ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా?
♦ సీఎం ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు: ప్రొఫెసర్ హరగోపాల్
♦ ప్రజలతో మాట్లాడే ప్రభుత్వం వస్తుందనుకున్నాం
♦ పోరాడింది ఇలాంటి తెలంగాణ కోసం కాదు
♦ టీఆర్‌ఎస్ పోరాటం వల్లే రాష్ట్రం రాలేదు
♦ కొత్త రాష్ట్ర ప్రగతి దిశ, దశ సరిగాలేదు
♦ ఆర్టీసీ కార్మికులను విస్మరించొద్దు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ వస్తే ప్రజలతో మాట్లాడే ప్రభుత్వం వస్తుందని, మానవీయ పాలన, స్పందించే పాలన ఉంటుందని అంతా ఆశించాం. కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరికీ కలవటానికి అవకాశం ఇవ్వటం లేదు. కోదండరాం సార్ అదే అంటున్నారు. నేనూ అదే అంటున్నా.. నిన్న ఎస్సీ,ఎస్టీ హక్కుల సంఘం వాళ్లూ అదే అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులూ అదే చెప్తున్నారు.. సమస్యలు చెప్పుకుని పరిష్కరించమని అడగాలంటే మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం’’ అంటూ పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రజలు పోరాడి తెచ్చుకున్నది ఇలాంటి తెలంగాణ కోసం కాదని విమర్శిం చారు. ఆర్టీసీలోని పలు సంఘాల జేఏసీ బుధవారం హైదరాబాద్‌లో ‘ఆర్టీసీలో నష్టాలు- మేధావుల అభిప్రాయం’ పేరుతో జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును విమర్శించారు.
నిర్ణయాల్లో మార్పు రావాలి
సీఎం ఎవరికీ అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారని, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని హరగోపాల్ పరోక్షంగా విమర్శించారు. ‘‘ఒక్క టీఆర్‌ఎస్ పోరాటం వల్లనో, ఏ వ్యక్తి వల్లనో తెలంగాణ రాలేదు. ఆ పోరాటం లో అంతా భాగస్వామ్యమయ్యాం. ఆర్టీసీ కార్మికుల పాత్రా ఉంది. అంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అడిగే హక్కు, మాట్లాడే హక్కు అందరికీ ఉంది. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రగతి దిశ, దశ సరిగా లేదనే అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష దిశగా పోతున్నట్టు లేదు. ప్రభుత్వ ఆలోచన విధానంలో, విధాన నిర్ణయాల్లో మౌలిక మార్పులు రావాల్సి ఉంది’’ అని అన్నా రు. ‘‘ఇప్పటికే రెండేళ్లు గడిచింది. మరో మూడేళ్లుంది.
ప్రజల ఆకాం క్షకు తగ్గట్టుగా పాలన ఉంటే మళ్లీ వాళ్లే గెలుస్తారు, అప్పుడు ట్యాంక్‌బండ్ చుట్టూ వారి విగ్రహాలు పెట్టుకోవచ్చు. లేదంటే.. ఉన్న విగ్రహాలు తీసి పారేయటం కూడా ఈ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోరు. నష్టం జరగకముందే ప్రభుత్వం స్పందిస్తే మంచిది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా రోజూ ఉదయం గంటసేపు అందరినీ కలిసే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఉద్యమాన్ని సృష్టించినవాళ్లు ఇంకా ఎలా ఉండాలని ప్రశ్నించారు. ఆర్టీసీలో లాభాలను వెతకడం మంచిది కాదని సూచించారు. ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు సంస్థలకు సంపద దోచిపెట్టి, ఆ తర్వాత డబ్బులతో ఎన్నికల్లో గెలవచ్చనే ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు.
లాభాలతో ముడిపెట్టడం సరికాదు
ఆర్టీసీని లాభాలతో ముడిపెట్టి చూడడం మంచిది కాదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. రిటైర్ అయిన వ్యక్తులను ఎండీ, విజిలెన్స్ డైరక్టర్‌గా పెడితే ఆర్టీసీ బలోపేతం కోసం వారేం కృషి చేస్తారని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం ప్రశ్నించారు. కళ్లలో కారం చల్లి కర్రలతో దాడి చేయించిన నేతను రవాణా మంత్రిగా పెడితే ఆర్టీసీ ఎలా బాగుపడుతుందని పిట్టల రవీందర్ అన్నారు. పరిపాలనకు సిద్ధపడే వారు ముందుగా రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సి ఉందని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు.
బకాయిలు వెంటనే ఇవ్వాలి: కోదండరాం
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతోనే కార్మికులు ఉద్యమంలో చురుగ్గా వ్యవహ రించారన్న విషయాన్ని విస్మరించొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా కార్పొరేట్ పెత్తనం వల్ల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడ్డాయని, తెలంగాణ వచ్చినందున ఆ పెత్తనం కూల్చే దిశగా ప్రయత్నం జరగాలన్నారు. ప్రజా రవాణా ఆవశ్యకత విషయంలో ప్రభుత్వ కార్యాచరణ ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలన్నారు.
తప్పయితే మైక్ ముట్టను: నాగేశ్వర్
ఆంధ్రా ప్రైవేటు రవాణా సంస్థలను నియంత్రిస్తే ఆర్టీసీకి రూ.వేయి కోట్ల ఆదాయం పెరుగుతుందని, నష్టాలొచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరిగి, లాభాలొచ్చే రూట్లలో అద్దె బస్సులు తిరిగే విధానం మారాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పేర్కొన్నారు. బినామీ పేర్లతో అధికారులు, ఎమ్మెల్యేలే అద్దె బస్సులను ఆర్టీసీకి ఇస్తున్నారని ఆరోపించారు. వస్తువుల కొనుగోళ్లలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని, ఆర్టీసీకి సొంత డీజిల్ బంకులు సమకూరిస్తే ఆదాయం వస్తుందన్నారు. తన సూచనల్లో ఒక్కటి తప్పని నిరూపించినా భవిష్యత్తులో మళ్లీ మైక్ ముట్టనని సవాల్ విసిరారు.