Professor haragopal
-
రేపే నారాయణమూర్తి యూనివర్సిటీ
‘‘యూనివర్సిటీ’ విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు చూడాల్సిన సినిమా’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆర్. నారాయణమూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ‘యూనివర్సిటీ’ ప్రివ్యూ వేశారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ– ‘‘దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి. అప్పుడే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ ఉండదు’ అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా గట్టిగా చెప్పారు నారాయణమూర్తి’’ అన్నారు. ‘‘నిరుద్యోగ సమస్య దేశాన్ని ఎంత పట్టి పీడిస్తోందో ఈ చిత్రంలో బాగా చెప్పారు’’ అన్నారు ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ‘‘పరీక్షల మీద పరీక్షలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. -
ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉపా చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్ మీద దాఖలు చేసిన దేశద్రోహం కేసును ఎత్తేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపైనా కేసులు తక్షణమే ఎత్తేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. హరగోపాల్ సహా పలువురు మేధావులపై ఉపా చట్టం కింద కేసులు దాఖలైన పరిణామంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతుండడం, ముఖ్యంగా మేధోవర్గం నుంచి అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. 👉 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా-UAPA) కింద హరగోపాల్‌తో పాటు 152 మందిపైనా కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్‌పై యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయితే ఈ దేశద్రోహం కేసు ఆలస్యంగా.. తాజాగా వెలుగు చూసింది. 👉 పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. 👉 మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. 👉 తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామం వద్ద.. ఓ రోజు వేకువజామున మావోయిస్టులు సమావేశామవుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. సైలెంట్‌గా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేశారు. పోలీసుల కదలికలను గమనించిన మావోయిస్టులు.. అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేయగా.. విప్లవ సాహిత్యం, పలు వస్తువులు దొరికాయి. కాగ.. ఆ పుస్తకాల్లో ప్రముఖుల పేర్లు ఉండడంతో.. వారిని నిందితులుగా చేర్చారు 👉 మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడైన పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో సర్కారు ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, సర్కారును పడగొట్టటం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, యువతను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు రకరకాల అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. అయితే.. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రమౌళితో పాటు నిందితులుగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్‌తో పాటు ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్.. తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 👉 సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంఘ విద్రోహ శక్తులను, సంఘాన్ని ఉద్రేక పరుస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే వారిని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టమే ఉపా చట్టం (UAPA Act). ఇదీ చదవండి: ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్.. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి -
ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, చర్చా మేధావి.. ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ములుగు జిల్లా తాడ్వాయి మండల పీఎస్‌లో ఈ మేరకు ఆయనపై అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. చట్ట వ్యతిరేకత కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా(UAPA యూఏపీఏ)తోపాటు ఆర్మ్ యాక్ట్, ఇంకా పలురాకల 10 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బీరెల్లి కుట్ర కేసుకు సంబంధించి కిందటి ఏడాది ఆగస్టు 19వ తేదీనే తాడ్వాయి పీఎస్‌లో హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై కేసు నమోదు అయ్యింది. ప్రజాప్రతినిధులను చంపడానికి కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ కాగా.. నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల పుస్తకాల్లో పేర్లు ఉన్నాయంటూ వాళ్లకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది కూడా. అయితే.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. స్పందించిన ప్రొఫెసర్ రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి, ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదు. మావోయిస్టులకు మా మద్దతు ఎందుకు? వాళ్లు మాలాంటి వాళ్ల మీద ఆధారపడరు.. అసలు వాళ్ల ఉద్యమం వేరు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల తరుణంలో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరం. పేర్లు రాసుకోవడం కాదు.. సరైన ఆధారాలు ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చట్టాన్ని దురుపయోగం చేస్తున్నారు. ఇది ఈ వ్యవస్థలో ఉండాల్సింది కాదు. ఉపా చట్టాన్ని ఎత్తివేయాలి. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం. ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ వాళ్లు. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి. అందరిపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూనే.. ఉపా చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరగాలి. అందరం కలిసి మాట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అని ఆకాంక్షించారాయన. అలాగే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ అక్రమ కేసు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యా సంఘాల ఖండన ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా లాంటి మేధావులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి డిమాండ్ చేశారు. మరోవైపు విద్యా మేధావులను ఇరికించడం వెనుక లోతైన కుట్ర ఉందని, కేసు వివరాలను బహిర్గత పర్చాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
విద్యారంగంపై నిర్లక్ష్య ధోరణి
కవాడిగూడ: మనిషిని మనిషిగా నిలబెట్టేదే విద్యారంగమని.. అలాంటి విద్యారంగంపై నిర్లక్ష్య ధోరణి చూపుతుండటంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ప్రొ ఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పిఎస్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు జీవో 317 బాధితులకు న్యాయంతో పాటు విద్యారంగ సమస్యల పరిష్కారానికి మహాధర్నా నిర్వహింంచారు. ఈ మహాధర్నాకు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై కదం తొక్కారు. ఈ మహాధర్నాకు ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం హరగోపాల్ మాట్లాడుతూ... విద్యారంగానికి పెద్దపీట వేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, కే జీ టూ పీజీ ఉచిత విద్య అంటూ ఇచ్చిన హామీ నేటికి నెరవేరకపోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధ్యాయ సంఘాలనేతలు కె. అంజయ్య,అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
లా అండ్ ఆర్డర్ లో 'లా' నే లేదు: ప్రొఫెసర్ హరగోపాల్
-
ఆర్టీసీలో సంఘటిత ఉద్యమాలు అవసరం
సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్): టీఎస్ఆర్టీసీలో సంఘటిత ఉద్యమాలు చేయడం ఇప్పుడు అవసరమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీఎస్ఆర్టీసీ జాయింట్యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్య క్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోవడం దురదృష్టకరం అన్నారు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో ఆర్టీసీ పూర్తిగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ పౌరుల హక్కులను కాపాడాలనే నినాదంతో ముందుకు వెళితేనే ఆర్టీసీని రక్షించుకోగలమని అన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ వి.ఎస్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను దెబ్బతీస్తోందన్నారు. సంస్థలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే హక్కు లేకుంటే ఎలా అని అన్నారు. దీనివల్ల కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతుంద న్నారు. ఆర్టీసీలో ట్రేడ్యూనియన్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె. రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో సంస్థకు రెండు శాతం నిధులు కేటాయించాలని, ఆర్టీసీలో ప్రజా స్వామ్య హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లాభాపేక్షతో కాకుండా ప్రజాసంక్షేమమే లక్ష్యంగా బస్సులను నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ కె. హనుమంతు ముదిరాజ్, కన్వీనర్ పి.కమల్‌రెడ్డి, సీఐటీయూ కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె. సూర్యం, కె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
సాయిబాబా అడిగినవి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: భీమా–కోరెగావ్ ఘటనలో ప్రమే యముందన్న ఆరోపణలపై నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు, 90 శాతం వైకల్యంతో బాధపడుతున్న డాక్టర్.జి.ఎన్. సాయిబాబాకు అవస రమైన మందులు, పుస్తకాలు, ఉత్తరాలు వెంటనే అందజేయాలని జైలు అధికారులకు పౌరహక్కుల నేత, ‘కమిటీ ఫర్ ద డిఫెన్స్, రిలీజ్ ఆఫ్ జీఎన్ సాయిబాబా’ కన్వీనర్ ప్రొ.జి. హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. మందులు, లేఖలు, అధ్యయనానికి అవసరమైన మెటీరియల్ ఇవ్వడం వంటి ప్రతీ ఖైదీకి అందాల్సిన మౌలిక హక్కులను కల్పించాలనే డిమాండ్‌తో బుధవారం నుంచి నిరాహార దీక్షకు దిగనున్నట్లు సాయిబాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కోరుతున్న వాటిని అందజేయాలని మంగళవారం ఓ ప్రకటనలో ప్రొ.జి.హరగోపాల్ విన్నవించారు. సాయిబాబా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, కరోనా సోకే ప్రమాదమూ ఉన్నందున ఆయన్ను అనవసర ఆంక్షలతో వేధించవద్దని కోరారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా సాయిబాబాను కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలు సుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల ఆప్తులు, మిత్రుల లేఖలు అందజేయడంతో పాటు, ఆయన కోరిన పుస్తకాలూ ఇవ్వాలని పేర్కొ న్నారు. న్యాయవాది ఇచ్చిన మందులు, పుస్తకాలు కూడా సాయిబాబాకు చేరనివ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో మాతృమూర్తి అంత్యక్రియలకూ అనుమతినివ్వకపోవడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పెరోల్/మెడికల్ బెయిల్ ఇవ్వకపో వడంతో ప్రస్తుతం కరోనా కారణంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడిం దన్నారు. ఈ విషయంపై ప్రజాస్వామ్య వాదులు, సంస్థలు స్పందించి నాగ్‌పూర్ జైలు అధికారులకు విజ్ఞప్తులు పంపడం ద్వారా సాయిబాబా హక్కులు కోల్పోకుండా చూడాలని కోరారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు)కు ఈ నెల 15న సాయిబాబా భార్య వసంతకుమారి వినతిపత్రం పంపించారని హరగోపాల్ తెలిపారు. ఈ విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సాయిబాబా నిరాహార దీక్షకు దిగకుండా ఆయన అడిగినవి ఇవ్వాలని కోరారు. -
అవినీతి మరకలేని వారు రైతులొక్కరే..
మరికల్ (నారాయణపేట): దేశంలో అవినీతి మరక లేని వారు ఉన్నారంటే అది రైతులు ఒక్కరేనని ప్రొఫెసర్ హారగోపాల్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా మరికల్ శ్రీవాణి పాఠశాల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్ల రూపాలయలను కొల్లగొట్టి దేశం విడిచి పొతున్న అవినీతి రాజకీయ నాయకులకు ఈ ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలని కొరితే లాఠీచార్జ్‌లు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చెసుకుంటున్నా ప్రభుత్వాల నుంచి స్పందన రావడం లేదన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని అలోచన చేయకుండా రైతులు నూతన పద్ధతి ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టాలన్నారు. సేంద్రియ ఎరువులు వేసి పంటలను పండిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను ఆర్జించవచ్చన్నారు. నేడు హైబ్రీడ్ విత్తనాలు రావడంతో ఓ పంటల దిగుబడి పూర్తిగా తగ్గిందని, దీంతో అప్పులు రైతులవి ఆదాయం మాత్రం కార్పొరేట్ వారివి అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేసిన హామీలను వెంటనే అమలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసశర్మ, వినితమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మేధావుల విడుదలకు పోరాడాలి: హరగోపాల్
హైదరాబాద్: ప్రజాస్వామ్య మేధావులు వరవరరావు, సాయిబాబా సహా 11 మంది విడుదల కోసం మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు రాజీ లేని పోరాటం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఉద్యమించే హక్కుపై అప్రకటిత ఎమర్జెన్సీ (1975 జూన్ 25 ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా), ఉపా చట్టాన్ని రద్దు చేయడం, ప్రజాస్వామికవాదుల అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా రాజకీయ ఖైదీల విడుదల కోసం పౌరహక్కుల సంఘం, టీఎస్, ఏపీ ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడిత ప్రజలు విముక్తి చెంది సమసమాజం రావాలని కోరుకుంటూ ఉన్నతమైన విలువల కోసం పోరాడుతున్న మేధావులను జైళ్లలో పెట్టి వారి గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా, వరవరరావు తదితరులపై ఏ నేరాలూ లేవని.. ఆయుధాలతో చర్యను నిషేధించారే కానీ మావోయిస్టు రాజకీయాలను కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తుండటం వల్లే వరవరరావు సహా 11 మందిని జైలులో పెట్టారని ఆరోపించారు. అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సాయిబాబా మావోయిస్టు కార్యాకలాపాలను అమలు చేస్తాడా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్, ప్రొఫెసర్ ఖాసీం, బహుజన ప్రతిఘటన వేదిక నాయకుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
వరవరరావు విడుదలకు ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరావు విడుదలకు ఆదేశించాలని కోరుతూ ఆయన సతీమణి హేమలత భారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగలేఖ రాశారు. 79 ఏళ్ల వయో భారం, అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుపై కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు దేశ, విదేశాల ప్రముఖులు సంఘీభావం తెలిపారు. బహిరంగలేఖకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, వసంత కన్నబీరన్, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ ఈ సమావేశంలో మాట్లాడారు. ఫాసిజం వేగంగా విస్తరిస్తోంది... ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని, గత ఐదేళ్లుగా దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేయాలని కోరినవారిలో ఆయన అభిప్రాయాలతో, నమ్మకాలతో విభేదించేవాళ్లు సైతంఉన్నారని చెప్పారు. దేశంలో ఫాసిజం అత్యంత వేగంగా విస్తరిస్తోందని, భవిష్యత్తులో అది మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ కుట్రకేసు మొదలుకొని గత నాలుగున్నర దశాబ్దాలుగా వరవరరావుపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, అన్నింటిలోనూ ఆయనే గెలిచారన్నారు. అక్రమకేసులు మోపినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును జైల్లో ఉంచడం తగదన్నారు. సమావేశంలో జహీరుద్దీన్ అలీఖాన్, కె.కాత్యాయని, దేవీప్రియ, ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి, వసంత కన్నబీరన్ తదితరులు లేఖకు మద్దతుగా మాట్లాడారు. ఆయన నిర్దోషి... గత 45 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న వరవరరావు నిర్దోషి అని, ఆయనపై ఇప్పటివరకు బనాయించిన 25 కేసుల్లో 13 కేసుల్లో నిర్దోషి అని న్యాయస్థానాలు ప్రకటించాయని హేమలత తెలిపారు. మిగిలిన 12 కేసులు విచారణ స్థాయికి రాకముందే పోలీసులు ఉపసంహరించుకున్నారన్నారు. పుణే పోలీసులు బనాయించిన భీమా కోరేగావ్ కేసులోనూ ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వా సం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాస్వామికవాదులు, మేధావులతోపాటు అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, శ్రీలంకకు చెందిన పలువురు రచయితలు, మేధావులు సంఘీభావం తెలుపుతూ ఆన్లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారని చెప్పారు. -
ప్రశ్నించిన వారంతా అర్బన్ నక్సలైట్లేనా?
సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారంతా అర్బన్ నక్సలైట్లేనా అని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సుకు హాజరై మాట్లాడారు. అర్బన్ నక్సలిజం పెరిగిపోతోందని ఇటీవల ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తుండటంపై ఆయన స్పందిస్తూ.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా నక్సలైట్లతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. వరవరరావు జైలులో ఉన్నప్పుడు కేసీఆర్ నాటి కేంద్ర మంత్రిగా ఆయన్ను కలసి మాట్లాడారని, అంత మాత్రాన కేసీఆర్‌ను అర్బన్ నక్సలైట్‌గా పరిగణిస్తామా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సభ్యత్వం లేని వారిపట్ల కేంద్రం ధోరణి సరికాదన్నారు. ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని మాత్రమే నిషేధించిందని, సాహిత్యాన్ని, భావజాలాన్ని నిషేధించలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని అన్నారు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రశ్నించే గొంతుకలు వస్తుంటాయని, వాటిని అణగదొక్కే క్రమంలో అర్బన్ నక్సలైట్లని ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని, ఇందుకు విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీలో హూంకార్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో విద్యాభిమానులు హాజరు కావాలని హరగోపాల్ పిలుపునిచ్చారు -
‘ఉద్యమాలను అణచివేస్తున్నారు’
హైదరాబాద్: ప్రజాఉద్యమాలు కొనసాగడమే పాలనకు గీటురాయని, ఎన్ని ప్రజాఉద్యమాలు జరిగితే పాలన అంత సజావుగా జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కానీ, తెలంగాణలో ప్రజాఉద్యమాలను పూర్తిగా అణచివేస్తున్నారని, ఉద్యమాలు చేస్తున్నవారిని అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న అక్రమంగా అరెస్టు చేసిన అక్కాచెల్లెళ్లు భవానీ, అన్నపూర్ణ, అనూషలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సంబంధం పెట్టుకుని ప్రజాసంఘాలను నిర్బంధిస్తున్నదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు కట్టడం, షాదీ ముబారక్‌లు ఇవ్వడం కాదని, ప్రజాస్వామ్యం కాపాడడం, ఉద్యమాలు చేయనివ్వడం అని పేర్కొన్నారు. మా పిల్లలు ఏ నేరమూ చేయలేదు... అరెస్టుకు గురైన మహిళల తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, ఆత్మకూరి రమణయ్య మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు 15 మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి తమ కూతుళ్లను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆ పోలీసుల్లో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసు డ్రస్‌లో, మిగిలినవారందరూ మఫ్టీలో ఉన్నారని, దౌర్జన్యంగా అరెస్టు చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న 7 సెల్ఫోన్లు, ఐడీ ప్రూఫ్‌లు బలవంతంగా తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలపై ఏ నేరచరిత్ర లేదని, కేవలం మహిళాసంఘాలతో కలసి, మహిళల సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారని చెప్పారన్నారు. ప్రజాచైతన్య యాత్ర చేసినందుకే కక్షగట్టి అరెస్టులు చేశారని ఆరోపించారు. తమ పిల్లల్ని ఎక్కడ నుండి తీసుకువెళ్లారో, అక్కడ వదిలిపెట్టాలని, ఇంట్లో నుండి తీసుకెళ్లిన వస్తువులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను టఫ్ అధ్యక్షురాలు విమలక్క, ప్రొఫెసర్ లక్ష్మణ్, పీవోడబ్ల్యూ సంధ్య, సామాజిక కార్యకర్తలు సజయ, సనా ఉల్లాఖాన్, ముజాహిద్ హష్మీ, ప్రొఫెసర్ ఖాసీం తీవ్రంగా ఖండించారు. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
మిథ్యగా అందరికీ విద్య
‘వందలాది మంది విద్యార్ధుల బలిదానాలతో, అన్ని వర్గాల ప్రజల ఉద్యమ భాగస్వామ్యంతో ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆకాంక్షించాం. విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని భావించాం. దశాబ్దాలుగా కలగానే మిగిలిన ’అందరికీ విద్య’ లక్ష్యాన్ని తెలంగాణ రాష్ట్రం సాధిస్తుందనుకున్నాం. ’కేజీ టూ పీజీ’ అలాంటి ఆశలనే రేకెత్తించింది. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. విద్యావ్యవస్థ మరింత భ్రష్టుపట్టిపోయింది. చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారింది’ అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకులుగా, కామన్ స్కూల్ విధానం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో క్రియాశీల భాగస్వామిగా ఉన్న ఆయన తెలంగాణ లో విద్యారంగం తీరుతెన్నులపై ’సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తరువాత విద్యారంగంపై సమాలోచనలు ఆయన మాటల్లోనే.. కలగానే కామన్ స్కూల్ విధానం ఇప్పటికీ కోట్లాది మంది చదువుకు దూరంగానే ఉండిపోయారు. స్వాతంత్య్రానంతరం ’అందరికీ విద్య’ను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా రూపొందించేందుకు అంబేద్కర్ వంటి మహనీయులు కృషి చేసినా అమలుకు నోచలేదు. మొదటి నుంచి విద్య ప్రభుత్వం ఆధీనంలో లేదు. ప్రభుత్వమే దాన్ని చేతుల్లోకి తీసుకొని అన్ని వర్గాలకు ఒకేరకమైన విద్యను అందజేసే కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయవలసింది. కానీ అలా జరగలేదు. చివరకు 1985-86 నాటికి విద్యావ్యవస్థ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. అప్పటి నుంచి కామన్ స్కూల్ విధానం కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. తెలంగాణలో చదువుకుంటున్న సుమారు 62 లక్షల మంది పిల్లల్లో 34 లక్షల మందికి పైగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలోనే ఉన్నారు. 28 లక్షల మంది పిల్లలు కనీస సదుపాయాలులేని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 500 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ శక్తుల చేతుల్లో ఉంటే నాలుగైదే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. సంపన్నులకు, సామాన్యులకు ఒకేరకమైన విద్య అమలు కావాలనే లక్ష్యంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1985లో విద్యా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. మా పోరాటం, కృషి ఫలితంగా టీఆర్ఎస్ కేజీ టూ పీజీ విద్యను తన మేనిఫెస్టోలో చేర్చింది. కానీ అది కేవలం నినాదంగానే మిగిలింది. విద్యార్ధుల్లో విషాన్ని నింపుతున్న గురు’కులాలు’ కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేసి, ప్రైవేట్ పాఠశాలలను, విద్యాసంస్థలను పూర్తిగా నియంత్రించి కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే విద్యను అందజేస్తుందని ఆశించాం. తెలంగాణ పోరాటంలో యూనివర్సిటీల పిల్లలు ఎన్నో పోరాటాలు చేశారు. ప్రాణాలర్పించారు. పిల్లల పోరాటానికి ప్రతిఫలంగా, వారి కృషికి గుర్తింగా రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో గొప్ప అభివృద్ధి జరుగుతుందనుకున్నాం. కానీ వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. కేజీ టూ పీజీ స్థానంలో 600 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు. కానీ వెనుకబడిన కులాలు, గిరిజనులు,దళితులు, ముస్లింలు, అమ్మాయిలు,, అబ్బాయిలు, తదితర వర్గాలుగా పిల్లలను విభజించి వీటిని ఏర్పాటు చేయడం దారుణం. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 12 శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో అది 7 శాతానికి పడిపోయింది. ఆరు వేల స్కూళ్లను మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. 16 వేల టీచర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఒక్క డీఎస్సీ కూడా లేదు. కాంట్రాక్ట్ టీచర్ల ద్వారా పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. వర్సిటీల్లో అత్యధిక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వమైనా విద్యారంగంపై సీరియస్‌గా దృష్టి సారించాలి. - పగిడిపాల ఆంజనేయులు -
తెలంగాణ వస్తే అభివృద్ధి సాధ్యమనుకున్నాం
హైదరాబాద్: తెలంగాణ వస్తే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని భావించామని.. కానీ ఆశలు అడియాసలు అయ్యాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక మూడవ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ‘తెలంగాణ అభివృద్ధి–సామాజిక, ఆర్థిక సవాళ్లు, సానుకూలతలు’ అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ.. నీటిపారుదల రంగంలో కాంట్రాక్టర్ల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణకు హైదరాబాద్ నుంచి అద్వితీయమైన ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.లక్షా 70 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రజారంజకమైన పథకాలకు ఖర్చు పెడితే కొంత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. భూపంపిణీ చేయనిదే అట్టడుగువర్గాల జీవితాల్లో మార్పు రాదన్నారు. కేరళ మాదిరిగా బడ్జెట్లో 37 శాతాన్ని విద్యారంగానికి కేటాయిస్తే మానవ వనరులు సృష్టించబడతాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక విలువలు నిర్దాక్షిణ్యంగా అణచివేయబడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో నిధులతోపాటు చైతన్యవంతమైన ప్రజలు అందుబాటులో ఉన్నారని, కానీ ఈ రెండింటినీ ఉపయోగించి అభివృద్ధి చేయకపోగా ప్రజల పాత్రను నిరాకరిస్తున్నారని విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. కానీ ఈ రెండింటినీ లొంగదీసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మీడియా సంస్థల అధిపతులు, ఇతర పారిశ్రామిక యాజమాన్యాల మీద ఐటీ దాడులు జరగాల్సినప్పుడు జరగకుండా అవసరానికి ఉపయోగపడనప్పుడు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ కూడా పౌర హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక వెబ్‌సైట్‌ను కె.రామచంద్రమూర్తి ప్రారంభించారు. జేవీవీ రాష్ట్ర నాయకుడు డా.అందె సత్యం అ«ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ, టి.శ్రీనాథ్, డా.రమాదేవి, రాజామాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
‘యూజీసీ రద్దు ఆలోచనను విరమించుకోండి’
హైదరాబాద్: యూజీసీ రద్దు ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ‘యూజీసీ రద్దు–ఉన్నత విద్య విధ్వంసం’ అనే అంశంపై సదస్సు జరిగింది. పీడీఎస్‌యూ ఓయూ అధ్యక్షుడు లోకేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఉన్నత విద్యను కాషాయీకరణ చేయాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాము పాల్గొన్నారు. యూజీసీ స్కేల్ అమలుపై అధ్యయనానికి కమిటీ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అర్హత కలిగిన బోధనాసిబ్బందికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సవరించిన ఏడో వేతన కమిషన్ వేతనాలను చెల్లించే అంశంపై అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీ నెల రోజుల్లో నివేదికను ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిటీలో ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, ఓయూ మాజీ వీసీ, జేఎన్టీయూ, మçహాత్మాగాంధీ వర్సిటీ వీసీలు, కళాశాల విద్యా కమిషనర్‌ను సభ్యులుగా నియమించారు. -
రాజకీయ పడగ నీడలో న్యాయవ్యవస్థ
హైదరాబాద్ : రాజకీయ పడగ నీడలో న్యాయ వ్యవస్థ ఉందని, అందుకే నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సాక్షిగా బహిరంగంగా ప్రజల ముందుకు రావడం దేశంలో మొదటిసారిగా జరిగిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శనివారం హైదరాబాద్ హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్ర చివరి దశలో ప్రజాస్వామ్యం నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఉన్నత న్యాయస్థానంపై విశ్వాసం కోల్పోకూడదని న్యాయవాదులు మీడియా ముందుకు వచ్చారని.. ఈ చర్యను పౌరహక్కుల సంఘం స్వాగతిస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు కోర్టు ప్రధాన న్యాయముర్తిగా సీనియర్‌ను నియమిస్తారన్నారు. ప్రభుత్వానికి అనుకూలమైన జడ్జీలను నియమించడం ద్వారా సీనియర్ జడ్జీలను పక్కన పెడుతూ కోర్టు సంప్రదాయాలను పాటించడం లేదన్నారు. సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు ముంబై హైకోర్టులో విచారణ జరుగుతుండగా దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేసి తనకు అనుకూలమైన జడ్జీలతో బెంచ్‌ను ఏర్పాటు చేయడాన్ని బొంబాయి హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాదులు తప్పుబడుతున్నారని ఆయన వివరించారు. పౌరహక్కుల సంఘం ప్రతినిధి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ... రాజకీయాలకతీతంగా న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. దీపక్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీఎల్సీ ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. రఘునాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జెల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలను బహిష్కరించాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించి నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాల్లో ప్రజలను సమీకరణం చేయాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. పార్లమెంటరీ ఎన్నికల ద్వారా అణగారిన వర్గాలకు ఒనగూరేదేమీలేదని చెప్పారు. 2019 ఎన్నికలు ఫాసిజానికి పరిష్కారం చూపుతాయని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లో విరసం రాష్ట్ర మహాసభల ముగింపుసభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ కూడా పార్లమెంటరీ ఎన్నికల వల్ల విధ్వంసంతో కూడిన దోపిడే తప్ప పేదలకు ఒనగూరిందేమీ లేదన్నారు. దేశంలో నరేంద్రమోదీతో మొదలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకు అందరిదీ ఒకే విధానమని చెప్పారు. పార్లమెంటరీ ఎన్నికల ద్వారా ప్రజలను కులం పేరుతో చీల్చి, మతం పేరుతో కలుపుతున్నారని పేర్కొన్నారు. బ్రాహ్మణ భావజాలం దేశానికి ఎంత శత్రువో.. పార్లమెంటరీ రాజకీయాలూ అంతే శత్రువులన్నారు. పార్లమెంటరీ పద్ధతిలో ఎన్నికైన నెహ్రూతో మొదలుకుని ఇందిరాగాంధీ, రాజీవ్ తదితరులంతా చేసిందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా 3 వేల మంది కమ్యూనిస్టులను పొట్టన బెట్టుకున్నారని, అదే సమయంలో రజాకార్ల పేరుతో 40 వేల మంది ముస్లింలను ఊచకోత కోశారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు నక్సల్బరీ ఒక్కటే మార్గం కాదని వరవరరావు పేర్కొన్నారు. 1930లో మార్క్సిజం ఎలాగైతే ఫాసిజాన్ని ఓడించిందో అలాంటి సమీక్ష జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గొప్ప విప్లవం దేశంలో మళ్లీ వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం నల్లమలలో విప్లవకారులు లేకపోవచ్చు.. ఖాళీ అయిన నల్లమల విప్లవం భవిష్యత్‌లో వస్తోందన్నారు. విరసం అంటరానితనం అయ్యిందని, ఎన్కౌంటర్ల పేరుతో రాజ్యహింసకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ముంబైలో ఏడుగురిని బందీ చేశారని, వారిపై మావోయి స్టు ముద్రవేసి హతం చేసేందుకు రాజ్యం కుట్ర చేస్తోందని వరవరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వారి అరెస్టును వెంటనే ప్రకటించాలని, వారి ప్రాణాలకు హాని తలపెట్టవద్దని ఆయన కోరారు. పాలకులు భయపడుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్ సభలు, సమావేశాలు జరుపుతామంటే పాలకులు భయపడుతూనే ప్రజలను భయపెట్టిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో పాలక, ప్రతిపక్షాలన్నీ కూడా భయంతో సతమతమవుతున్నాయని చెప్పారు. ఈడీ, సీబీఐ, సిట్ ఇలా తమ మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయో.. ఎప్పుడు జైలుకు వెళ్తామోననే ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కల నెరవేరిన మరుసటి రోజు నుంచే సభలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. భయానక పరిస్థితుల్లో కూడా మాట్లాడగలిగే సాహసం చేసేది ఒక్క విరసం మాత్రమేనన్నది గుర్తుం చుకోవాలన్నారు. ప్రస్తుతం దేశభక్తి అంటే రామభక్తిగా మారిందని.. రాముడిని కొలవకపోతే దేశద్రోహం చేసినట్లుగా చిత్రీకరిస్తున్నారని విరసం నేత కల్యాణ రావు దుయ్యబట్టారు. దేశంలో బ్రాహ్మణీయ ఫాసిజం పెరుగుతుందని, దీనికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని నాగపూర్‌కు చెందిన వీరసాథెదార్ అన్నారు. విరసం రాష్ట్ర కార్యదర్శిగా పాణి విరసం రాష్ట్ర కార్యదర్శిగా పాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర మహాసభల్లో ముగింపు సందర్భంగా ఆదివారం ఈ ప్రకటన చేశారు. విరసం సభ్యులు వరలక్ష్మి, కాశీం, రాంకి, అరసవెల్లి కృష్ణ, జగన్, చిన్నయ్య, బాసిత్, రివేరా, క్రాంతి, వెంకన్న, రాము, గీతాంజలి, ఉదయబాను, ఉజ్వల్, కిరణ్ తదితరులు ఏకగ్రీవంగా పాణిని ఎన్నుకున్నారు. -
విదేశీ పెట్టుబడిదారుల ఒత్తిడితోనే జీఎస్టీ
హన్మకొండ కల్చరల్: విదేశీ పెట్టుబడిదారుల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేస్తోందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.హర గోపాల్ అన్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొం డలో ‘కలాలు ఎదుర్కొంటున్న సవాళ్ల’ అనే అంశంపై జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ పెట్టుబడిదారీ విధానం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. తాను రచయితను అయినప్పటికీ కంచ ఐలయ్య రచనలపై జరిగిన దాడుల మాదిరిగా తనపై జరగ లేదని, ఐలయ్య రచనలు అంతగా ప్రభా వితం చేశాయ న్నారు. తెరవే రాష్ట్ర అధ్య క్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ వేదిక ప్రజల పక్షాన నిలబ డుతుందని శ్రమజీవుల మధ్య ఉంటూ పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో రచయిత అల్లం రాజయ్య, ఆచార్య కాత్యాయనీ విద్మహే పాల్గొన్నారు. -
ఆ జీవితఖైదు రాజ్యాంగ విరుద్ధం
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బుధవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరవరరావుతో కలసి ఆయ న మాట్లాడారు. ప్రభుత్వం ఏడుగురిని అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా 70 నుంచి 80 రోజులు జైల్లో పెట్టడం అప్రజాస్వామికమన్నారు. తెలం గాణ సీఎం కేసీఆర్ కార్యాలయానికి ప్రజా సంఘాల నేతలు వెళితే కలిసే పరిస్థితి లేదని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు విధించడంతో షాక్‌కు గురయ్యామని.. దీనిపై న్యాయస్థానంలోనే కాక బయట సైతం పోరాటం చేస్తామన్నారు. ఈ జడ్జిమెంట్‌ను పునః పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. దుర్గప్రసాద్ లాంటి జర్నలిస్ట్, ప్రశాంత్‌రాహి లాంటి వారు ప్రజా ఉద్యమంలో పాల్గొంటే తప్పా అని ప్రశ్నించారు.సాయిబాబాకు క్రిమినల్ అఫెన్స్ లేదన్నారు. సాయిబాబా తీర్పు న్యాయమూర్తి రాసింది కాదని, ఎన్ఐఏ రాసిందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో అప్పీల్æ చేస్తామన్నారు. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాస్వామ్యవాదులను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు నిర్బంధించి 75 రోజులుగా సుక్మాజైల్లో రాజ్య నిర్బంధం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతా పోరాటాలు చేయాలన్నారు. -
ఉద్యమాలతోనే హక్కుల పరిరక్షణ
అంతర్జాతీయ గని కార్మిక మహాసభలో ప్రొఫెసర్ హరగోపాల్ గోదావరిఖని: ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమాల ద్వారానే హక్కుల పరిరక్షణ జరుగుతుం దని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. అంతర్జాతీయ గని కార్మికుల రెండో మహాసభ సందర్భంగా గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కాలనీ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు. హరగోపాల్ మాట్లాడుతూ అనేక పోరాటాలు, నాయకులు, విప్లవకారులు, కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగానే హక్కులు పుట్టుకొచ్చాయని, వాటిని పరిరక్షించేం దుకు నిరంతరం ఉద్యమిస్తూనే ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా గతంలో పెట్టుబడిదారులు కార్మికులను జలగల్లా పీడించేవారని, కార్మిక శక్తికి భయపడి కొన్ని హక్కులను ప్రకటించారన్నారు. అయితే వాటిని కాపాడుకునేలా కార్మిక సంఘాలు ప్రయత్నించాలని, కొత్త హక్కుల కోసం పోరాడాలని సూచించారు. 19, 20వ శతాబ్దాలలో పెట్టుబడి అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిందని, కార్మికుడు దేశసరిహద్దులు దాటలేని పరిస్థితి ఏర్పడగా.. పెట్టుబడి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలిగే మార్పు ఏర్పడిందన్నారు. 60 శాతం పెట్టుబడి ప్రపంచంలో ఉన్న ఒక్కశాతం మంది చేతుల్లో ఉందని, వారే రాజ్యాల్ని నడిపిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు 95 శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారని, వారికి వేతనాలు లేవని, భద్రత లేదని, నాయకత్వం వహించే వారే లేరన్నారు. సంఘటిత రంగానికి నాయకత్వం వహిస్తున్న వారే అసంఘటిత రంగాన్నీ చేతబూనాలని కోరారు. గని కార్మికులు గనుల్లోకి వెళ్లి బొగ్గు, ఇతర సహజ వనరులను వెలికితీసి దేశ అభివృద్ధికి పాటుపడుతూ సంపదను సృష్టిస్తుంటే.. పెట్టుబడిదారులు, రాజ్యాలు ఆ సంపదను కార్మికుడికి అందకుండా చేస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈ నేపథ్యంలో కార్మికుడు ప్రశ్నించడం మొదలు పెట్టాలని, అప్పుడే పెట్టుబడిదారులు, రాజ్యాలు శ్రమజీవులపై దాడులు చేయడం ఆపివేస్తాయని, ఈ ఉద్యమం సంఘటితంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పోరాటం మరువలేనిదని, అదే సమయంలో ఓసీలకు వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జీవన విధ్వంసాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసేలా ప్రారంభిస్తున్న ఓసీలను ఆపే లా ఉద్యమాలు రావాలన్నారు. కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగ భద్రత కోసం, హక్కు ల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించాలని, ఇందుకు అంతర్జాతీయ గని కార్మికుల మహాసభ దోహదపడుతుందనే నమ్మ కం ఉందని హరగోపాల్ స్పష్టం చేశారు. మహా సభ జాతీయ సన్నాహక కమిటీ చైర్మన్ పి.కె. మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వివిధ యూనియన్లకు చెందిన నాయకులు, విదేశీ ప్రతి నిధులు బి.ప్రదీప్‌కుమార్, సాదినేని వెంకటేశ్వరరావు, డాక్టర్ అపర్ణ, డాక్టర్ పటోలే, అండ్రియాస్, టి.సూర్యం, టి.శ్రీనివాస్, కె.విశ్వనాథ్, బి.సంపత్‌కుమార్, ఇ.నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ విద్యా విధానంలో మార్పు రావాలి
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: దేశంలో విద్యా విధానం మారాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన తెలంగాణ గురుకుల ఉపాధ్యాయుల సంఘం డైరీ–2017 ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ పోవాలని కోరుతూ ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే విద్యా పోరాట యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని, ఉపాధ్యాయులందరూ తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు జరిగితే బాగుంటుందని, సమాంతర పద్ధతిలో విద్య అందినప్పుడే మార్పును తీసుకురాగలమని చెప్పారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెంచాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.25 వేల కోట్ల నిధులైనా విద్యా రంగానికి ఇవ్వాలన్నారు. కొఠారీ కమిషన్ సిఫిరస్సులను అమలు చేయాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టు విధానంలో నియామకాలను పూర్తిగా నిలిపివేయాలన్నారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... పెన్షన్ రద్దును వ్యతిరేకిస్తూ మార్చి 2న జరిగే నిరసన సభను విజయవంతం చేయాలని కోరారు. గౌరవ అధ్యక్షడు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఫాసిజం వైపు దేశం’
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ప్రజాస్వామ్య సంఘాల నేతల అరెస్టులను చూస్తుంటే దేశం ఫాసిజం వైపు పయనిస్తోందని అర్థం అవుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ‘చత్తీస్ఘడ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్టును వెంటనే ఎత్తివేసి అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని’ డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వాస్తవాలను తెలుసుకోవటానికివ వెళ్లిన ఉద్యమ నాయకులను అరెస్టు చేయటం దారుణమని విమర్శించారు. దేశంలో ఉన్న వ్యవస్థలన్ని దెబ్బతిన్నాయని, చివరకు న్యాయ వ్యవస్థ కూడ ప్రభుత్వం ఏం చెపుతుందో మరునాడు అదే చెపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలను మద్య తరగతి ప్రజలు అర్థం చేసుకోవాలని, లేకుంటే చీకటి రోజులను చూడాల్సి వస్తుందని అన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజల కష్టాలను చూస్తుంటే దేశాన్ని ఎవరైనా పాలించవచ్చు అనిపిస్తుందని అన్నారు. మీడియా రాజ్యం స్వభావాన్ని ప్రశ్నించాలి తప్ప పాలనలో భాగస్వామ్యం కావద్దని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ఊహించానని అన్నారు. అక్రమ కేసులు పెట్టడాన్ని సాయుధ పోరాటంలోనే చూశానని ఇది ఫ్యూడల్ పద్దతి అని విమర్శించారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఎవరూ మాట్లాడకూడదు అనే రీతిలో రాజ్యం అణచివేస్తుందన్నారు. ఆదివాసి ప్రాంతాల మీద తీవ్ర నిర్భంధం కొనసాగుతుందని విమర్శించారు. అణచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించిన ఉద్యమ నాయకులు బల్ల రవీందర్, చిక్కుడు ప్రభాకర్, దుడ్డు ప్రభాకర్, బండి దుర్గా ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, నజీర్, రమణాల లక్ష్మయ్యలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు విమలక్క, నలమాసు కృష్ణ, కోటి, గురజాల రవీందర్, ప్రొఫెసర్ లక్ష్మణ్, వి. రఘునాథ్, దేవేంద్ర, నారాయణరావు, కుమారస్వామి, సావిత్రి, కె. కృష్ణ, కనీజ్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
కరెన్సీ రద్దు వల్ల ప్రయోజనం ప్రశ్నగానే మిగిలింది
కేంద్రం చర్యలను తప్పుబట్టిన ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: కరెన్సీ రద్దు వల్ల ప్రయోజనం ఏమిటనేది ప్రశ్నగానే మిగిలిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనాన్ని అరికట్టడం అటుంచితే సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ’పెద్ద నోట్ల రద్దు నల్లధనం రద్దుకేనా’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హరగోపాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రయోజనాల కోసమే మన దేశ కరెన్సీని రద్దు చేశారనే అనుమానం కల్గుతోందని విమర్శించారు. కార్పొరేటర్ శక్తులను కాదని నిర్ణయాలు తీసుకునే శక్తి పాలకులకు ఉందా? అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ చక్రధర్ రావు మాట్లాడుతూ నల్లధనం సమస్య 1950 సంవత్సరంలోనే ప్రారంభమైందని అన్నారు. నల్లధనం ఉన్నవారు మాత్రం ఇప్పుడు ఇబ్బంది పడటం లేదనీ దాన్ని వ్యూహత్మకంగా బయటికి తీసుకురాకుండా నోట్లను రద్దు చేయటం సరికాదన్నారు.విరసం నేత వరవర రావు మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల అవినీతిని అరికట్టలేరని, ఎందుకంటే బిజేపి ప్రభుత్వం అవినీతి పునాదులమీదనే నిర్మాణం అరుుందని విమర్శించారు. ఇంకా ప్రొఫెసర్ రామకృష్ణ, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ కేంద్రం చర్యలను విమర్శించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి, ప్రొఫెసర్ ముత్యం రెడ్డి, నలమాస కృష్ణ, డాక్టర్ కె.శ్రీనివాస్, ఎ.రాజేంద్రబాబు, డాక్టర్ రమణమూర్తి, ఎ.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మల్టీనేషనల్’ కనుసన్నల్లో ఏపీ సర్కారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం పూర్తిగా మల్టీ నేషనల్ కంపెనీల కనుసన్నల్లో నడుస్తోందని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) కన్వీనర్, ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదిక నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సహజ వనరుల్ని మల్టీ నేషనల్ కంపెనీలకి ధారాదత్తం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒప్పందాల్లో భాగంగానే ఆంధ్రా-ఒడిశా సరి హద్దులో గ్రీన్‌హంట్ పేరుతో అతిపెద్ద బూటకపు ఎన్‌కౌంటర్‌కి పాల్పడింది. ఏపీ సీఎం, డీజీపీ చెబుతున్నట్లు ఎన్కౌంటర్ నిజమైతే... సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిం చాలి. ఆదివాసీ ప్రాంతంలోని బాకై ్సట్ నిక్షేపాలు మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టేందు కే వారికి అండగా ఉంటున్న మావోరుుస్టులను హత్య చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గ్రేహౌండ్స, కేంద్ర రిజర్వ్ బలగాలు, ఒరిస్సా పోలీసులు జరుపుతున్న కూంబింగ్‌ను తక్షణమే నిలిపేయాలి. పోలీసుల అదుపులో మావోరుుస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ)తో పాటు మరో 11 మంది అనుచరులను వెంటనే కోర్టులో హాజరుపరచాలి. బూటకపు ఎన్‌కౌంటర్‌తో కిరాతకంగా 32 మందిని చంపిన పోలీసులపై హత్యా నేరం మోపి శిక్షించాలి’ అని హరగోపాల్ డిమాండ్ చేశారు. రక్తపుటేరులపై పునర్నిర్మాణమా! 140 కోట్ల బాకై ్సట్ నిక్షేపాలు ఒరిస్సాకు సమీపంలోని ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్నాయని, వాటిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆదివాసీల జీవనం, జీవితం ఆ అరణ్యాల్లోనేనని, అవి లేకుండాపోతే ఆదివాసీలే ఉండరన్నారు. వారికి అండగా ఉంటున్న మావోరుుస్టులను చంపేందుకు సృష్టించిందే గ్రేహౌండ్స అన్నారు. అప్పటి ప్రభుత్వం సృష్టించిన నయీమ్ ఉదంతం చూశామన్నారు. ఏవోబీలోకి గ్రేహౌండ్స, కేంద్ర రిజర్వ్ బలగాలు వెళ్లి.. మావోరుుస్టులను చంపాయన్నారు. మారణకాండ, రక్తపుటేరుల మీద రాష్ట్ర పునర్నిర్మాణం జరుపుతారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్కే ఎక్కడున్నాడు..? ఆర్కే ఎక్కడున్నాడో వెంటనే తెలపాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు మెదపరెందుకన్నారు. ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడు తూ... 32 మంది మావోయిస్టులను పట్టుకుని చిత్రహింసలు పెట్టి పోలీసులు కాల్చి చంపారన్నారు. మహిళా మావోయిస్టుల శరీరభాగాలు లేవన్నారు. ఓ మహిళా మావోయిస్టు మొండెం మాత్రమే ఉందని, మరికొందరి శరీరంపై కత్తులతో కోసిన గాయాలున్నాయని వారి కుటుంబీకులు తెలిపారన్నారు. గనుల విషయంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ అమలు చేయాల్సి ఉన్నా... దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. కొండల కింద బాకై ్సట్ ఉంటేనే నీళ్లుంటాయన్నారు. నీళ్లు లేకపోతే ఆదివాసీల జీవితమే ఉండదని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు పి.సంధ్య చెప్పారు. 2 రాష్ట్రాల్లోని ప్రజాస్వామిక వాదులు ఎన్‌కౌంటర్‌పై నోరువిప్పి, ఆదివాసీల వెంట నడవాలని పిలుపునిచ్చారు. టీడీఎఫ్ నేత చిక్కు డు ప్రభాకర్ మాట్లాడుతూ నవంబర్ 5న ఈ ఎన్‌కౌంటర్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం జరుపుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ వినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు, ప్రజలు ఇందులో పాల్గొనాలని కోరారు. టీడీఎఫ్ నాయకులు డప్పు రమేష్, పీడీఎం రాజు, బండి దుర్గాప్రసాద్, కోఠి, జ్యోతి, విరసం గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. మృతదేహాలపై గాయాలు ‘స్నేహితురాలు భారతి బంధువుల కోసం వెళ్తే, నా సహచరుడు కూడా ఉన్నాడని తెలిసింది. ఎన్కౌంటర్ జరిగి రెండు రోజులైనా ఫొటో విడుదల చేయలేదు. మృతదేహాలన్నింటిపై గాయాలున్నాయి. కొన్ని మృతదేహాల నుంచి పేగులు, ఇతర అవయవాలు బయటకు వచ్చాయి. నా భర్త ప్రభాకర్ ఇంజనీర్. ఆదివాసీల బాగు కోసమే ఉద్యమ బాటపట్టారు’ అని ఎన్కౌంటర్లో మృతిచెందిన ప్రభాకర్ భార్య దేవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఆ విషయం ప్రభుత్వానికి తెలియదా?’
హైదరాబాద్: అణచివేత, విధ్వంసం నుంచే తిరుగుబాటు వస్తుందనే విషయం పాలకులకు తెలియకపోవటం బాధాకరమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధి సంఘాలపై కొనసాగిస్తున్న నిర్బంధం తగని చర్య అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్ధి జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్ధి ఉద్యమంపై నిర్భందానికి వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాలొని మాట్లాడారు. ఏ ఉద్యమ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణను సాధించుకున్నారో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం విద్యార్థులపై ఆంక్షలు పెట్టటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మాట్లాడుకునే స్వేచ్ఛను ఇవ్వకుంటే ఇదేమి ప్రజాస్వామ్యమని విమర్శించారు. పాలకులు హద్దులు మీరి ప్రవర్తిస్తే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఏబీవీపీ సహా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా?
♦ సీఎం ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు: ప్రొఫెసర్ హరగోపాల్ ♦ ప్రజలతో మాట్లాడే ప్రభుత్వం వస్తుందనుకున్నాం ♦ పోరాడింది ఇలాంటి తెలంగాణ కోసం కాదు ♦ టీఆర్ఎస్ పోరాటం వల్లే రాష్ట్రం రాలేదు ♦ కొత్త రాష్ట్ర ప్రగతి దిశ, దశ సరిగాలేదు ♦ ఆర్టీసీ కార్మికులను విస్మరించొద్దు: కోదండరాం సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ వస్తే ప్రజలతో మాట్లాడే ప్రభుత్వం వస్తుందని, మానవీయ పాలన, స్పందించే పాలన ఉంటుందని అంతా ఆశించాం. కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరికీ కలవటానికి అవకాశం ఇవ్వటం లేదు. కోదండరాం సార్ అదే అంటున్నారు. నేనూ అదే అంటున్నా.. నిన్న ఎస్సీ,ఎస్టీ హక్కుల సంఘం వాళ్లూ అదే అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులూ అదే చెప్తున్నారు.. సమస్యలు చెప్పుకుని పరిష్కరించమని అడగాలంటే మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం’’ అంటూ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రజలు పోరాడి తెచ్చుకున్నది ఇలాంటి తెలంగాణ కోసం కాదని విమర్శిం చారు. ఆర్టీసీలోని పలు సంఘాల జేఏసీ బుధవారం హైదరాబాద్‌లో ‘ఆర్టీసీలో నష్టాలు- మేధావుల అభిప్రాయం’ పేరుతో జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును విమర్శించారు. నిర్ణయాల్లో మార్పు రావాలి సీఎం ఎవరికీ అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారని, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని హరగోపాల్ పరోక్షంగా విమర్శించారు. ‘‘ఒక్క టీఆర్ఎస్ పోరాటం వల్లనో, ఏ వ్యక్తి వల్లనో తెలంగాణ రాలేదు. ఆ పోరాటం లో అంతా భాగస్వామ్యమయ్యాం. ఆర్టీసీ కార్మికుల పాత్రా ఉంది. అంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అడిగే హక్కు, మాట్లాడే హక్కు అందరికీ ఉంది. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రగతి దిశ, దశ సరిగా లేదనే అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిశగా పోతున్నట్టు లేదు. ప్రభుత్వ ఆలోచన విధానంలో, విధాన నిర్ణయాల్లో మౌలిక మార్పులు రావాల్సి ఉంది’’ అని అన్నా రు. ‘‘ఇప్పటికే రెండేళ్లు గడిచింది. మరో మూడేళ్లుంది. ప్రజల ఆకాం క్షకు తగ్గట్టుగా పాలన ఉంటే మళ్లీ వాళ్లే గెలుస్తారు, అప్పుడు ట్యాంక్‌బండ్ చుట్టూ వారి విగ్రహాలు పెట్టుకోవచ్చు. లేదంటే.. ఉన్న విగ్రహాలు తీసి పారేయటం కూడా ఈ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోరు. నష్టం జరగకముందే ప్రభుత్వం స్పందిస్తే మంచిది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా రోజూ ఉదయం గంటసేపు అందరినీ కలిసే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఉద్యమాన్ని సృష్టించినవాళ్లు ఇంకా ఎలా ఉండాలని ప్రశ్నించారు. ఆర్టీసీలో లాభాలను వెతకడం మంచిది కాదని సూచించారు. ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు సంస్థలకు సంపద దోచిపెట్టి, ఆ తర్వాత డబ్బులతో ఎన్నికల్లో గెలవచ్చనే ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు. లాభాలతో ముడిపెట్టడం సరికాదు ఆర్టీసీని లాభాలతో ముడిపెట్టి చూడడం మంచిది కాదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. రిటైర్ అయిన వ్యక్తులను ఎండీ, విజిలెన్స్ డైరక్టర్‌గా పెడితే ఆర్టీసీ బలోపేతం కోసం వారేం కృషి చేస్తారని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం ప్రశ్నించారు. కళ్లలో కారం చల్లి కర్రలతో దాడి చేయించిన నేతను రవాణా మంత్రిగా పెడితే ఆర్టీసీ ఎలా బాగుపడుతుందని పిట్టల రవీందర్ అన్నారు. పరిపాలనకు సిద్ధపడే వారు ముందుగా రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సి ఉందని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. బకాయిలు వెంటనే ఇవ్వాలి: కోదండరాం తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతోనే కార్మికులు ఉద్యమంలో చురుగ్గా వ్యవహ రించారన్న విషయాన్ని విస్మరించొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా కార్పొరేట్ పెత్తనం వల్ల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడ్డాయని, తెలంగాణ వచ్చినందున ఆ పెత్తనం కూల్చే దిశగా ప్రయత్నం జరగాలన్నారు. ప్రజా రవాణా ఆవశ్యకత విషయంలో ప్రభుత్వ కార్యాచరణ ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు. తప్పయితే మైక్ ముట్టను: నాగేశ్వర్ ఆంధ్రా ప్రైవేటు రవాణా సంస్థలను నియంత్రిస్తే ఆర్టీసీకి రూ.వేయి కోట్ల ఆదాయం పెరుగుతుందని, నష్టాలొచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరిగి, లాభాలొచ్చే రూట్లలో అద్దె బస్సులు తిరిగే విధానం మారాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పేర్కొన్నారు. బినామీ పేర్లతో అధికారులు, ఎమ్మెల్యేలే అద్దె బస్సులను ఆర్టీసీకి ఇస్తున్నారని ఆరోపించారు. వస్తువుల కొనుగోళ్లలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని, ఆర్టీసీకి సొంత డీజిల్ బంకులు సమకూరిస్తే ఆదాయం వస్తుందన్నారు. తన సూచనల్లో ఒక్కటి తప్పని నిరూపించినా భవిష్యత్తులో మళ్లీ మైక్ ముట్టనని సవాల్ విసిరారు. -
అది భావప్రకటన స్వేచ్ఛపై దాడే
కోదండరాంపై మంత్రుల ఎదురుదాడిని ఖండించిన ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై మంత్రులు ఎదురుదాడికి దిగడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని, దీనిని పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల పక్షాన గొంతెత్తుతున్నందుకు ప్రొఫెసర్ కోదండరాంపై ప్రభుత్వ యంత్రాంగమంతా దాడి చేయడాన్ని ప్రజా, హక్కుల సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత, హక్కు కోదండారాంకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరోగ్యకర మైన విమర్శలు లేకుండా ఏ ప్రభుత్వమూ నడవదన్నారు. సమాజంలో భిన్నరంగాల వ్యక్తులు ఉంటారని, వారి విమర్శలను ప్రభుత్వం పాఠాలుగా తీసుకుని సవరించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తాను చెప్పిందే నడవాలనే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి పనికిరాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేసీఆర్, కోదండరాం మాట్లాడవద్దంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాజలాల వాటాలో పాలమూరుకు అన్యాయం
ఉద్యమ హామీలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం {పొఫెసర్ హరగోపాల్ ధ్వజం మహబూబ్‌నగర్ అర్బన్ : సొంత రాష్ట్రంలో కృష్ణానదీ జలాల వాటా కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళ న వ్యక్తం చేశారు. పాలమూరు అధ్యయన వేదిక అధ్వర్యంలో ఆదివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో కృష్ణానది ‘నీళ్లు.. మహబూబ్‌నగర్ విషాదగాథ’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ప్రధానవక్తగా ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాలను ప్రధానాంశాలుగా చేసుకుని తెలంగాణ ఉద్యమం చేశామని, కానీ 18 నెలల కాలంలోనే వాటికోసం మళ్లీ ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఉద్యమపార్టీ టీఆర్ ఎస్ కృష్ణాజలాల విషయంలో మహబూబ్‌నగర్ జిల్లాపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలి
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను ఆపితేనే తెలంగాణ రాష్ట్రం శాంతి యుతంగా ఉంటుందని, లేదంటే రాష్ట్రం హింస, ప్రతిహింసల వలయంలో కొట్టుకుపోతుందని ప్రొఫెసర్ హరగోపాల్ గురువారం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఈ 18 నెలల కాలంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోయినా ఎన్కౌంటర్ల వంటి ఘటనలకు పాల్పడడం దుర్మార్గమైందన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌పై నిరసన తెలిపేందుకు ట్యాంక్‌బండ్‌పై నున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చిన ప్రజా సంఘాల నేతలను పోలీసులు గురువారం అక్కడికక్కడే అరెస్టు చేశారు. హరగోపాల్‌తో కలసి తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్, ప్రజా కళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు నర్సన్న, పద్మ, తదితరులతో పాటు పలువురు ప్రజాసంఘాల నేతలు ఛత్తీస్‌ఘడ్ సంఘటనపై నిరసన తెలిపేందుకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో పౌరహక్కుల మహాసభలలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు ఉండవని చెప్పారని గుర్తు చేశారు. పౌర హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తానన్నారనీ, కానీ ఆయన అధికారం చేపట్టగానే రాష్ట్రంలో పౌర హక్కులను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అవతరించిన ఈ 18 నెలల కాలంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చర్యలు జరగలేదని తెలిపారు. తెలంగాణలో ఎన్కౌంటర్లు ఆపితేనే శాంతియుతంగా ఉంటుందని, లేదంటే హింస, ప్రతిహింసల నడుమ నలిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్ర పోలీసులు ఛత్తీస్‌ఘడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, అసలు ఏం జరిగిందని ఎన్కౌంటర్లు చేశారని ప్రశ్నించారు. -
రాజకీయ వ్యవస్థ లోపాల వల్లే ఆత్మహత్యలు
♦ ‘పాలమూరు రైతుగోస’ సభలో ప్రొఫెసర్ హరగోపాల్ ♦ రాజకీయ వ్యవస్థపై రైతులు యుద్ధం చేస్తారని హెచ్చరిక ♦ ఆత్మహత్యలపై పరిష్కార మార్గాలు చూపండి:రామచంద్రమూర్తి ♦ పార్లమెంట్లో రైతు సమస్యపై చర్చించరా?: కృష్ణారావు పాలమూరు: లోపభూయిష్టమైన రాజకీయ వ్యవస్థ తీరు వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో జరిగిన ‘పాలమూరు రైతు గోస కవిగాయక సభ’లో మాట్లాడారు. విజన్‌లేని రాజకీయ వ్యవస్థ వల్లే వ్యవసాయరంగం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. జీవనాన్ని కోల్పోతున్న రైతులు రాజకీయ వ్యవస్థపై యుద్ధం చేస్తారని. అయితే ఆ యుద్ధం రావొద్దనే ఉద్దేశంతోనే పాలమూరు అధ్యయన వేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై లోతుగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను ప్రభుత్వాలకు చూపాల్సిన అవసరం ఉం దన్నారు. ఈ సభను చూస్తుంటే 2002లో గుజ రాత్ మారణహోమం జరిగినప్పుడు 30 మందికవులు అక్కడికి వెళ్లి అక్కడి పరిస్థితులను సమాజం దృష్టికి తీసుకొచ్చిన ఘటన గుర్తుకు వస్తుందని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇటీవల కోర్టుకు ఒకే విధమైన అఫిడవిట్‌ను సమర్పిం చాయని తెలిపారు. పిల్లలను చదివించలేక, పెళ్లిళ్లు చేయలేక, ఆత్మహత్య చేసుకుంటున్నారని దానిలో పేర్కొన్నారని వెల్లడించారు. ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిప్యూటీ రెసిడెంట్ ఎడిటర్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీ ఒక కుట్ర ప్రాంతంగా మారిం దన్నారు. రైతు ఆత్మహత్యలపై పార్లమెంట్లో కనీస చర్చ లేదన్నారు. రైతు ఆత్మహత్యలపై పాలకులు దుర్మార్గంగా ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కరువుచిత్రాలు, రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రారంభించారు. రైతుగోసపై కవులు కవితలు వినిపించారు. కార్యక్రమంలో అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, సభ్యులు, కవులు పాల్గొన్నారు. -
త్యాగాలు ఎవరి కోసం..?
తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్టు: ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కారమవుతాయనుకున్నారు. పాలకులు ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం చేస్తారని ఆశించి అనేక వర్గాల ప్రజలు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రస్తుత తెలంగాణ పాలకులు గత టీడీపీ, కాంగ్రెస్ అవలంబించిన అభివృద్ధి నమూనానే అమలు చేయాలనుకుంటే ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నట్టు? ఎందుకు ఆత్మత్యాగాలు చేసినట్లు?’’ అని ప్రొఫెసర్ హరగోపాల్ నిలదీశారు. ప్రత్యేక అవసరాలు గల చెవిటి, మూగ, మానసిక వైకల్యం, దృష్టిలోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం విద్యా హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నవనిర్మాణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద బహిరంగసభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన హరగోపాల్ మాట్లాడుతూ అహంకారంతో కాకుండా బాధలను పంచుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలను పాలకులు నిరాశకు గురి చేశారన్నారు. చెవిటి, మూగవారికి సైగలతో కూడిన విద్య కోసం ప్రత్యేక బడులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రాధాన్యమివ్వాలి... జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వికలాంగులు మానసికంగా కుంగిపోకుండా సమస్యలపై పోరాటాలు చేయాలని కోరారు. వికలాంగులకు, అనాథలకు విద్య, ఉపాధిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ శారీరక వైకల్యానికి ప్రభుత్వాలదే బాధ్యత అని అన్నారు. న్యూడెమొక్రసీ నాయకులు గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల మంది వైకల్యమున్న పిల్లలకు ఏడు స్కూళ్లు మాత్రమే ఉన్నాయంటే వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. 2015-16 బడ్జెట్లో వికలాంగులకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నవనిర్మాణ వేదిక గౌరవాధ్యక్షులు మురళీధర్‌గుప్తా, అధ్యక్షులు నల్లగంటి రామకృష్ణ, ప్రధానకార్యదర్శి సిలివేరి వెంకటేశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. -
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దని మానవహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అవి 30, 40 ఏళ్ల పాటు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణను తమకివ్వాలని ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వందేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర చరిత్ర రాస్తే, మొదటి మంత్రివర్గం ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని ఆయన చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులకు పైనుంచి అనుమతి ఉంటేనే ఎన్కౌంటర్లు జరుగుతాయని చెప్పారు. వీలుంటే అరెస్టు చేయడం, విచారించడం, న్యాయవ్యవస్థ ద్వారా విచారణ చేయడం పద్ధతి అని, మావోయిస్టుల విషయంలోనైనా.. మరెవరి విషయంలోనైనా ఇదే చేయాలని చెప్పారు. ఏకపక్షంగా చంపడం రాజ్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. వందేళ్ల తర్వాత చరిత్ర రాస్తే ఈ మొదటి కేబినెట్ ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర పోలీసులైనా, తెలంగాణ పోలీసులైనా ఒకేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలను ఏమీ చేయొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిస్తే వాళ్లేమీ చేయరని తెలిపారు. -
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు
-
గత పాలకుల వల్లే కష్టాలు
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల రౌండ్‌టేబుల్ సమావేశంలో హరగోపాల్ హైదరాబాద్ : శ్రీశైలం ముంపు బాధితులకు నేటికీ ఉద్యోగాలను ఇవ్వకపోవడం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలమూరు అధ్యయన వేదిక - హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడు తూ ప్రాజెక్టును నిర్మించినప్పుడు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి సీఎం ఎన్టీరామారావు ఇచ్చిన 98,68 జీవోలను ఇప్పటికీ ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌కు వెళ్లిన కేసీఆర్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. బాధితులు 160 రోజుల పాటు తమకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధాన డిమాం డ్తో ఉద్యమిస్తున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. అర్హత కలిగిన 2,500 మంది నిరుద్యోగులు నిర్వాసితుల్లో ఉన్నారని, వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు వారికి అండగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారినా, ప్రత్యేక తెలంగాణ వచ్చినా శ్రీశైలం నిర్వాసితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలంటూ నినాదాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఏడాది దాటినా నిర్వాసితులను పట్టించుకోకపోవ డం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డిలు మాట్లాడుతూ శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఈ నెల 20న మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి నుంచి వందలాది మంది నిర్వాసితులతో చేపట్టనున్న చలో అసెంబ్లీ పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రజాకవి రాజారాంప్రకాష్, విరసం సభ్యుడు రాంకి రామ్మోహన్‌లతోపాటు నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు కురుమన్న, ఉపాధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌కు అన్యాయం అత్యంత అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. కృష్ణానది ఎక్కువగా పారేది ఈ జిల్లాలోనే అయినా తాగు నీరు, సాగునీరు లేక వలసలతో వెలవెలబోతుంది. ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు గడచినా శ్రీశైలం ముంపు నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరుగలేదు. - ఎం. మురళీధర గుప్తా,హైదరాబాద్ జిల్లా కన్వీనర్ , పాలమూరు అధ్యయన వేదిక . ఆందోళనకు ముగింపు రావాలి గత ప్రభుత్వాల దుర్మార్గానికి, మోసానికి బాధితులైన నిర్వాసితులకు ఎదురవుతున్న అ న్ని నియంత్రణలు, అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి. అదే విధంగా 67 గ్రామాలలో సామాజిక నివేదికలు లేవు. దీనిపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి నివేదిక తయారు చేయించి గడువులో అమలు జరపాలి. - ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ . వయసు మీరుతున్నా జాబ్ రాలేదు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో మాతాతల నాటి నుంచి వస్తున్న సాగుభూమి 9.5 ఎకరాలు కోల్పోయా. మూడు దశాబ్దాల నుంచి నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో జీవిస్తున్నా. వయసు మీరిపోతోంది కానీ ఉద్యోగం రాలేదు. పౌరహక్కుల, ప్రజా సంఘాల నేతలు మా విషయంలో స్పందించి న్యాయం చే యాలి. - పి.కురుమన్న, శ్రీశెలం ముంపు నిర్వాసితుల జిల్లా అధ్యక్షుడు. -
ప్రభుత్వం చేతుల్లోనే విద్యారంగం ఉండాలి
- ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: విద్యారంగాన్ని ప్రభుత్వమే సంపూర్ణంగా నడపాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు ఎలాంటి ఖర్చులు లేకుండా చదువుకోవాలని.. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలని ఆయన అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో ఉచిత విద్య- ప్రభుత్వ బాధ్యత’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ దేశంలోని సాధారణ కుటుంబాల్లో తమ పిల్లల విద్య విషయంలో ఆందోళన ఉందని అన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులను ఆనాడు వైఎస్.రాజశేఖరరెడ్డి తిరస్కరించి వారి విధానాలను వ్యతిరేకించడంతో ఆంధ్రప్రదేశ్‌కు అప్పు ఇవ్వమని ప్రపంచ బ్యాంకు వెళ్లిపోయిందని అన్నారు. వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎత్తివేయాలని, సంక్షేమ పథకాల్లో కోత విధించాలని, ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని షరతులు విధించటంతో వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకంచారని, దీంతో ప్రపంచ బ్యాంకు ఏపీకి అప్పు ఇవ్వమని వె ళ్లిపోయిందన్నారు. ఏపీకి అప్పు ఎందుకు ఇవ్వలేదో ప్రపంచ బ్యాంకు వారు ఒక నివేదికను తయారు చేశారని, అందులో ఈ విషయాలు ఉన్నాయన్నారు. వైఎస్సార్ ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గకుండా మెండిగా వ్యవహరించటం వల్లనే రాష్ట్రానికి కొంత మేలు జరిగిందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను అందించాలని అన్నారు. నాణ్యమైన విద్య లేకపోవటం వల్లనే కార్పొరేట్ విద్య వచ్చిందన్నారు. పిల్లల కోసమే ీఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది కానీ అది కార్పొరేట్ వ్యవస్థకు లాభం చేకూరుస్తుందన్నారు. కార్యక్రమం లో విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్ అందె సత్యం, పీడీఎస్‌యూ నాయకులు అశోక్, కాంట్రాక్టు లెక్షరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురే శ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన అవసరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఏ రంగంలో విధాన నిర్ణయం తీసుకున్నా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తామన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలని.. యువతకు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల సిలబస్ విడుదల సందర్భంగా హరగోపాల్ మాట్లాడారు. ప్రైవేటు రంగంలో కూడా పరిశ్రమలు వస్తే అందులో రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్న అంశాన్నే ప్రభుత్వం ప్రధానంగా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కేబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నా నిరుద్యోగులకు ఎంతమేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్న దానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర యువత కు ప్రయోజనం చేకూరేలా సిలబస్ రూపకల్పన పూర్తి చేశామని.. ఈ పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాల్లో చేరే యువత చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. 20-30 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించాల్సిన ఉద్యోగాల్లో చేరే యువత రాష్ట్రం పట్ల అంకితభావంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని, పోటీ పరీక్షల్లో బాలికలే ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. మీడియా అనవసరపు వివాదాలు ప్రచారం చేయవద్దని... దాని వల్ల రాష్ట్రానికి, నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉందని సూచించారు. తెలంగాణ ఆకాంక్షలు తెలిసిన వారే సిలబస్‌ను రూపొందించారని విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. విద్యార్థుల ఆవేదన తెలిసిన వారు కాబట్టే వీలైనంత వరకు ఎక్కువ మార్పులు లేకుండా సరైన విధంగా సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. మనం మార్చుకున్నట్లే ఏపీ కూడా.. పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాల్లో సిలబస్‌ను తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు మనం మార్చుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ కూడా సిలబస్‌ను మార్చుకుందని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో సిలబస్ మార్పు అనివార్యమన్నారు. ఇటీవల ఏపీ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సిలబస్‌ను తొలగిస్తున్నారన్న అంశంపై విమర్శల నేపథ్యంలో హరగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
మానవీయ విలువలు పెంపొందాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రస్తుతం సమాజంలో కుటుంబవ్యవస్థ, మనుషుల వి లువలు తగ్గిపోయాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తంచేశారు. మానవీ య విలువలు పెంపొందాలని ఆకాం క్షించారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఆదర్శ డిగ్రీ కళాశాలలో ‘జిల్లా ఎస్బీహెచ్ పాల మూరు మిత్రుల’ ఆత్మీయసమ్మేళనం ని ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మానవత విలువలు మరుగునపడి వస్తువుల విలువుల వ్యామోహం పెరిగిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్బీ హెచ్ మిత్రుల సమావేశం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎస్బీ హెచ్ రాష్ట్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షు డు శ్యాంసుందర్ మాట్లాడుతూ.. బ్యాం కులు ఈ రోజులు పటిష్టంగా ఉండి సా మాన్యులకు సేవలందిస్తున్నాయంటే బ్యాంకుల యూనియన్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అనంతరం ఎస్బీహెచ్ పాలమూరు మిత్రుల లోగోతోపాటు టెలిఫోర్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ వనమా ల, రిటైర్డ్ ఎస్బీహెచ్ అధికారులు కేవీ అశోక్, వి.నర్సింహ్మరావు, గజ్జెలయ్య, రంగయ్య, సుభాష్ పాల్గొన్నారు. పాతపల్లి దళితులకు అండగా ఉందాం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పెబ్బేర్ మండలం పాతపల్లి గ్రామ దళితులకు అండగా నిలుద్దామని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితులపై దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. దళితులకు జీవించే హక్కు కల్పించాలని కోరారు. అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇక్కడి దళితులపై 20సార్లు దాడులు జరిగాయని ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు దళితుల సమస్యను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి బోయలను దళితులకు వ్యతిరేంగా రెచ్చగొడుతున్నారన్నారు. రాజకీయాల నాయకుల క్రీడల్లో ప్రజలు బలికావద్దన్నారు. ఈనెల 6వ తేదీ చలో పాతపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్న పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ఆనంద్తేల్తుంబ్డే హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం చలో పాతపల్లి పోస్టర్‌ను విడుదల చేశారు. అందుకు నిరసనంగా ఈనెల 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి, చంద్రశేఖర్, యేసేపు, వామన్‌కుమార్, పూజారి పాల్గొన్నారు. -
ఐధైర్య పడొద్దు...అండగా ఉంటాం
పాతపల్లి దళితులకు ప్రొఫెసర్ హరగోపాల్ అభయం పాతపల్లి(పెబ్బేరు): పాతపల్లి దళితులు అధైర్యపడొద్దని, వారికి అండగా ఉంటామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మండల పరిధిలోని పాతపల్లి గ్రామాన్ని శుక్రవారం ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ, జిల్లా కార్యదర్శి రవికుమార్, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవచారీలు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక దళితులు తమకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు. గ్రామంలోని ఆలయంలో దళితులు ప్రవేశం చేయడంతో కుల వివక్ష ప్రారంభమైందన్నారు. బోయకులస్తులకు వనపర్తి ఆర్డీఓ, డీఎస్పీలు అండగా ఉండి దళితుల పట్టా భూముల్లో గుడిసెలను తొలగించి మృతదేహాలను ఖననం చేయించారని వారు చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు ఇతర నాయకులు వివాదాస్పదంగా మారిన భూములను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొనసాగుతున్న రిలేనిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సమగ్ర న్యాయవిచారణ చేయాలి ఘటనపై ప్రభుత్వం సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవచారీలు డిమాండ్ చేశారు.పెబ్బేరులో వారు విలేకరులతో మాట్లాడారు. పాతపల్లిలో వాల్మీకి యువజన సంఘం తమకు వినతి పత్రం ఇచ్చారని, గ్రామంలో కులవివక్ష లేదని అందులో పేర్కొన్నారన్నారు. దళితుల గుడిసెలు తొలగించలేదని, సాంఘిక బహిష్కరణ చేయలేదని పేర్కొన్నారన్నారు. ఈ విషయాన్ని దళితులు ధృవీకరించాలన్నారు. వివక్ష లేకపోతే బోయకులస్తులే దళితులను ఆలయ ప్రవేశం చేయించాలన్నారు. వారి భూముల్లో ఖననం చేసిన మృతదేహాలను వెలికి తీయాలన్నారు. దళితులపై దాడి చేసిన బోయ కులస్తులతో పాటు, పూజారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. టీవీవీ జిల్లా కార్యదర్శి వై.బాల్‌రాం, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యోసేపు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో ఉన్నత విద్య
ప్రొఫెసర్ హరగోపాల్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం : రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. 17 విశ్వ విద్యాలయాలకు వీసీలు, సిబ్బంది లేరని, ప్రభుత్వ కళాశాలలకు ప్రిన్సిపాళ్లు లేక అస్తవ్యస్తంగా మారాయన్నారు. యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారుతోందన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ‘డబ్ల్యూటీవో నుంచి ఉన్నత విద్యారంగం వైదొలగాలి’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విశ్వవిద్యాలయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2005 నుంచి డబ్ల్యూటీవోలో సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి విశ్వవిద్యాలయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 17 ఏళ్లుగా దేశంలో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకుల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రొఫెసర్ చక్రధర్‌రావు మాట్లాడుతూ.. డబ్ల్యూటీవో ప్రపంచ బ్యాంకు కంటే ప్రమాదకరమైనదని తెలిపారు. డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు ఏకం కావాలని సూచించారు. డబ్ల్యూటీవో నుంచి ఉన్నత విద్యా రంగం వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9నఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడలు ఎ.నర్సింహారెడ్డి, కె. రవిచందర్, ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, రామకృష్ణ, కొండల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'అప్రజాస్వామిక విధానాలలో చంద్రబాబు దిట్ట'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అప్రజాస్వామిక విధానాలు అవలంభించడంలో చంద్రబాబు దిట్ట అని హరగోపాల్ మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో ప్రజలు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. -
'అంగన్వాడీలను ప్రాథమిక స్కూళ్లలో కలపాలి'
హైదరాబాద్: ప్రొ. హరగోపాల్ నేతృత్వంలో విద్యా పరిరక్షణ కమిటీ సోమవారం తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసింది. ఈ సందర్భంగా రేషనలైజేషన్ విషయమై కడియంతో విద్యా పరిరక్షణ కమిటీ చర్చించింది. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు మూసివేయడం సరికాదని పేర్కొంది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆపాలని డిమాండ్ చేసింది. అంగన్వాడీలను ప్రాథమిక స్కూళ్లలో కలపాలని ప్రొ. హరగోపాల్ కోరారు. రేషనలైజేషన్‌కు వ్యతిరేకంగా ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేయనున్నట్టు ప్రొ. హరగోపాల్ చెప్పారు. -
విద్యావ్యవస్థలో మార్పు వస్తేనే అభివృద్ధి
కేజీ టు పీజీ వరకు కామన్ విద్యావిధానం అమలు చేయాలి అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి ప్రొఫెసర్ హరగోపాల్ సిద్దిపేట అర్బన్ : ప్రస్తుత విద్యా వ్యవస్థ మారితేనే దేశం బాగుపడుతుందని, కేజీ టూ పీజీ వరకు కామన్ స్కూల్ విధానం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం అందజేయాలని అఖిల భారత విద్యా పోరాట యాత్ర ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో హరగోపాల్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అన్ని వర్గాల విద్యార్థులకు అందిస్తేనే పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మానవీయ తెలంగాణను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు మనుషుల్ని నిర్మించే కేంద్రాలుగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజా ఉద్యమాలు, పోరాటాలు లేకుండా అవి జరగవన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో మొత్తం ప్రణాళికలను, పాఠ్యాంశాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. విద్య యొక్క ప్రధాన లక్ష్యం కుల, మతాలకు అతీతంగా సామాజిక స్పృహ కలిగిన పౌరులను, మేధావులను సృష్టించే విధంగా ఉండాలన్నారు. పిల్లలకు పోషకాహారం, నాలుగు జతల బట్టలు, బూట్లు సమకూర్చి వారికి విద్యను బోధిస్తేనే అర్థమవుతుందని తెలిపారు. అన్ని మతాలను గౌరవించే సమాన, సమాంతర విద్యను అన్ని వర్గాలకు అందించాలని, విద్యలో మత రాజకీయాలను చొప్పించరాదన్నారు. ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా పరిరక్షణ కమిటీ ఏర్పడి విద్యా పోరాట యాత్రను దేశ వ్యాప్తగా నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ర్టంలోని పది జిల్లాల్లో కూడా ఈ యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. విద్య పరిరక్షణ కోసం సుదీర్ఘంగా వివరించిన వినతిపత్రాన్ని విద్యా మంత్రి కడియం శ్రీహరికి త్వరలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి సభ్యులు డాక్టర్ పాపయ్య, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు పొన్నమల రాములు, రాజారెడ్డి, గోపాల్‌రెడ్డి, డీటీఎఫ్ నాయకులు శ్రీనివాస్, రాజిరెడ్డి, నర్సింలు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపల్లి యాదగిరి, నాయకులు శ్రావణ్, సతీష్, పీవైఎల్ నాయకులు జాన్‌రాజ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు బెజ్జంకి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
'అప్పీళ్లను వేగంగా విచారించాలి'
- హైకోర్టులో ప్రొఫెసర్ హరగోపాల్ పిల్ హైదరాబాద్: ఇరు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ పలువురు ఖైదీలు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసుకున్నారని, అవి ఏళ్ల తరబడి విచారణకు నోచుకోకపోవడంతో వారు జైళ్లలోనే మగ్గా ల్సి వస్తోందని పౌర హక్కుల నేత, ఫ్రొఫెసర్ జి.హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అప్పీళ్ల సత్వర విచారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఆయన దాఖలు చేశారు. ఇందులో హైకోర్టు రిజిష్ట్రార్ జ్యుడీషియల్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల జైళ్ల శాఖల డీజీపీ, చర్లపల్లి కేంద్ర కారాగార సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2008 నుంచి 2014 వరకు 379 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. వేగవంతమైన విచారణ రాజ్యాంగం ప్రసాదించిన హక్కని, ఈ విషయాన్ని సుప్రీం కోర్టు సైతం అనేక సందర్భాల్లో పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని తెలిపారు. జీవిత ఖైదు పడిన ఖైదీలు దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం హైకోర్టులో ఆనవాయితీగా వస్తోందన్నారు. అప్పీళ్ల విచారణలో అసాధారణ జాప్యం జరిగినప్పుడు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవని, దీనివల్ల జీవిత ఖైదీల హక్కులకు భంగం వాటిల్లుతోందని వివరించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, జీవితఖైదు పడినవారు దాఖలు చేసుకున్న అప్పీళ్లను సత్వరమే విచారించేందుకు చర్యలు తీసుకునేలా ప్రతివాదులను ఆదేశించాలని హరగోపాల్ హైకోర్టును కోరారు. అప్పటివరకు జీవితఖైదు పడి, రెండేళ్ల జైలుశిక్ష పూర్తి చేసుకున్నవారికి బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకొచ్చే అవకాశాలున్నాయి. -
సంపూర్ణ తెలంగాణ కోసం పోరాటం
తెలంగాణ విద్యావంతుల వేదిక ముగింపు మహాసభలో ప్రొఫెసర్ కోదండరాం పౌర సమాజ పాత్ర కీలకం: ప్రొఫెసర్ హరగోపాల్ కొత్త కార్యవర్గం, ఏడుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ‘పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా ఉం డాలి. ఇలా ఉండడానికి ఉమ్మడి వ్యవస్థను విభజన చేయాలి. ఉమ్మడి రాజధాని, హైకోర్టు, కార్పొరేషన్ల విభజన జరగాలి. ఇలా.. సంపూర్ణ తెలంగాణ కోసం పోరాటం చేద్దాం..’ అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. చివరిరోజైన ఆదివారం ప్రతినిధులసభ జరిగింది. అనంతరం విలేకరులతో మాట్లాడిన కోదండరాం టీవీవీ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. తెలంగాణలో అభివృద్ధి ఫలాలు అంద రికీ అందాలని, ఆ దిశగా పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక సంక్షేమ విధానాలు ఉండాలని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక రం గాల్లో తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాల్లో వాటా దక్కేలా, అన్ని వర్గాల ప్రజలకు గౌరవప్రదమైన జీవితం దక్కేలా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా పోరాటం చేస్తామని కోదండరాం వివరించారు. టీవీవీ మహాసభల్లో ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ప్రసంగించారు. ప్రతినిధుల ద్వారా అందిన సమాచారం మేరకు ‘పౌరసమాజ పాత్ర ఎంతో కీలకం. ఎక్కడైనా స్వేచ్ఛగా మాట్లాడుకునే వీలుండాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి..’ అని ఆయన పరోక్షంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రజల గొం తుకగా ఉండాలని ఆయన అభిలషించారు. ‘మేము అకడమిషన్స్.. చరిత్ర చెప్పే అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేస్తాం. అంతేకానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వంతో సంబంధం ఉందని అనుకోవద్దు..’ అని హరగోపాల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ కూడా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. పదహారు అంశాలపై తీర్మానాలు టీవీవీ మహాసభల్లో పదహారు అంశాలపై తీర్మానాలు చేశారు. తెలంగాణలోని ప్రైవేటు పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, రైతుల ఆత్మహత్యల నివారణకు నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సినీ పరిశ్రమకు రాచకొండ, ఇతర చారిత్రక ప్రదేశాల్లో భూముల కేటాయింపుపై పునరాలోచించాలని, మానవ, పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఫార్మాసిటీల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల మధ్యా ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, సీమాంధ్రలో విలీనం చేసిన ముంపు మండలాలను.. ఆ ప్రాంత ఆదివాసీల అభీష్టం మేరకు తెలంగాణలో ఉండేలా విభజన బిల్లును సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి పేరుతో హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరింది. మిషన్ కాకతీయకు వేదిక సంపూర్ణ మద్దతు తెలిపింది. ఏడుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు టీవీవీ అధ్యక్షుడిగా పనిచేసిన మల్లేపల్లి లక్ష్మయ్య ఈసారి పక్కకు తప్పుకున్నారు. కానీ, టీవీవీ విధాన నిర్ణయాలు ఖరారు చేసేందుకు, రోజువారీ కార్యక్రమాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి ఆయన కన్వీనర్‌గా పనిచేయనున్నారు. కన్వీనర్ సహా ఏడుగురితో ఏర్పాటైన స్టీరింగ్ కమిటీలో ప్రొఫెసర్ కోదండరాం, ప్రస్తుత అధ్యక్షుడు రవీందర్రావు, ధర్మార్జున్, స్వర్ణలత, టి.యాదయ్య, ఆర్.విజయ్‌కుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. కాగా, 26 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా.. ఇందులో 15 మంది సభ్యులుగా ఉన్నారు. -
పోలవరంతో తెలంగాణకు ప్రమాదం
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్‌ను ఆపకుంటే తెలంగాణ పునర్ నిర్మాణానికి అర్థం ఉండదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ హక్కుల వేదిక, తెలంగాణ పరిరక్షణ వేదికల ఆధ్వర్యంలో ‘పోలవరం భద్రాచలానికే కాదు తెలంగాణకూ ప్రమాదమే’ అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ... ఆదివాసీల హక్కులను పాలకులు విస్మరిస్తున్నారని విమర్శించారు. వారి అస్తిత్వాన్ని కాపాడటానికి పోలవరం ప్రాజెక్ట్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యమ శక్తులు ఆదివాసీల పక్షాన నిలబడి పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ విద్యార్థి రచయితల వేదిక నాయకులు మైపతి మాట్లాడుతూ... గ్రామసభ అనుమతి లేనప్పుడు ప్రాజెక్ట్‌ను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవటానికి కనీస ప్రయత్నం చేయలేదన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్ కుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు ఆత్రం, విద్యావ ంతుల వేదిక నాయకులు శ్రీధర్‌దేశ్‌పాండే, గిరిజన సంఘం నాయకులు వీరయ్య పాల్గొన్నారు. -
అభివృద్ధిని నిర్దేశించేది రాజకీయ నిర్ణయాలే
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజకీయ నిర్ణయాలే ఆర్థిక ప్రగతిని నిర్దేశిస్తాయుని, అవి సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ‘ప్రజల కోసం-స్వావలంబన కోసం-తెలంగాణ ప్రగతి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ 1990 నుంచి ఏపీలో రాజకీయాలపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం ప్రారంభమైందని, క్రమంగా ప్రకృతి వనరులైన భూమి, నీరు, ఇసుక, బొగ్గు, వ్యవసాయం వారి ఆధిపత్యంలోకి వెళ్లడంతో చిన్న చిన్న వృత్తులు దెబ్బతిన్నాయన్నారు. అధికారం కొద్దిమంది చేతుల్లో ఉండాలా? లేక ప్రజలందరికీ దక్కాలా? అనేది వలిక సమస్యగా మారిందన్నారు. తెలంగాణ తలకిందులుగా జరుగుతున్న అభివృద్ధిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అభివృద్ధిలో వాటా దక్కాలంటే కచ్చితమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. మార్కెట్లో ఆటుపోటులను తట్టుకునే శక్తి రైతులకు రావాలని, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అమెరికాలోని నైబర్‌హుడ్ స్కూల్ పద్ధతిలోనే తెలంగాణలో కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డెరైక్టర్ డాక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ గత పదేళ్లలో 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిందని, 10 శాతం మంది రైతులు వ్యవసాయ కూలీలుగా మారారని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ సత్యప్రసాద్, టి.రమేష్, ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్.వేణుగోపాల్ ప్రసంగించారు. -
పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతినిధి మోడీ: హరగోపాల్
గోదావరిఖని: దేశంలో పెట్టుబడీదారీ వ్యవస్థకు ప్రతినిధిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బయలుదేరారని, ఆయన ప్రధానమంత్రి అయితే శ్రామికవర్గానికి మరిన్ని ఇబ్బందులు తప్పవని ప్రముఖ వక్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం గురువారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ..దేశంలో కార్మికవర్గం ఏకమవకుండా ఉండడానికి సంఘటిత, అసంఘటిత, కాంట్రాక్టు, క్యాజువల్, అవుట్ సోర్సింగ్ తదితర రూపాల్లో కార్మిక రంగ వ్యవస్థను సృష్టించారని అన్నారు. ఈ క్రమంలో కొన్ని వర్గాల కార్మికులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తూ ఉద్యమాలకు దూరం చేశారని, మరోవైపు ఈ కొద్దిమంది కార్మికుల కోసం 80 శాతంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు తక్కువ వేతనాలను చెల్లిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని వివరించారు. దేశంలో ఉన్న సహజ వనరులపై పెట్టుబడిదారుల కన్ను పడిందని, నేడు వాటిని విక్రయించే స్థాయికి ఆ వ్యవస్థ చేరుకుందని, ఇది ఎంతో నష్టదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఏడాదికొకసారి పెంచే ధరలను ఇప్పడు నెలకొకసారి పెంచే స్థాయికి పెట్టుబడిదారీ సంస్థలు చేరుకున్నాయన్నారు. ప్రకృతి విధ్వంసం వల్ల రాబోయే రోజుల్లో మానవ మనుగడ కష్టతరమవుతుందని, అందువల్ల సహజ వనరులను కాపాడుకునేందుకు శ్రామికులే పోరాటం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలు పోరాడి సాధించుకున్నప్పటికీ పునర్నిర్మాణంలో కార్మికులు, శ్రామికుల పాత్ర కీలకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.