తెలంగాణలో కొత్త డిగ్రీలు నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు | New degrees courses are four years by UGC | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్త డిగ్రీలు నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు

Published Fri, Apr 21 2023 3:06 AM | Last Updated on Fri, Apr 21 2023 10:03 AM

New degrees courses are four years by UGC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇక నుంచి డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయబోతున్నారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. డిగ్రీ కోర్సులకు నైపుణ్యం మేళవించి రూపొందించాలని భావిస్తున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని రాష్ట్రాలకు తెలిపింది.

ఇందులోభాగంగా యూజీసీ చైర్మన్‌ ఇటీవల పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ విషయమై యూజీసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జగదీశ్‌ కుమార్‌తో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి చర్చించారు. ఆనర్స్‌ కోర్సులపై ఉన్నత విద్యామండలి త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చించాలని నిర్ణయించింది. 

ఓయూలో లైఫ్‌సైన్స్‌ ఆనర్స్‌ 
నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలనే యోచనలో మండలి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో ఎంతవరకు నాలుగేళ్ల కోర్సులను ఇష్టపడతారనే దానిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలున్న కాలేజీల్లో తొలుత ఆనర్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

డిగ్రీలో ఎంచుకునే ఏదైనా సబ్జెక్టును పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, లోతైన బోధన విధానంతో అమలు చేయడమే ఆనర్స్‌ కోర్సుల ఉద్దేశం. మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్‌ సైన్స్, బీకాం ఆనర్స్‌ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో ఓయూ పరిధిలో లైఫ్‌సైన్స్‌ కోర్సును ఆనర్స్‌గా తేవాలనే యోచన ఉంది. కొంతకాలంగా దేశ విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. 

పారిశ్రామిక అనుభవం తప్పనిసరి 
ఆనర్స్‌ కోర్సులకు పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. విదేశాల్లో సైతం ఉపాధి లభించేలా నైపుణ్యాలను తీర్చిదిద్దనున్నారు. బీఎస్సీ ఆనర్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు కచ్చితంగా పరిశ్రమల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల కోర్సు తర్వాత నాలుగో ఏట విద్యార్థులు అమెరికా, యూకే, సింగపూర్, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడి సంస్థల్లో కోర్సు చేసేలా డిజైన్‌ చేస్తున్నారు. 

ఉపాధికి ఊతం: ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 
నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులు వృత్తి విద్య కోర్సులకు పోటీనిస్తాయి. డిగ్రీతో మంచి ఉద్యోగాలు పొందడమే కాదు... సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి అడుగుపెట్టేలా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఈ దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని కాలేజీల్లో వీటిని తెచ్చే లక్ష్యంతో ఉన్నాం.   

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అనువైన కోర్సులు
అన్ని దేశాల్లోనూ సాఫ్ట్‌వేర్‌ రంగం విస్తరిస్తోంది. ఉపాధి అవకాశాలూ ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగా విద్యార్థులు ఇంజనీరింగ్‌ బాట పడుతున్నారు. అయితే, డిగ్రీతోనూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చేలా కంప్యూటర్‌ కోర్సులను ఆనర్స్‌గా అందించాలని నిర్ణయించారు. బీఎస్సీ ఆనర్స్‌ పేరుతో తెచ్చే ఈ కోర్సుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ను జోడించబోతున్నారు.

సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ కోర్సులను తెచ్చే యోచనలో ఉన్నారు. బీఎస్సీ (ఆనర్స్‌) కోర్సును రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలో పరిమితంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కోర్సును ప్రారంభించేలా అనుమతులివ్వాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. ఆనర్స్‌ కోర్సులో మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా ఇవ్వాలని, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్‌ డిగ్రీ పట్టా ఇవ్వాలని భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement