దేశ విద్యా విధానంలో మార్పు రావాలి
ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: దేశంలో విద్యా విధానం మారాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్‌లో జరిగిన తెలంగాణ గురుకుల ఉపాధ్యాయుల సంఘం డైరీ–2017 ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ పోవాలని కోరుతూ ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే విద్యా పోరాట యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని, ఉపాధ్యాయులందరూ తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు జరిగితే బాగుంటుందని, సమాంతర పద్ధతిలో విద్య అందినప్పుడే మార్పును తీసుకురాగలమని చెప్పారు.
అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెంచాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ.25 వేల కోట్ల నిధులైనా విద్యా రంగానికి ఇవ్వాలన్నారు. కొఠారీ కమిషన్ సిఫిరస్సులను అమలు చేయాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టు విధానంలో నియామకాలను పూర్తిగా నిలిపివేయాలన్నారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... పెన్షన్ రద్దును వ్యతిరేకిస్తూ మార్చి 2న జరిగే నిరసన సభను విజయవంతం చేయాలని కోరారు. గౌరవ అధ్యక్షడు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.