వరి రైతు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మునుపెన్నడూ లేనివిధంగా సుడిదోమ, మెడ విరుపు, తెల్లచీడ సోకడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. పెట్టుబడీ రాక అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇదే అదనుగా ప్రయివేటు వ్యాపారులు ఒకటికి సగానికి దండుకోవడం అన్నదాతను మరింత కుంగదీస్తోంది.
చిత్తూరు: ‘జీడీ నెల్లూరు మండలం అప్పిరెడ్డికండ్రిగకు చెందిన రైతు రాజోల్ల సుబ్రమణ్యం గత డిసెంబర్‌లో 1.50 ఎకరాల్లో సన్న బుడ్డలు వరిపంట సాగుచేశాడు. మూడు సార్లు పొలం దుక్కికి రూ.12 వేలు, నాలుగు ట్రాక్టర్ల ఆవుపేడకు రూ.4వేలు, వరి విత్తనాలు, నాట్లు వేయడానికి రూ.8 వేలు, పురుగు మందుల పిచికారీకి రూ.6 వేలు, వరికోత మిషన్‌కు, కూలీలు, ధ్యాన్యం ఇంటికి చేర్చు కొనేందుకు రూ.10వేలు.. ఇలా మొత్తం రూ.40 వేలు ఖర్చుచేశాడు. 45 బస్తాల ధ్యాన్యం దిగుబడి వచ్చింది. మార్కెట్లో బస్తాధాన్యం రూ.650 పలుకుతోంది. ఈ లెక్కన రూ.29,250 వేలు మాత్రమే వస్తుంది. రూ.10,750 నష్టం మిగులుతుంది’..
ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లలో వరి సాగు చేసిన అన్నదాతల్లో ఎక్కువ మంది రైతులది ఇదే పరిస్థితి. మరోవైపు వరి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల టన్నులకు పైగా వరి పంట పండితే పట్టుమని 50 టన్నుల ధాన్యాన్నీ కొనుగోలు చేయలేదు.
ఆశ..అడియాశ!
నవంబర్‌లో భారీ వర్షాలు కురిసి జలశయాలు నిండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరి పంట పెద్దమొత్తంలో సాగైంది. జిల్లా సాధారణ విస్తీర్ణం 35 వేల హెక్టార్లు కాగా 82 వేల హెకా్టార్లు వరి సాగైంది. 30 శాతం సన్నాలు రకం, 70 శాతం బుడ్డల రకం వరిని రైతులు సాగు చేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో వరికోతలు పూర్తిదశకు చేరగా సత్యవేడు, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో 40 నుంచి 50 శాతం పంట కోతకు వచ్చింది.
దిగుబడి అంతంత మాత్రమే
ధాన్యం బాగా పండింతే ఒక ఎకరాకు 30 బస్తాలు దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది సుడిదోమ, మెడవిరుపు, తెల్లచీడ తదితర తెగుళ్లు సోకడంతో పంట దెబ్బతింది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం దాదాపు నాలుగు వేల హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన పంట దిగుబడి సగానికి సగం తగ్గింది. సాగు విస్తీర్ణం ప్రకారం పూర్తి స్థాయిలో పంట దిగుబడి వచ్చి ఉంటే 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ పంట దెబ్బతినడంతో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.