National education system
-
యూజీ స్థాయిలో జీవన నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమైన జీవన నైపుణ్యాల (లైఫ్ స్కిల్స్)ను అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు చేపట్టింది. తద్వారా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) విద్యార్థుల్లో సామర్థ్యాలను వెలికితీయనుంది. వారిని మరింత ముందుకు తీసుకురావడానికి, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు 2019లోనే జీవన నైపుణ్యాల కోసం పాఠ్యాంశాలను అభివృద్ధి చేసింది. వీటిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలు, నాయకత్వ–నిర్వహణ నైపుణ్యాలు, ప్రపంచ మానవ విలువలు వంటి నాలుగు విభాగాలున్నాయి. వీటిని యూజీసీ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. డిజిటల్ లిటరసీ, సోషల్ మీడియా, డిజిటల్ ఎథిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెర్బల్, నాన్–వెర్బల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మానవ హక్కులు వంటి కొత్త విభాగాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చింది. ప్రతి ఉన్నత విద్యా సంస్థ తమకు సరిపోయే విధంగా ఈ కరిక్యులమ్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించింది. రోల్ ప్లేయింగ్, ఆడియో–వీడియో ఫిల్మ్, వ్యక్తిగత, సమూహ కార్యకలాపాలు, కేస్ స్టడీస్, ప్రదర్శన, పరిశీలన, ఈ–లెర్నింగ్ వంటి వాటిని కూడా యూజీసీ పొందుపరిచింది. ఉన్నత విద్యనభ్యసించేవారికి భావవ్యక్తీకరణ, నిర్వహణ, నాయకత్వ అంశాల్లో వృత్తిపరమైన, వ్యక్తిగత పురోభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. విద్యార్థి దశ నుంచే లైఫ్‌స్కిల్స్‌ను బోధిస్తే రోజువారీ జీవితంలోని సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సామర్థ్యాలను కూడా విద్యార్థులు అందుకోగలుగుతారని యూజీసీ భావిస్తోంది. మార్గదర్శకాలు విడుదల.. డిగ్రీ స్థాయి విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి వీలుగా పాఠ్యాంశాలు, మార్గదర్శకాలను యూజీసీ విడుదల చేసింది. అలాగే అధ్యాపకులు సమర్థవంతమైన బోధనను అందించడానికి వీలుగా నాలుగు విభాగాలు (కోర్సులు)గా కంటెంట్‌ను రూపొందించింది. ఈ నాలుగు కోర్సులకూ క్రెడిట్లను కూడా యూజీసీ నిర్ణయించింది. ప్రతి కోర్సులో 2 క్రెడిట్లు విద్యార్థులకు అందిస్తారు. మొత్తం కోర్సులు 8 క్రెడిట్లను కలిగి ఉంటాయి. విద్యార్థులు సెమిస్టర్లలో 2 క్రెడిట్ కోర్సులు ఒకేసారి తీసుకున్నా కోర్సు వారీగా క్రెడిట్ సాధించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల క్రెడిట్ పరిమితి ఒకే సెమిస్టర్లో నాలుగుకి మించకూడదు. అంటే ఒకేసారి రెండు కోర్సులు మాత్రమే చేయడానికి వీలవుతుంది. ఈ కోర్సులు బోధించడానికి అవసరమైన అధ్యాపకులను కాలేజీలు నియమించుకోవాలి. కోర్సులను ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో కూడా అందించవచ్చు. క్రెడిట్ విధానం ఇలా.. యూజీసీ కరిక్యులమ్లోని యూజీ ప్రోగ్రామ్‌ల క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఒక్కో క్రెడిట్ కోర్సులో అభ్యసన పని వారానికి నిర్దేశిత కాలం ప్రకారం తప్పనిసరిగా ఉండాలి. సెమిస్టర్ కాలవ్యవధి 15 వారాలుగా ఉంటుంది. ఒక సెమిస్టర్లో ప్రాక్టికల్ లేదా ల్యాబ్ వర్క్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సర్వీసెస్ ఫీల్డ్ వర్క్‌లతో మరో క్రెడిట్ కోర్సు ఉంటుంది. దీనిలో వారానికి రెండు గంటల అభ్యసనం ఉండాలి. కోర్సుకు ప్రతిపాదిత క్రెడిట్ల సంఖ్యను ఉన్నత విద్యాసంస్థలు నిర్ణయించవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో ఆయా కోర్సుల విభాగాల్లో పనిగంటల సంఖ్యను నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. సాధ్యమైన చోట కమ్యూనిటీ సర్వీసు, లేదా అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌ల్లో పాల్గొనవచ్చు. -
