణించారు?
1) ఓమిచంద్ 2)మాణిక్ చంద్
3) మీర్ జాఫర్ 4) సిరాజుద్దౌలా
సమాధానం: 3
విక్టోరియా రాణి ప్రకటన చేసిన సంవత్సరం?
1) 1848, డిసెంబర్ 2) 1858, నవంబర్
3) 1940, ఆగస్ట్ 4) 1930, ఆగస్ట్
సమాధానం: 2
పరిధి విస్తృతం.. స్కోరింగ్ సులభం
Published Thu, Dec 4 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement