capitalism
-
పెరిగిపోతున్న శ్రమ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉండటంతో కార్మికవర్గం శ్రమ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నదని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (డబ్ల్యూఎఫ్‌టీయూ) గౌరవాధ్యక్షుడు జార్జియోస్ మావ్రికోస్ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ప్రపంచ ట్రేడ్ యూనియన్స్ ఉద్యమ చరిత్ర– ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు’ అనే అంశంపై సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూటీయూసీ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వర్గం టెక్నాలజీ పేరుతో యువతరాన్ని దోపిడీ చేస్తోందని విమర్శించారు. ఈ దోపిడీపై కార్మికవర్గాన్ని చైతన్యపర్చాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపైనే ఉందని అన్నారు. పోరాటంతోనే హక్కుల సాధనదక్షిణ కొరియాలో కార్మికవర్గం ఐక్యంగా పోరాడి గొప్ప విజయాలు సాధించిందని మావ్రికోస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వలస కార్మికుల సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నిరుద్యోగం పెరగడంతో తక్కువ జీతాలతో కార్మికులు సామాజిక భద్రతను కోల్పోతున్నారని తెలిపారు. పోరాటం చేయకుండా ఏదీ సాధించలేమన్న విషయాన్ని కార్మికవర్గానికి అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.కార్మికవర్గ పోరాటాల చరిత్రను తెలుసుకోవడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి, బహుళజాతి సంస్థలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని అభిప్రాయపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసినట్టు కనిపిస్తుందని, కానీ పాలస్తీనా వైపు నుంచి చరిత్రను అధ్యయనం చేస్తే ఆ దృష్టికోణం వేరుగా ఉంటుందని తెలిపారు. సామ్రాజ్యవాదం తనకు అనుకూలమైన వాదనను మాత్రమే యువతరానికి, ప్రపంచానికి పరిచయం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూటీయూసీ, ఏఐబీఈఏ నేతలు చుక్క రాములు, మహ్మద్ యూసుఫ్, పాలడుగు భాస్కర్, బాలరాజ్, రాజేంద్ర, బీఎస్ రాంబాబు, సీహెచ్ నర్సింగరావు, డబ్ల్యూఎన్టీయూ నేతలు స్వదేశ్ దేవాయ్, ఆర్కోచొంతియా అనస్థాసాకి పాల్గొన్నారు. -
సంఘీభావమే పరాయీకరణకు మందు
మనిషి క్రమంగా మనిషితనానికి దూరమై మాయమవుతున్నాడు. ఆధునిక పెట్టుబడిదారీ ఉత్పాదక వ్యవస్థలో అతడు ఒక మహాయంత్రంలో చిన్న ‘మర’ లాంటి పాత్రను పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సృజనాత్మకతను కోల్పోయి వస్తూత్పత్తి యంత్రంగా మిగిలిపోతున్నాడు. తాను తయారుచేసే వస్తువు పట్ల సంతృప్తి పొందలేకపోతున్నాడు. ఇలా మొత్తంగా పరాయీకరణకు గురై... మనిషి సొంత గుర్తింపు రద్దు అవుతున్న స్థితిలో, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవసరం ఉన్నా లేకున్నా... వస్తువులను కొంటూ పోతున్నాడు. ఈ వస్తు వినిమయంలోనే ఆనందాన్ని వెదుక్కొంటున్నాడు. తద్వారా వస్తువులే మానవ సంబంధాలను నిర్ణయించే స్థితి ఏర్పడుతోంది. అందుకే సముదాయాల నడుమ అర్థవంతమైన సంఘీభావాన్ని నిర్మించడమే ఇప్పుడు కావలసింది. పెట్టుబడిదారీ విధానాన్ని సునిశిత విమర్శకు గురి చేసే కార్ల్‌మార్క్స్ నేటికీ తన ప్రాసంగికత కోల్పోలేదు. పెట్టుబడిదారీ విధానంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, అలాగే వేతన శ్రామికుని పరాయీ కరణ జరిగే విధానాన్నీ మార్క్స్ పేర్కొన్నాడు. తన తొలి రచనలలో– మనిషి తన పట్ల, తన చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల ఎరుక ఉన్న జీవిగా (స్పీసీస్–బీయింగ్) ఒక రకమైన పరాయీకరణకు గురవ్వడాన్ని ప్రస్తావించాడు. తరువాతి కాలపు రచనలలో ఆయన ఎక్కువగా ఈ పరాయీకరణకు కారణమైన వ్యవస్థీకృత సాంకేతిక అంశాల మీద చూపు నిలిపాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతిలో శ్రామికులు సాధా రణంగా తాము చేసే వస్తు ఉత్పత్తితో ముడి పడి ఉండే సంతృప్తినీ, ఉత్పత్తి అయిన వస్తువుతో తమకు జోడై ఉండే గుర్తింపునూ ఎట్లా కోల్పోతారో వివరించే యత్నం చేశాడు. శ్రమ విభజన ప్రధానంగా ఉండే పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతిలో ఉత్పత్తి సామర్థ్యానికి ఇచ్చే ప్రాధాన్యం వల్ల శ్రామికులు వస్తూత్పత్తిలోని ఏదో ఒక అంశానికే పరిమితమై ఆ పనిని మాత్రమే గానుగెద్దులా చేసే యంత్రంలా మారి పోతారనీ, ఈ క్రమంలో తమ సాధారణ మానవ సున్నితత్వాలనూ, ఉత్పత్తితో ఉండే గుర్తింపునూ కోల్పోతారనీ మార్క్స్ వివరిస్తాడు. ఈ రకమైన పరాయీకరణ వలన శ్రామికులకు తాముచేస్తున్న పనులతో మమేకత్వం ఉండదు. ఈ అంశాన్నే సమకాలిక మానవ శాస్త్రవేత్త డేవిడ్ గ్రాబార్, పెట్టుబడిదారీ యుగంలో ‘పనికిమాలిన ఉద్యోగాలు’ (బుల్షిట్ జాబ్స్) ఉన్నాయని ప్రతిపాదించాడు. పనికి మాలిన నౌకరీ అంటే ఏమిటో వివరిస్తూ గ్రాబార్ – అవి వేతన శ్రామి కులకు ఏమాత్రం తృప్తిని ఇవ్వనివీ, అర్థరహితమైనవీ అంటాడు. ఇంకా చెప్పాలంటే శ్రామికులు చేస్తున్న పనులు వారి సొంత విలువను ఏ తీరులోనూ పెంచేవి కావనీ అంటాడు. అర్థరహితం, విలువలేని పనులు రాను రానూ అనేక రంగాలలోకి విస్తరిస్తున్నాయనిపిస్తుంది. పెచ్చుపెరిగిపోతున్న ఆటోమేషన్, కృత్రిమ మేధకు లభిస్తున్న ప్రాధాన్యం చూస్తే రాబోయే కాలంలో ఈ పరిస్థితి తీవ్రం అయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ స్థితి తీవ్ర మానవ అసంతృప్తికి కారణం అవుతోంది. చేసిన పని నుండి మనం పొందే తృప్తి ఎందుకు మనకు అంద కుండా పోతుంది? మనం ఒక మహా ప్రక్రియ (యంత్రం)లో ప్రాధా న్యంలేని చిన్న పని చేసే ‘మర’ స్థాయికి కుదించబడటమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఉత్పత్తి ప్రక్రియలో ఒక సహజమైన ఉత్సాహ శక్తి ఉబికి రావడం మరుగున పడిపోయి... వాటి స్థానంలో ఆర్థిక, గణిత, అల్గారిథమ్స్లకు ప్రాధాన్యం వచ్చింది. చరిత్రకారుడు యువల్ నోవా హారారీ ఇరవై ఒకటవ శతాబ్దిలో అత్యంత ప్రధానమైన పదం కంప్యూటర్ ఆధార గణన లేక ‘అల్గారిథమ్స్’ అంటాడు. ఈ మారిన పని పరిస్థితులను జాగ్రత్తగా గమనించిన అభివృద్ధి అర్థ శాస్త్రవేత్త గై స్టాండింగ్... ‘ప్రికారియట్’(అసురక్షిత లేక అస్థిర కార్మి కులు) తప్పని పరిస్థితులు అన్న భావన తీసుకువచ్చారు. ఈ భావన ప్రకారం పర్మనెంటు నౌకరీలు తగ్గిపోతూ... కాసింత ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యం, ఆరోగ్య రక్షణ వంటివి పూర్తిగా కనుమరుగైపోయి స్వల్పకాల కాంట్రాక్టులు, తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఈ రకమైన నూతన శ్రామికులను ‘ప్రికారియట్’ అంటున్నాడాయన. సమకాలిక పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలో కొత్త పని ప్రపంచాలు వీరితో నిండిపోతున్నాయని అంటున్నాడు. మన కాలంలో పని... అర్థరాహిత్యానికీ, అభద్రతకూ ఏకకాలంలో దారితీస్తోంది. గై స్టాండింగ్, మార్టిన్ గ్రాబర్ వంటి సామాజిక పరిశీలకులు ఈ రకమైన పనికిమాలిన పనులకు, దారుణమైన అభద్రత గల పని పరిస్థితులకు సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్) ఒక పరిష్కారంగా చూస్తున్నారు. అయితే పని లేదా శ్రమ లక్ష్యం కేవలం ఆదాయ సంపాదన మాత్రమే కాదు. అది పని చేస్తున్న వారికి ఆత్మతృప్తినీ, పరిపూర్తి అనుభూతినీ ఇవ్వడం కూడా ప్రధానం అన్న అమర్త్య సేన్ చెప్పిన ఒక విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇట్లా మనిషి సొంత గుర్తింపు రద్దు అవుతున్న స్థితిలో, మనిషి కొనుగోలుదారుగా మారి... కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తన కప్పిపుచ్చుకునే కొనుగోలుదారీతనంతో భర్తీ చేసుకునే కంపెన్సేటరీ కన్సూ్యమరిజమ్లోకి మారిపోతున్నాడు. అలా మారి ‘తాము బాగున్నాం’ అనేదానికి గుర్తుగా వస్తువులు కొను క్కోవాలి అనే ‘కొనుగోలుదారీ’ అవస్థలోకి జారుకుంటున్నాడని ప్రముఖ మార్క్సిస్ట్ భూగోళ విజ్ఞాని డేవిడ్ హార్వే విశ్లేషిస్తున్నారు. ఇటువంటి కొనుగోలుదారీతనానికి నెట్‌ఫ్లిక్స్‌ను ఉదాహరణగా చూపుతున్నాడు. ఈ రకమైన వస్తువులు మీటనొక్కడం ద్వారా అనేక మంది ఒకేసారి వాడుకునే లక్షణం కలిగి ఉన్నవి. కళ్ళు జిగేల్మనే మాల్స్‌లో షాపింగ్ అనుభూతి ఒక కొత్త లోకంలోకి పోయిన అనుభూతిని ఇస్తుంది. ఆ విధంగా మానవ జీవితాలను వస్తువులు ఆక్రమించేస్తున్నాయి. మనుషులు తమ ఇంగితాల మీద, సున్నితత్వాల మీద నియంత్రణ కోల్పోతారని మార్క్స్ చాలాకాలం కిందనే ఊహిం చాడు. దాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వస్తువులే మానవ సంబంధాలను నిర్ణయించే స్థితి ఏర్పడుతుంది. వస్తువులకు ఉండే మారకపు విలువనే వస్తువు ఉపయోగ విలువను నిర్ణయిస్తుంది. ఈ స్థితినే ఆయన ‘వస్తు వ్యామోహ సంస్కృతి’ అన్నాడు. ఈ పరిస్థితే దుస్సహమైన పని పరిస్థితులను, పనికిమాలిన ఉద్యోగాలను పుట్టించి మనుషులలో తీవ్రమైన పరాయీకరణకు దారితీస్తుందనీ అన్నాడు. ఆ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ ఆధునిక పరాయీకరణ పరిస్థితులు కేవలం ఆర్థిక రంగానికి అంటే మార్కెట్‌కు మాత్రమే పరిమితమై ఉండవు. అవి సామాజిక, వ్యక్తిగత, రాజకీయ జీవితాలలోకి కూడా వ్యాపిస్తాయి. రాజ్య యంత్రమూ, దానికున్న సార్వభౌమాధికారమూ; అది నియంత్రించే ప్రాంతం మీదా, ప్రజల మీదా ఉండే అధికారం సందర్భంలోనూ ఈ పరాయీకరణ ప్రభావం కనిపిస్తుంది. ప్రజల నుండి పాలన పరాయీకరణకు గురి కావడం ఒక కీలక అంశం. పాలనాధికారం విపరీతంగా కేంద్రీకరించబడటం, పాలకులు తాము చాలా ప్రత్యేకం అనుకోవడం, సామాన్య ప్రజలను దూరం పెట్టడం ఈ పరాయీకరణ రూపాలే. ‘అరబ్ స్ప్రింగ్ ’ పోరాటాలూ, ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ పోరా టాలూ... పరాయీకరించబడిన సమూహాలు, జాతి రాజకీయ జీవ నంతో తిరిగి పెనవేసుకోవడానికి పడుతున్న ఆరాటానికి చిహ్నాలు! పాలనా యంత్రాంగం, ప్రతినిధులు... ప్రజారాశుల నుండి పూర్తిగా వేరుపడటం అనే పరాయీకరణ ప్రాతినిధ్య సంక్షోభానికి (క్రైసిస్ ఆఫ్ రిప్రెజెంటేషన్) దారి తీస్తున్నది. ప్రతినిధులను ప్రజలు నమ్మని స్థితి ఇది. ఒక రకంగా పైన పేర్కొన్న పోరాటాలు ఈ అవినీతికర స్థితికి వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శించే ఆగ్రహ వ్యక్తీకరణగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాతావరణంలో పరాయీకరణ వల్ల ప్రేరేపితం అయిన నిస్సార కొనుగోలుదారీతనానికీ, ప్రాతినిధ్య సంక్షోభం వల్ల పుట్టు కొస్తున్న, పరిమిత దృష్టి కలిగిన తమ వాటాకు మాత్రమే ప్రాధాన్య మిచ్చే ఉనికి రాజకీయ వాదులకూ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. తమ పరిధిని తీవ్రంగా పరిమితంగా ఉంచుకునే ఉనికి రాజకీయాలకూ, నిస్సార కొనుగోలుదారీ తత్వానికీ కారణం... మనిషి తన నుండీ, సముదాయం నుండీ పరాయీకరించ బడటమే. ఈ స్థితిలో ఊహాశక్తితో అనేక (పీడిత) సముదాయాల నడుమ నాణ్యమైన, అర్థవంతమైన సంఘీభావాన్ని నిర్మించే వైపు చేసే గట్టి ప్రయత్నాలు మాత్రమే... పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పోరును పదు నెక్కించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలవు. ప్రొ. అజయ్ గుడవర్తి వ్యాసకర్త ప్రొఫెసర్,జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ -
వాతావరణ సూచన : హర్షాభావం
అడవిలో నడుస్తున్న ఇద్దరు కొద్ది దూరంలో ఆకలిమీదున్న ఒక ఎలుగుబంటిని చూశారు. వెంటనే ఒకతను పారిపోవడానికి తయారైపోయాడు. రెండో అతను, ‘‘నువ్వెంత ప్రయత్నించినా ఎలుగుబంటి కంటే వేగంగా పరిగెత్తలేవు,’’ అన్నాడు. మొదటి వ్యక్తి అతన్ని చూసి–‘‘ఫర్లేదు, నీకంటే వేగంగా పరిగెత్తితే చాలు కదా!’’ అన్నాడు. ఆరేళ్ల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెక్యులేషన్ నవలతో సంచలనాన్ని సృష్టించిన అమెరికన్ రచయిత్రి జెన్నీ ఓఫిల్ తన తాజా నవల వెదర్లో ‘లేట్ కాపిటలిజం’ అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్నకి ఇచ్చిన చమత్కార సమాధానం అది. అలాగని ఈ నవల లేట్ కాపిటలిజమ్ గురించి కాదు. హాస్య వ్యంగ్యాలు కథనశైలిలో ఒక భాగమే తప్ప, ఇది పూర్తిగా అలాంటి తరహా నవలా కాదు. వీటన్నింటినీ దాటుకుని వాతావరణం, పర్యావరణం, మనిషి మనుగడల మీదుగా నవల విస్తృతి కొనసాగుతుంది. నవలలోని కథకురాలు లిజీ ఒక లైబ్రేరియన్. భర్త, కొడుకు, తమ్ముడి చుట్టూ ఆమె జీవితం అల్లుకుని ఉంటుంది. లిజీకి ఒకప్పటి ప్రొఫెసర్ అయిన సిల్వియా, వాతావరణంలో వస్తున్న పెనుమార్పుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తూంటుంది. సిల్వియాకి ఉన్న పని ఒత్తిళ్ల వల్ల ఆమెకొచ్చే రకరకాల మెయిల్స్ చూసి సమాధానాలు ఇవ్వటానికి లిజీని కుదుర్చుకుంటుంది. ఆ మెయిల్స్‌లోని వైవిధ్యం చూసి లిజీ ఆశ్చర్యపోతుంది. పర్యావరణానికి మనిషి కలిగిస్తున్న హాని, తద్వారా వచ్చే వాతావరణ మార్పులు రానున్న ఉపద్రవానికి సూచనలనీ, ఆ ప్రమాదం సుదూర భవిష్యత్తులో కాదనీ, అనుకున్న దానికంటే చాలా వేగంగా సమీపిస్తోందనీ ఎంతోమంది ఆందోళన చెందటం ఆ మెయిల్స్‌లో గమనిస్తుంది. ముంచుకొస్తున్న వినాశనాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయని అలసత్వాన్ని గుర్తిస్తుంది. రాబోయే తరాల భద్రత గురించి ఎలాంటి అనుమానాలూ లేని లిజీకి ఈ కొత్త ఎరుక ఉలికిపాటుని కలిగిస్తుంది. తన పిల్లవాడి గురించీ, తరువాతి తరాల గురించీ ఆలోచిస్తున్న లిజీతో ‘‘నువ్వు నీ పిల్లల్ని వీటన్నిటినుంచీ రక్షించగలననే అనుకుంటున్నావా?’’ అని ఆమె ఆలోచనా భారాన్ని మరింత పెంచుతుంది సిల్వియా. అందరిలానే జీవన వైరుధ్యాలని లిజీ కూడా ఎదుర్కొంటూనే ఉంటుంది. బొటాబొటి జీతం, తమ్ముడి బాధ్యత, ఆ బాధ్యత వల్ల సంసారంలో ఇబ్బందులూ, పిల్లవాడూ, చదువూ వంటి వైయక్తిక సమస్యలు ఎన్ని ఉన్నా, ఎన్నికల ఫలితాలూ, నిరంకుశ ధోరణులూ, పెరుగుతున్న అసమానతలూ, స్కూల్లో కాల్పులూ, అభద్రతలూ, అలుముకుంటున్న నిరాశ వంటి సామాజిక పరిస్థితులు భయం కలిగిస్తున్నా – వీటన్నిటి మధ్య కూడా పర్యావరణం పట్ల తన బాధ్యత గురించి ఆలోచించే లిజీ కథే ఈ నవల. రకరకాల విషయాల ప్రస్తావనలతో ప్రారంభంలో పాఠకుడికి పట్టు దొరకనివ్వని కథనం, పోనుపోను అల్లిక చిక్కనై అందులోకి లాగేస్తుంది. కథావిస్తరణలో ఏ నవలా సూత్రాలకీ కట్టుబడకుండా, తార్కికమైన మొదలూ తుదీ అంటూ లేకుండా సాగే కథ– లిజీ ఆలోచనల విస్ఫోటనాల చుట్టూ పాదరసంలా సంచలిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు కొంత హాస్యంతో, కొంత తాత్త్వికతతో కలగలిసి ఆమె మేధను తాకి విడిపోతుంటాయి. రోజువారీ జీవితపు పరుగులో మనిషి కొట్టుకుపోతూ, తన మనుగడనే ప్రశ్నార్థకం చేసే ముఖ్యమైన విషయాలను చూసీచూడనట్టు వదిలేయటం సరికాదన్నదే ఈ నవల ఇతివృత్తం. మేధోపరమైన చర్చలకే పరిమితమైపోతున్నవారు, మార్పుకోసం బరిలోకి దిగి అందరితో కలిసి నడవాలన్నది నవలాంతరంగం. పద్మప్రియ -
సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం
ముంబై: దేశం అభివృద్ధి చెందాలంటే వ్యాపార విధానాలను మరింత సులభతరం చేయాలని ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ తెలిపారు. శనివారం ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ ఆశిస్తున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవ్వాలంటే సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రో క్రోనీ క్యాపిటలిజం ద్వారా కేవలం వ్యాపార వర్గాల వారికి, అధికారంలో ఉన్నవారికే లబ్ది చేకూరుతుందన్నారు. దేశంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రో బిజినెస్ పాలసీలు తోడ్పడుతాయని, అంతేకాకుండా వ్యాపార వర్గాల్లో పోటీ తత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేవలం ప్రస్తుత ఆర్థిక నిపుణులపైనే ఆధారపడకుండా, బహుళ ప్రాచుర్యం పొందిన ప్రాచీన అర్థశాస్త్రం లాంటి గ్రంథాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. సంపద సృష్టించే మెళుకువలను ప్రాచీన కాలం నాటి అర్థశాస్త్రంలో చక్కగా వివరించారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్లో సూచించినట్టుగా దేశంలోనే ముడిసరుకుల ఉత్పత్తి వల్ల భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశం దూసుకెళ్లాలంటే ఎక్కువ స్థాయిలో ముడిసరుకులను ఎగుమతి చేయాలని తెలిపారు. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాయని పేర్కొన్నారు. దేశంలోకి ప్రో బిజినెస్ పాలసీలు అమలు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చదవండి: అపుడు దోసానామిక్స్, ఇపుడు థాలినామిక్స్ -
నూరు వసంతాల ‘అక్టోబర్’
అక్టోబర్ విప్లవం పెట్టుబడిదారీ విధానానికి, పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది. దోపిడీ పీడనలు లేని సమసమాజం ఆదర్శవాద స్వప్నం కాదని రుజువు చేసింది. అందుకు ఆచరణాత్మక మార్గమైంది. ఖండఖండాలలో కార్మికవర్గ, కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊపిరులూదింది. సోషలిజాన్ని ఆవిష్కరించింది. ఆ మహత్తర శ్రామికవర్గ విప్లవ శత వత్సర స్వాగత గీతికగా సకల విప్లవాల, పోరాటాల, ఉద్యమాల మాతృత్వ ప్రతీకయైన గోర్కీ ‘అమ్మ’ వంటి అసంఖ్యాకులైన అమ్మలందరినీ సంస్మరించుకుందాం. నిన్నటి నెత్తుటి విజయాల జ్ఞాపకాలు, గాయాల గురుతులు, త్యాగాల ఆనవాళ్లను ఆలపిస్తూ ఆగమించే విప్లవాల అక్టోబర్ ఎప్పుడూ వినూత్నమే. నేటి కర్తవ్యాల, రేపటి మజిలీల, అంతిమ గమ్యాల నెమరువేతకు సమాయ త్తమయ్యే సందర్భమే. ఈ విప్లవాల అక్టోబర్... మహత్తర శ్రామికవర్గ అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవ వత్సర సంరంభంతో వస్తోంది. నిండు గుండెలతో ఆహ్వానిద్దాం, హత్తుకుందాం, ఆవాహన చేద్దాం. 1917 నవంబర్ 7న రష్యాలో జరిగిన మొట్టమొదటి శ్రామికవర్గ విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి నాంది పలికింది. రష్యన్ల పాత జూలియన్ కాలెండర్ ప్రకారం అక్టోబర్ 25 అంటే నేడు వాడుకలో ఉన్న గ్రెగెరియన్ కాలండర్ ప్రకారం నవంబర్ 7 అవుతుంది. 1917 నాటి రష్యాలో అక్టోబర్ 25న రాజధాని పెట్రోగ్రాడ్‌లో బోల్షివిక్కులు సార్వత్రిక తిరుగుబాటును జరపడం వల్ల రష్యా విప్లవానికి అక్టోబర్ విప్లవం పేరు స్థిరపడిపోయింది. పైగా చైనా విప్లవం విజయవంతమైనది కూడా అక్టోబర్ మాసంలోనే (1949 అక్టోబర్ 1). అందుకే అక్టోబర్ అంటేనే విప్లవాల మాసంగా మారింది. రష్యా అక్టోబర్ విప్లవ విజయం పెట్టుబడిదారీ విధానానికే కాదు, ఒక మనిషిని మరో మనిషిని దోచుకునే వేల ఏళ్ల పరపీడన పరాయణత్వానికి మరణ శాసనాన్ని ప్రకటించింది. దోపిడీ పీడనలు లేని సమసమాజం ఒక ఆదర్శవాద స్వప్నం కాదని మానవ సమాజ చారిత్ర గమ్యమనే సత్యానికి రుజువైంది. ఆ మార్గా నికి వెలుగై నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలలోనూ కార్మికవర్గ ఉద్యమాలకు, సోషలిజానికి, కమ్యూనిజానికి ఊపిరులూదింది. సామ్రాజ్య వాదంగా మారి పండుటాకుగా మారిన పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యా మ్నాయంగా సోషలిజాన్ని నిలిపింది. ‘అమ్మ’... అక్టోబర్ విప్లవం అక్టోబర్ విప్లవ శతవార్షికోత్సవాలు ఆరంభం కానుండగా రష్యా విప్లవంలో కీలక భూమికను నిర్వహించిన మాగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’ గుర్తుకొస్తోంది. శ్రామికవర్గ తల్లుల విప్లవ చైతన్యానికి ప్రతీక అమ్మ. దోపిడీ, పీడనలను ధిక్కరించే చైతన్యాన్ని అందిపుచ్చుకొని, కొడుకు ఆశయసాధనలో లీనమైన ఆ అమ్మ తల్లుల త్యాగనిరతికి చిరునామా. అక్టోబర్ మహావిప్లవానికి ముందు అత్యంత నిర్బంధం మధ్య సాహసోపేత కార్మికవర్గ పోరాటంలో కొడుకుకి తోడుగా తొలిసంతకం చేసిన అమ్మ... పావెల్ తల్లి. గోర్కీ 1906లో రాసిన ‘అమ్మ’ నవలే. కానీ ఆ అమ్మ నిన్న, నేడూ, రేపు సర్వత్రా వాస్తవమే. నాటికీ, నేటికీ విప్లవకారుల త్యాగాల బాటన నడిచే ‘అమ్మ’కు సోషలిజం, కమ్యూ నిజం, విప్లవం, రాజకీయాలు, సిద్ధాంతాలు, వైరుధ్యాలు అర్థం కాకపోవచ్చు. కానీ దోపిడీ, పీడనలకు, అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా సాగే అన్ని ఉద్యమాలను వెన్నంటే ఆమె ఉంటుంది. రష్యాలో పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని కూడ గట్టిన కొడుకు పావెల్ పోరాటంలో అమ్మ భాగం అవుతుంది. పోలీసు జులుంకు వెరవక ఎర్రజెండాను దించకుండా కార్మిక దినోత్సవ ప్రదర్శనకు అగ్రభాగాన నిలిచిన కొడుకు పావెల్‌ను వెన్నంటే ఉన్నది అమ్మే. పావెల్ చేజారిన జెండాను ఎత్తిపట్టి జనం మధ్య నిలిచి ఆ అమ్మ కార్మికులనుద్దేశించి మాట్లాడిన మాటలివి.. ‘‘నాయనలారా వినండి! మన రక్తంలో రక్తమైన పిల్లలు, అందరికీ సమానంగా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త ప్రపంచంలో పడ్డారు. మీకందరికీ, మీకు పుట్టబోయే పిల్లలందరికీ మంచి జరిగే రోజుల కోసం వెతకడానికి వారు కంకణం కట్టుకున్నారు. సత్యమూ, న్యాయమూగల మరొక జీవిత విధానాన్ని వాళ్ళు అన్వేషిస్తున్నారు. జనానికందరికీ వాళ్ళు మంచిని కోరుతున్నారు’’. ఉద్యమసారథియైన కొడుకు పావెల్ జైలుపాలు కాగా, అతని ఆశయాన్ని కొనసాగించేందుకు చీరలో దాచుకున్న కరపత్రాలతో నీలోవ్నా వర్గదోపిడీకి వ్యతిరేకంగా సాగుతోన్న కార్మికోద్యమానికి ప్రాణం పోస్తుంది. చివరకు పోలీసు తూటాలకు ఎదనడ్డం పెట్టి మరీ కొడుకు ఆశయాల కరపత్రాలను వెదజల్లుతూ ఆ అమ్మ అన్న మాటలు చిరస్మరణీయం.. ‘‘రక్తసముద్రం కూడా సత్యాన్ని ముంచెయ్యలేదు’’ అని. ఏ అమ్మయినా ఎప్పుడూ కొడుకు సత్యమని నమ్ముతుంది. అతడు సత్యదూరుడైతే నయానా, భయానా నచ్చజెప్పి సన్మార్గంలో పెడుతుంది. తనలో ఊపిరి ఉన్నంత వరకు బిడ్డ ప్రాణాలకు తన ప్రాణాలడ్డుపెడుతుంది. రక్తప్రవాహాలు సైతం తన బిడ్డ నమ్మిన సత్య మార్గాన్ని ముంచెయ్యలేవని ప్రకటిస్తుంది నవల చివర్లో గోర్కీ ‘అమ్మ’. ‘ఒక తల్లి’ విప్లవ సమిధలందరి కన్న తల్లి విప్లవకారులను కన్న నిజమైన తల్లుల జీవితాలన్నీ గుండెలను పిండిచేసే మహోన్నత కావ్యాలే. బిడ్డ ప్రాణాలకు ముప్పని తెలిసీ ఎందరో బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు తన బిడ్డని త్యాగం చేసిన తల్లులెందరో. తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఉద్యమానికి ఊతమిచ్చిన అమ్మలెందరో. అందుకే ఉద్యమ నెలబాలుడు సత్యమూర్తి అంటాడు. ‘‘అమ్మా నను కన్నందుకు విప్లవాభివందనాలు’’ అని. చావు నన్ను సమీపించి గుసగుసలాడక ముందే, ఆంక్షల సంకెళ్ళు దాటి నిన్ను ఒక్కసారి చూడాలని వుందని చివరికోర్కెను ప్రకటిస్తాడు. మహాశ్వేతా దేవి ‘ఒక తల్లి’ పోలీసులు కాల్చి చంపిన తన బిడ్డ మరణానికి కారణాలను వెతుక్కుంటూ వెళ్లిన ఎందరో అమ్మలను జ్ఞప్తికి తెస్తుంది. తన బిడ్డ రాసిన గోడ రాతలను తడుముకుంటూ, మరణంలో సైతం కొడుకును వీడని అతని స్నేహితుల తల్లులను వెతుక్కుని వెళ్లి, ఆ చింకిపాతల పేద తల్లులను తనివితీరా హత్తుకుంటుంది. తన బిడ్డ గడిపిన సాహసోపేత జీవిత జ్ఞాపక శకలాలను ఏరుకుని గుండెలకు అదు ముకుంటూ... తన కొడుకు కోటానుకోట్ల తల్లుల బిడ్డల ఉద్యమ శిశువని, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, సమసమాజ స్థాపన కోసం విలువైన తన ప్రాణాలను త్యజించాడని అర్థం చేసుకుంటుంది. కొడుకు మార్గమే సరి యైనదిగా భావిస్తుంది. మిగిలినదంతా ఉత్త కల్పన అనుకుంటుంది. కొడుకు ఆశయాలు ఆ అమ్మకు అంతుబట్టకపోయినా కొడుకు తప్పు చేయడన్న విశ్వాసం భరోసానిస్తుంది. అమ్మంటే తెలంగాణ పోరు పాట, ఉద్యమాల బాట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం రజాకార్లనెదిరించి, యూనియన్ సైన్యాన్ని ధిక్కరించి నడిపిన పోరాటంలో ఎందరో తల్లుల గుండె చెదిరే త్యాగాలున్నాయి. పాలిచ్చే బిడ్డలను పంటపొలాల్లో వదిలేసి ఆయుధాలు పట్టిన వీరమాతలెందరో. తమ బిడ్డలు ఎక్కడున్నారో, ఏమై పోయారో కూడా తెలియకుండా ఏళ్ళు, దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న తల్లులను కూడా ఉద్యమం మనకి అనుభవంలోకి తెచ్చింది. ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం బిడ్డల ప్రాణ త్యాగాలను ప్రోత్సహించిన వారు కొందరైతే, బిడ్డల పోరాటంలో భాగం పంచుకొన్నవారు మరికొందరు. బానిస బతుకుల విముక్తి కోసం అమ్మ ఆ రోజున అన్నీ భరించింది. కొడుకు జాడచెప్పమన్న పోలీసులు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తల్లి ధీరోదాత్తత ముందు ఓటమిపాలు కాక తప్పలేదు. తల్లుల పోరాట పటిమ ముందు అన్నీ దిగదుడుపే. దొరల పెత్తనానికీ, పోలీసుల దాష్టీకాలకూ చరమ గీతం పాడుతూ ప్రతి తల్లీ ఆనాడొక చైతన్యకెరటమయ్యింది. ఊరిదొరల ఆట కట్టించే ఉప్పెనయ్యింది. ఉద్యమానికి ఊపిరయ్యింది. చంటి బిడ్డలను వదిలేసి చంకన తుపాకులనెత్తుకున్న తల్లులెందరో. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమైన ఒక్కో తల్లిదీ ఒక్కో విలక్షణమైన అనుభవం. చాకలి ఐలమ్మ మొదలుకొని ఎందరో తల్లులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దోపిడీ, పీడనల నుంచి విముక్తి కోసం నాటి మహత్తర తెలంగాణ పోరా టంలో సమిధలుగా మారారు. ఆ తదుపరి నక్సల్బరీ మొదలుకొని శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం, గోదావరీ లోయ, కరీంనగర్ పోరాటాల నుంచి నిన్న మొన్నటి మలి తెలంగాణ ఉద్యమం వరకు ఎందరో తల్లులు తమ బిడ్డల త్యాగాలను ప్రేమించారు. వారి ఆశయాలను అనుసరించారు. వారి లక్ష్యాలను గౌరవించారు. లాఠీలకూ, తూటాలకూ, నిర్బంధాలకూ వెరువని ఆ తల్లులే నిన్న నేడు, రేపూ కూడా విప్లవోద్యమానికి వెన్నెముక. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంలో దళాల్ని కాపాడుకునేందుకు బిడ్డల్ని త్యాగం చేసిన తల్లులు ఉద్యమంలోనూ, వెలుపలా కూడా ఉన్నారు. తల్లులు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ బిడ్డలు పడ్డ కష్టాలు ఒక ఎత్తై, తల్లులను జైల్లో పెట్టినప్పుడు ఆ కుటుంబాలు అనుభవించిన అంతులేని దుఃఖం మరో ఎత్తు. తమ బిడ్డల ఆచూకీ చెప్పమంటూ ఎందరో తల్లులను జైలుపాల్జేసిన బాధామయ గాధలు శ్రీకాకుళ పోరాటంలో కోకొల్లలు. తండ్రి చనిపోతే కొరివి పెట్టాల్సిన కొడుకు అడవిబాటపడితే, భర్త చితికి నిప్పుపెట్టిన విప్లవ మాతృమూర్తులెందరో. తండ్రి శవాన్ని సైతం చూడలేకపోయిన పరిస్థితి కల్పించినందుకు రహస్య జీవనంలోంచి తల్లికి బహిరంగ లేఖ రాసిన అనుభవాలూ మనకి ఎరుకే. అందుకే కవి మిత్ర అంటాడు... ‘నిను కడసారి చూడని కొడుకులం/ కన్నీళ్ళల్లో కరిగే కొవ్వొత్తులం/లోకమంతా అమ్మ రూపమే, నీ ఆకలి మా ఆర్తనాదమే.’ వీరగాథలను చనుబాలతో నూరిపోసి, విప్లవమార్గాన్ని చూపిన వీరమాతలను చరిత్ర మరచిపోదు. ‘అమ్మ’ అలుపెరుగని పోరాట గీతం, అమ్మ త్యాగానికి ప్రతీక. మహత్తర అక్టోబర్ విప్లవ శత వత్సర స్వాగత గీతికగా సకల విప్లవాల, పోరాటాల, ఉద్యమాల మాతృ పతాకకు ప్రతీకయైన గోర్కీ అమ్మల లాంటి అసంఖ్యాకమైన అమ్మలందరినీ సంస్మరించుకుందాం. ఆ అమ్మలందరి ఆశలను నిజం చేసేందుకు అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. మా అమ్మ పోసమ్మ యాదిలో... అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవం ప్రారంభం కానున్న సందర్భంగా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
చి‘వరి’కి..
వరి రైతు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మునుపెన్నడూ లేనివిధంగా సుడిదోమ, మెడ విరుపు, తెల్లచీడ సోకడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. పెట్టుబడీ రాక అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇదే అదనుగా ప్రయివేటు వ్యాపారులు ఒకటికి సగానికి దండుకోవడం అన్నదాతను మరింత కుంగదీస్తోంది. చిత్తూరు: ‘జీడీ నెల్లూరు మండలం అప్పిరెడ్డికండ్రిగకు చెందిన రైతు రాజోల్ల సుబ్రమణ్యం గత డిసెంబర్లో 1.50 ఎకరాల్లో సన్న బుడ్డలు వరిపంట సాగుచేశాడు. మూడు సార్లు పొలం దుక్కికి రూ.12 వేలు, నాలుగు ట్రాక్టర్ల ఆవుపేడకు రూ.4వేలు, వరి విత్తనాలు, నాట్లు వేయడానికి రూ.8 వేలు, పురుగు మందుల పిచికారీకి రూ.6 వేలు, వరికోత మిషన్‌కు, కూలీలు, ధ్యాన్యం ఇంటికి చేర్చు కొనేందుకు రూ.10వేలు.. ఇలా మొత్తం రూ.40 వేలు ఖర్చుచేశాడు. 45 బస్తాల ధ్యాన్యం దిగుబడి వచ్చింది. మార్కెట్లో బస్తాధాన్యం రూ.650 పలుకుతోంది. ఈ లెక్కన రూ.29,250 వేలు మాత్రమే వస్తుంది. రూ.10,750 నష్టం మిగులుతుంది’.. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లలో వరి సాగు చేసిన అన్నదాతల్లో ఎక్కువ మంది రైతులది ఇదే పరిస్థితి. మరోవైపు వరి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల టన్నులకు పైగా వరి పంట పండితే పట్టుమని 50 టన్నుల ధాన్యాన్నీ కొనుగోలు చేయలేదు. ఆశ..అడియాశ! నవంబర్‌లో భారీ వర్షాలు కురిసి జలశయాలు నిండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరి పంట పెద్దమొత్తంలో సాగైంది. జిల్లా సాధారణ విస్తీర్ణం 35 వేల హెక్టార్లు కాగా 82 వేల హెకా్టార్లు వరి సాగైంది. 30 శాతం సన్నాలు రకం, 70 శాతం బుడ్డల రకం వరిని రైతులు సాగు చేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో వరికోతలు పూర్తిదశకు చేరగా సత్యవేడు, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో 40 నుంచి 50 శాతం పంట కోతకు వచ్చింది. దిగుబడి అంతంత మాత్రమే ధాన్యం బాగా పండింతే ఒక ఎకరాకు 30 బస్తాలు దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది సుడిదోమ, మెడవిరుపు, తెల్లచీడ తదితర తెగుళ్లు సోకడంతో పంట దెబ్బతింది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం దాదాపు నాలుగు వేల హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన పంట దిగుబడి సగానికి సగం తగ్గింది. సాగు విస్తీర్ణం ప్రకారం పూర్తి స్థాయిలో పంట దిగుబడి వచ్చి ఉంటే 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ పంట దెబ్బతినడంతో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. -
కోఠిలో హోర్డింగ్ ఎక్కిన ఇద్దరు విద్యార్థులు
-
హోర్డింగ్ ఎక్కి విద్యార్థి జేఏసీ నేతల హల్చల్
హైదరాబాద్ : నగరంలోని ఓ హోర్డింగ్ పైకి ఎక్కి ఇద్దరు విద్యార్థి జేఏసీ నాయకులు హల్ చల్ చేశారు. చింతల విజయ్ రాజు, ఆనంద్ అనే ఇద్దరు జేఏసీ నేతలు శుక్రవారం ఉదయం కోఠి ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా లోని హోర్టింగ్ పైకి ఎక్కారు. 'గత ప్రభుత్వం ఏపీఐఐసీ పేరిట సంస్థను ఏర్పాటు చేసి పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించింది. పెట్టుబడి దారీ వ్యవస్థను అడ్డంపెట్టుకుని తెలంగాణ భూములను దోచుకున్నారు. పరిశ్రమల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి' అని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వారిని హోర్టింగ్ నుంచి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు. -
పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతినిధి మోడీ: హరగోపాల్
గోదావరిఖని: దేశంలో పెట్టుబడీదారీ వ్యవస్థకు ప్రతినిధిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బయలుదేరారని, ఆయన ప్రధానమంత్రి అయితే శ్రామికవర్గానికి మరిన్ని ఇబ్బందులు తప్పవని ప్రముఖ వక్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం గురువారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ..దేశంలో కార్మికవర్గం ఏకమవకుండా ఉండడానికి సంఘటిత, అసంఘటిత, కాంట్రాక్టు, క్యాజువల్, అవుట్ సోర్సింగ్ తదితర రూపాల్లో కార్మిక రంగ వ్యవస్థను సృష్టించారని అన్నారు. ఈ క్రమంలో కొన్ని వర్గాల కార్మికులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తూ ఉద్యమాలకు దూరం చేశారని, మరోవైపు ఈ కొద్దిమంది కార్మికుల కోసం 80 శాతంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు తక్కువ వేతనాలను చెల్లిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని వివరించారు. దేశంలో ఉన్న సహజ వనరులపై పెట్టుబడిదారుల కన్ను పడిందని, నేడు వాటిని విక్రయించే స్థాయికి ఆ వ్యవస్థ చేరుకుందని, ఇది ఎంతో నష్టదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఏడాదికొకసారి పెంచే ధరలను ఇప్పడు నెలకొకసారి పెంచే స్థాయికి పెట్టుబడిదారీ సంస్థలు చేరుకున్నాయన్నారు. ప్రకృతి విధ్వంసం వల్ల రాబోయే రోజుల్లో మానవ మనుగడ కష్టతరమవుతుందని, అందువల్ల సహజ వనరులను కాపాడుకునేందుకు శ్రామికులే పోరాటం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలు పోరాడి సాధించుకున్నప్పటికీ పునర్నిర్మాణంలో కార్మికులు, శ్రామికుల పాత్ర కీలకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.