తెలంగాణలో కొత్త డిగ్రీలు నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయబోతున్నారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. డిగ్రీ కోర్సులకు నైపుణ్యం మేళవించి రూపొందించాలని భావిస్తున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని రాష్ట్రాలకు తెలిపింది. ఇందులోభాగంగా యూజీసీ చైర్మన్ ఇటీవల పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ విషయమై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్‌తో మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చర్చించారు. ఆనర్స్ కోర్సులపై ఉన్నత విద్యామండలి త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చించాలని నిర్ణయించింది. ఓయూలో లైఫ్‌సైన్స్ ఆనర్స్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలనే యోచనలో మండలి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో ఎంతవరకు నాలుగేళ్ల కోర్సులను ఇష్టపడతారనే దానిపై అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలున్న కాలేజీల్లో తొలుత ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. డిగ్రీలో ఎంచుకునే ఏదైనా సబ్జెక్టును పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, లోతైన బోధన విధానంతో అమలు చేయడమే ఆనర్స్ కోర్సుల ఉద్దేశం. మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్ సైన్స్, బీకాం ఆనర్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో ఓయూ పరిధిలో లైఫ్‌సైన్స్ కోర్సును ఆనర్స్‌గా తేవాలనే యోచన ఉంది. కొంతకాలంగా దేశ విదేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. పారిశ్రామిక అనుభవం తప్పనిసరి ఆనర్స్ కోర్సులకు పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. విదేశాల్లో సైతం ఉపాధి లభించేలా నైపుణ్యాలను తీర్చిదిద్దనున్నారు. బీఎస్సీ ఆనర్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు కచ్చితంగా పరిశ్రమల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల కోర్సు తర్వాత నాలుగో ఏట విద్యార్థులు అమెరికా, యూకే, సింగపూర్, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడి సంస్థల్లో కోర్సు చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఉపాధికి ఊతం: ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు వృత్తి విద్య కోర్సులకు పోటీనిస్తాయి. డిగ్రీతో మంచి ఉద్యోగాలు పొందడమే కాదు... సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టేలా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఈ దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని కాలేజీల్లో వీటిని తెచ్చే లక్ష్యంతో ఉన్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అనువైన కోర్సులు అన్ని దేశాల్లోనూ సాఫ్ట్వేర్ రంగం విస్తరిస్తోంది. ఉపాధి అవకాశాలూ ఇందులో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగా విద్యార్థులు ఇంజనీరింగ్ బాట పడుతున్నారు. అయితే, డిగ్రీతోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేలా కంప్యూటర్ కోర్సులను ఆనర్స్‌గా అందించాలని నిర్ణయించారు. బీఎస్సీ ఆనర్స్ పేరుతో తెచ్చే ఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్‌ను జోడించబోతున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులను తెచ్చే యోచనలో ఉన్నారు. బీఎస్సీ (ఆనర్స్) కోర్సును రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలో పరిమితంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కోర్సును ప్రారంభించేలా అనుమతులివ్వాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. ఆనర్స్ కోర్సులో మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా ఇవ్వాలని, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ పట్టా ఇవ్వాలని భావిస్తున్నారు. -
రేపటి నుంచి విద్యా రంగంపై ఓరియెంటేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు–నేడు, జాతీయ విద్యా విధానం అమలు, స్కూళ్ల మ్యాపింగ్ వంటి అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజుకు కొన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఓరియెంటేషన్ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయం ఐదో బ్లాక్‌లో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలను అధికారులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓరియెంటేషన్ కార్యక్రమానికి సంబంధిత హెచ్వోడీలు, ఇతర ఉన్నతాధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం–2020తోపాటు ఇతర సమాచారానికి సంబంధించి తెలుగు కాపీలు 200, ఇంగ్లిష్ కాపీలు 200 ప్రజాప్రతినిధులందరి కోసం సమకూర్చాలని కోరారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్యాశాఖ)కి లేఖ రాసింది. తేదీలు, జిల్లాల వారీగా ఓరియెంటేషన్ కార్యక్రమం ఇలా.. జనవరి 27: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జనవరి 28: పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జనవరి 29: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం -
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
-
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: జాతీయ విద్యావిధానం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఐటీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. అదే విధంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభయాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
మార్కుల షీట్లు కావు.. ప్రెజర్ షీట్లు
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానంలో మార్కుల ఒత్తిళ్లు విద్యార్థులపై అత్యధికంగా ఉన్నాయని, వాటిని తొలగిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. మార్కుల షీట్లు విద్యార్థులకు ఒత్తిడి షీట్లు అని, తల్లిదండ్రులకు అవే ప్రెస్టేజ్ షీట్లు అని వ్యాఖ్యానించారు. జాతీయ విద్యావి«ధానం 2020లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. కొత్త దిశా నిర్దేశం జాతీయ విద్యా విధానం దేశానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చేలా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వారిలో సృజనాత్మక ఆలోచనలు పెరిగేలా విద్యా బోధన జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగానే సిలబస్‌ను తగ్గించి మానసిక పరిణితి పెంచేలా కొత్త తరహాలో బోధనా పద్ధతులు ఉంటాయన్నారు. విమర్శనాత్మకమైన ఆలోచనలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆసక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందేలా కొత్త సిలబస్ ఉంటుందని చెప్పారు. ఎన్ఈపీపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విద్యా శాఖ వెబ్‌సైట్‌కి ఇప్పటికే 15 లక్షల సూచనలు వచ్చాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అయిదో తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన అత్యంత అవసరమని మోదీ చెప్పారు. -
గవర్నర్ తమిళిసైకి రాష్ట్రపతి ఫోన్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన జాతీయ విద్యావిధానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్లో చర్చించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గవర్నర్‌కు శుక్రవారం ఫోన్ చేశారు. ‘జాతీయ విద్యావిధానం–2020’ అంశంపై త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబోయే సమావేశం గురించి వారిద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సమస్య గురించి కూడా రాష్ట్రపతి కోవింద్ కోవింద్ గవర్నర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వెబ్‌నార్ నిర్వహించిన విషయం విదితమే. -
దేశ విద్యా విధానంలో మార్పు రావాలి
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: దేశంలో విద్యా విధానం మారాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన తెలంగాణ గురుకుల ఉపాధ్యాయుల సంఘం డైరీ–2017 ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ పోవాలని కోరుతూ ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే విద్యా పోరాట యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని, ఉపాధ్యాయులందరూ తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు జరిగితే బాగుంటుందని, సమాంతర పద్ధతిలో విద్య అందినప్పుడే మార్పును తీసుకురాగలమని చెప్పారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెంచాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.25 వేల కోట్ల నిధులైనా విద్యా రంగానికి ఇవ్వాలన్నారు. కొఠారీ కమిషన్ సిఫిరస్సులను అమలు చేయాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టు విధానంలో నియామకాలను పూర్తిగా నిలిపివేయాలన్నారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... పెన్షన్ రద్దును వ్యతిరేకిస్తూ మార్చి 2న జరిగే నిరసన సభను విజయవంతం చేయాలని కోరారు. గౌరవ అధ్యక్షడు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.