
పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతినిధి మోడీ: హరగోపాల్
గోదావరిఖని: దేశంలో పెట్టుబడీదారీ వ్యవస్థకు ప్రతినిధిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బయలుదేరారని, ఆయన ప్రధానమంత్రి అయితే శ్రామికవర్గానికి మరిన్ని ఇబ్బందులు తప్పవని ప్రముఖ వక్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం గురువారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ..దేశంలో కార్మికవర్గం ఏకమవకుండా ఉండడానికి సంఘటిత, అసంఘటిత, కాంట్రాక్టు, క్యాజువల్, అవుట్ సోర్సింగ్ తదితర రూపాల్లో కార్మిక రంగ వ్యవస్థను సృష్టించారని అన్నారు.
ఈ క్రమంలో కొన్ని వర్గాల కార్మికులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తూ ఉద్యమాలకు దూరం చేశారని, మరోవైపు ఈ కొద్దిమంది కార్మికుల కోసం 80 శాతంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు తక్కువ వేతనాలను చెల్లిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని వివరించారు. దేశంలో ఉన్న సహజ వనరులపై పెట్టుబడిదారుల కన్ను పడిందని, నేడు వాటిని విక్రయించే స్థాయికి ఆ వ్యవస్థ చేరుకుందని, ఇది ఎంతో నష్టదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో ఏడాదికొకసారి పెంచే ధరలను ఇప్పడు నెలకొకసారి పెంచే స్థాయికి పెట్టుబడిదారీ సంస్థలు చేరుకున్నాయన్నారు. ప్రకృతి విధ్వంసం వల్ల రాబోయే రోజుల్లో మానవ మనుగడ కష్టతరమవుతుందని, అందువల్ల సహజ వనరులను కాపాడుకునేందుకు శ్రామికులే పోరాటం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలు పోరాడి సాధించుకున్నప్పటికీ పునర్నిర్మాణంలో కార్మికులు, శ్రామికుల పాత్ర కీలకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.