ఉపాధిపై ఫోకస్‌.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల శిక్షణతో నైపుణ్యాలకు పదును | Employability by sharpening students skills Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉపాధిపై ఫోకస్‌.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల శిక్షణతో విద్యార్థుల నైపుణ్యాలకు పదును

Published Wed, Dec 21 2022 5:59 AM | Last Updated on Wed, Dec 21 2022 11:16 AM

Employability by sharpening students skills Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వివిధ పథకాల ద్వారా పిల్లల చదువులు సాఫీగా సాగేలా సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెట్టడం ద్వారా ఉద్యోగావకాశాలు పెంపొందించేలా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేసేలా జగనన్న విద్యా దీవెన, వసతి.. భోజనాల నిమిత్తం జగనన్న వసతి దీవెనతోపాటు ఇతర పథకాల ద్వారా తల్లిదండ్రులపై భారం పడకుండా చదువులకు తోడ్పాటు అందిస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేసి ప్రమాణాలు పెంచేందుకు కరిక్యులమ్‌లో మార్పులు చేసింది. ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల పాఠ్య ప్రణాళికలను బలోపేతం చేసింది. ఇతర డిగ్రీ కోర్సుల్లో పాఠ్యాంశాలను సవరించడంతో పాటు 30 శాతం నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టింది. నాలుగేళ్ల ఆనర్‌ డిగ్రీ కోర్సులను తెచ్చి 10 నెలల ఇంటర్న్‌షిప్‌ అమలు చేస్తుండడంతో మంచి ఫలితాలకు మార్గం ఏర్పడింది.  

విద్యార్థులకు 2 నెలల కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టులను తప్పనిసరి చేశారు. దీనివల్ల విద్యార్థుల్లో సామాజిక చైతన్యంతో ఆత్మస్థైర్యం పెరిగింది. అన్ని కాలేజీల్లో బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును తప్పనిసరి చేశారు. దీనికి అనుగుణంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు రూపొందించి అందించారు. తద్వారా తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోకి విద్యార్థులను సాఫీగా మార్చేందుకు సులువైంది. 25 మార్కెట్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు, 67 బ్యాచులర్‌ వొకేషనల్‌ డిగ్రీ ప్రోగ్రాములకు తోడు లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా విద్యార్థులకు అదనపు నైపుణ్యాలకు వీలుగా పలు ఆన్‌లైన్‌ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. 

దేశంలో తొలిసారిగా క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌  
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసింది. అన్ని కాలేజీల్లోనూ తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా చూడడంతో పాటు తగిన బోధనా సిబ్బంది ఉండేలా పర్యవేక్షణకు వీలైంది. మరోపక్క అన్ని కాలేజీలకు న్యాక్, ఎన్‌బీఏ వంటి గుర్తింపు ఉండేలా మార్గదర్శనం చేస్తోంది. పలువురు నిపుణులతో తొలిసారిగా ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ బోర్డును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారు.

విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడం, నైపుణ్యాలు పెంచే లక్ష్యంతో 553 ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్, ఇంక్యుబేషన్, స్టార్టప్‌ సెంటర్లను యూనివర్సిటీలు, కాలేజీల్లో ఏర్పాటు చేశారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ద్వారా 1.62 లక్షల మందికి వివిధ కోర్సుల్లో రూ.32 కోట్లతో ఉచిత శిక్షణ అందించారు.
 
ఇంటర్న్‌షిప్‌తో సత్ఫలితాలు 
ఉన్నత విద్యలో ఇంజనీరింగ్‌తోపాటు నాన్‌ ప్రొఫెషనల్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులలో నాలుగేళ్ల ఆనర్‌ డిగ్రీని ప్రవేశపెట్టి ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రెగ్యులర్‌ కోర్సులతోపాటు విద్యార్థులలో నైపుణ్యాల పెంపునకు మైక్రోసాఫ్ట్, సేల్స్‌ ఫోర్స్‌ çవంటి సంస్థలు సహా 20 కంపెనీల ద్వారా విద్యార్థులకు అప్‌ స్కిల్లింగ్‌ శిక్షణ అందిస్తున్నారు.

పరిశ్రమలకు అవసరమైన రీతిలో మానవ వనరులను తీర్చిదిద్దడంతో అనేక కంపెనీలు మన విద్యార్థుల వైపు దృష్టి సారిస్తున్నాయి. గత మూడేళ్లుగా పెరుగుతున్న ప్లేస్‌మెంట్ల సంఖ్య ఇందుకు నిదర్శనం.  రాష్ట్ర ఉన్నత విద్యామండలి గణాంకాల ప్రకారం 2018–19లో ప్లేస్‌మెంట్ల సంఖ్య 37 వేలు ఉండగా 2021–22లో ఏకంగా 85 వేలకు పెరిగింది. దీన్ని 1.20 లక్షలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని కృషి చేస్తున్నారు. 

మంచి ప్యాకేజీలతో కొలువులు 
నైపుణ్యాలకు తగినట్లుగా ఆయా కంపెనీలు మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2018–19లో రాష్ట్రంలో సగటు ప్యాకేజీ రూ.2.50 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం రూ.5 లక్షలకు పైగా పెరిగింది. గరిష్ట ప్యాకేజీలో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అందుకుంటున్న విద్యార్థులు సైతం ఉన్నారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ తదితర సంస్థలు విద్యార్థులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ప్లేస్‌మెంట్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. 

పరిశ్రమలతో కాలేజీల అనుసంధానం 
డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసిన ప్రభుత్వం అన్ని కళాశాలలను పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించింది. ఇందుకు ఉన్నత విద్యామండలి ద్వారా ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 2.5 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ కొనసాగిస్తున్నారు. 

రెగ్యులర్‌ కోర్సులు చేస్తూనే.. 
విద్యార్థులు రెగ్యులర్‌ కోర్సులు చేస్తూనే అదనపు నైపుణ్యాలను సంతరించుకునేలా ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్సు లాంటి సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఈ కోర్సుల్లో 2.15 లక్షల మందికి ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా భారీ స్పందనతో 2,45,700కి చేరుకుంది.  

మరికొన్ని సంస్థలతో ఒప్పందాలు 
ఏఐసీటీఈ, నాస్కామ్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్, ఒరాకిల్, పాలో ఆల్టో నెట్‌వర్క్, యూఐపాత్, స్మార్ట్‌ బ్రిడ్జ్, ఎడ్యుస్కిల్స్, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌ప్రెస్, ఎన్‌ఐఐటీ ఫౌండేషన్, క్యూస్‌గ్రూప్, నాంది ఫౌండేషన్, క్వెస్‌ గ్రూప్, టీమ్‌ లీజ్, ది హిందూ, రైస్, లాంచ్‌ ప్యాడ్, సైలర్‌ అకాడమీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సంస్థల ఉచిత నైపుణ్య కోర్సులతో పాటు ఇతర సర్టిఫికేషన్‌ కోర్సులు అందనున్నాయి. ఇవే కాకుండా ఐబీఎం, సిస్కో, అడోబ్, గూగుల్, బోర్డు ఇన్ఫినిటీ, ఇన్ఫోసిస్‌ సంస్థలతోనూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒప్పందాలు చేసుకోనుంది.  

సాంకేతికను అందిపుచ్చుకునేలా.. 
రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి అధునాతన సాంకేతిక అంశాల్లో విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. సేల్స్‌ఫోర్స్‌ డెవలపర్, సేల్స్‌ఫోర్స్‌ అడ్మిన్, మైక్రోసాఫ్ట్‌ అజూర్, ఫుల్‌ స్టాక్‌ (డాట్‌ నెట్‌), ఫుల్‌ స్టాక్‌ (పైథాన్‌), హెచ్‌ఆర్, బీఎఫ్‌ఎస్‌ఐ ఎనలిస్ట్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, మెడికల్‌ స్క్రైబ్, వీఎం వేర్, గూగుల్‌ ఆండ్రాయిడ్, ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్, నెట్‌ వర్కింగ్, క్లౌడ్‌ నెట్‌వర్కింగ్, డేటా ఎనలిటిక్స్, ఏఐ ఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాయి.  

ముందు వరుసలో రాష్ట్రం   
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయానికి అనుగుణంగా రెగ్యులర్‌ కోర్సులలో ఇంటర్న్‌షిప్‌తో పాటు ఆన్‌లైన్‌ వర్చువల్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను ఉచితంగా అందిస్తున్నాం. దాదాపు 1.50 లక్షల మందికి సర్టిఫికేషన్‌ కోర్సులు నిర్వహించిన ఘనత దేశంలో ఏపీకే దక్కుతోంది. 2.5 లక్షల మందికి రెగ్యులర్‌ ఇంటర్న్‌షిప్‌లను అందించడంలోనూ మన రాష్ట్రం ముందు వరసలో ఉంది. వచ్చే రెండు మూడేళ్లలో డిగ్రీ విద్యార్థులలో 60 శాతానికి పైగా ఉద్యోగావశాలు పొందేలా చూడాలన్నది లక్ష్యం. ఈ ఏడాది రూ.40 లక్షల ప్యాకేజీ వచ్చిన విద్యార్థులు 100 మందికి పైగా ఉన్నారు. ఇక రూ.25 లక్షలు, రూ.30 లక్షలు వచ్చిన విద్యార్థులు చాలా మందే ఉన్నారు.  
– కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement