సాక్షి, అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా, విద్యా సంవత్సరానికి అంతరాయం రానీయకుండా ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తులు చేశారని, బదిలీలను పారదర్శకంగా టైం టు టైం చేపట్టేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు.
సీఎంతో చర్చి0చి విధివిధానాలు ప్రకటిస్తామని, సాధ్యమైనంత వరకు ఈ విద్యా సంవత్సరంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అలాగే విద్యారంగంలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా డీఎస్సీ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉపాధ్యాయ ఖాళీల లెక్కలు తీస్తున్నామని.. దాదాపు 15 వేలకు పైనే పోస్టులున్నాయని, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపైనా త్వరలో చర్యలు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపైనా చట్ట ప్రకారం త్వరలో చర్యలు తీసుకుంటామని, దీనిపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని బొత్స వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్దీకరణ చేస్తామన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారని, కసరత్తు ప్రారంభించినట్టు తెలిపారు.
పాఠశాలల్లో రాగి జావ పంపిణీని ఎత్తివేసినట్టు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, ఇది అవాస్తవమన్నారు. ప్రస్తుతం ఒంటిపూట తరగతులు, పరీక్షలు ఉన్నాయని, పైగా ఉదయం విద్యార్థులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు అల్పాహారం తీసుకుని వచ్చేవారికి వెంటనే రాగిజావ ఇస్తే మధ్యాహ్నం భోజనం చేయలేరన్నారు. అందువల్లే రాగిజావకు బదులు చక్కీ ఇస్తున్నట్టు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం నుంచి తిరిగి రాగిజావ అందిస్తామన్నారు.
త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ
రాజధాని విషయంలో తమ విధానంలో మార్పు లేదని, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. త్వరలోనే పరిపాలన రాజధానిగా విశాఖ మారుతుందన్నారు. శుక్రవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. చంద్రబాబు రాజధానుల విషయమై పస లేని కామెంట్లు చేస్తున్నారని, మూడు రాజధానులైతే మూడు చోట్లా కాపురం చేయాలనడంపై ఆయన స్పందించారు. ‘గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్‌లో కాపురం చేశారు.
ఆయనలా ఎవరూ చేయరు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది తమ పాలసీ అని, అందుకే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. న్యాయపరమైన అంశాలు తేలగానే చట్టపరంగా మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. గడచిన రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ముగ్గురు టీచర్లు ఆకస్మికంగా మరణించడం పట్ల బొత్స విచారం వ్యక్తం చేశారు. ఎండలను తట్టుకునేలా వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment