rice farmer
-
చి‘వరి’కి..
వరి రైతు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మునుపెన్నడూ లేనివిధంగా సుడిదోమ, మెడ విరుపు, తెల్లచీడ సోకడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. పెట్టుబడీ రాక అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇదే అదనుగా ప్రయివేటు వ్యాపారులు ఒకటికి సగానికి దండుకోవడం అన్నదాతను మరింత కుంగదీస్తోంది. చిత్తూరు: ‘జీడీ నెల్లూరు మండలం అప్పిరెడ్డికండ్రిగకు చెందిన రైతు రాజోల్ల సుబ్రమణ్యం గత డిసెంబర్లో 1.50 ఎకరాల్లో సన్న బుడ్డలు వరిపంట సాగుచేశాడు. మూడు సార్లు పొలం దుక్కికి రూ.12 వేలు, నాలుగు ట్రాక్టర్ల ఆవుపేడకు రూ.4వేలు, వరి విత్తనాలు, నాట్లు వేయడానికి రూ.8 వేలు, పురుగు మందుల పిచికారీకి రూ.6 వేలు, వరికోత మిషన్‌కు, కూలీలు, ధ్యాన్యం ఇంటికి చేర్చు కొనేందుకు రూ.10వేలు.. ఇలా మొత్తం రూ.40 వేలు ఖర్చుచేశాడు. 45 బస్తాల ధ్యాన్యం దిగుబడి వచ్చింది. మార్కెట్లో బస్తాధాన్యం రూ.650 పలుకుతోంది. ఈ లెక్కన రూ.29,250 వేలు మాత్రమే వస్తుంది. రూ.10,750 నష్టం మిగులుతుంది’.. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లలో వరి సాగు చేసిన అన్నదాతల్లో ఎక్కువ మంది రైతులది ఇదే పరిస్థితి. మరోవైపు వరి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల టన్నులకు పైగా వరి పంట పండితే పట్టుమని 50 టన్నుల ధాన్యాన్నీ కొనుగోలు చేయలేదు. ఆశ..అడియాశ! నవంబర్‌లో భారీ వర్షాలు కురిసి జలశయాలు నిండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరి పంట పెద్దమొత్తంలో సాగైంది. జిల్లా సాధారణ విస్తీర్ణం 35 వేల హెక్టార్లు కాగా 82 వేల హెకా్టార్లు వరి సాగైంది. 30 శాతం సన్నాలు రకం, 70 శాతం బుడ్డల రకం వరిని రైతులు సాగు చేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో వరికోతలు పూర్తిదశకు చేరగా సత్యవేడు, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో 40 నుంచి 50 శాతం పంట కోతకు వచ్చింది. దిగుబడి అంతంత మాత్రమే ధాన్యం బాగా పండింతే ఒక ఎకరాకు 30 బస్తాలు దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది సుడిదోమ, మెడవిరుపు, తెల్లచీడ తదితర తెగుళ్లు సోకడంతో పంట దెబ్బతింది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం దాదాపు నాలుగు వేల హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన పంట దిగుబడి సగానికి సగం తగ్గింది. సాగు విస్తీర్ణం ప్రకారం పూర్తి స్థాయిలో పంట దిగుబడి వచ్చి ఉంటే 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ పంట దెబ్బతినడంతో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. -
ఈ మద్దతు ఏ మూలకు?
రూ.300 క్వింటాల్‌పై కనిష్టంగా పెంచాలని రైతుల డిమాండ్... * రూ.50 కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తాజాగా పెంచినది... * రైతుకు అన్యాయం జరిగినా నోరు మెదపని సీఎం చంద్రబాబు * కనీసం బోనస్ ఇచ్చే ప్రతిపాదననూ పరిగణనలోకి తీసుకోని దుస్థితి * వరికి బోనస్ ప్రకటించిన ఘనత వైఎస్‌దే సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర పెంచాలంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వరి రైతుకు తీవ్ర అన్యాయం జరిగినా నోరుమెదపడం లేదు. వరికి కనీస మద్దతు ధరను క్వింటాల్‌పై కనిష్టంగా రూ.300 పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో వరికి క్వింటాల్ ధరను కనీసం రూ.1700 ప్రకటించాలంటూ జాతీయ వ్యవసాయ ధరల కమిషన్‌కు రైతు సంఘాల ప్రతినిధులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. అవేమీ పట్టించుకోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) వరికి క్వింటాలుపై కనీస మద్దతు ధరను రూ.50 మాత్రమే పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. స్వామినాథన్ సిఫారసుల మాటేంటి? రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి చేయడానికి క్వింటాల్‌కు సాధారణ రకానికి రూ.2,053, ఏ-గ్రేడ్ రకానికి రూ.2,627 వెచ్చించాల్సి వస్తోందని స్వామినాథన్ కమిషన్ తేల్చింది. వరి రైతుకు ఉత్పత్తి వ్యయానికి కనీసం ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని పేర్కొంది. దీని ప్రకారం సాధారణ రకానికి రూ.3,079, ఏ-గ్రేడ్‌కు రూ.3,940ను కనీస మద్దతు ధర కల్పించాలి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు స్వామినాథన్ కమిషన్ నివేదిక మేరకు కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. మద్దతు ధరలు దక్కేలా చేయడం కోసం రూ.ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక మాట దేవుడెరుగు కనీసం జాతీయ వ్యవసాయ ధరల కమిషన్‌కు మద్దతు ధర పెంపుపై ప్రభుత్వం తరఫున చంద్రబాబు కనీసం ప్రతిపాదన కూడా పంపలేదని వ్యవసాయశాఖ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుడూ.. ఇప్పుడూ మౌనమే రాష్ట్రంలో చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో టీడీపీ మిత్రపక్షాలే కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ఆ తొమ్మిదేళ్లలో వరి ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ.85 మాత్రమే పెరిగింది. కానీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంలో స్వపక్షం అధికారంలో ఉన్నా వరికి మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. కేంద్రం కనీస మద్దతు ధరను పెంచడంలో విఫలమైతే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనస్‌ను వరి రైతులకు వైఎస్ ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా 2006-07లో క్వింటాలుకు రూ.40, 2007-08లో రూ.100, 2008-09లో రూ.50, 2009-10లో రూ.50ను వరికి బోనస్‌గా ఇచ్చారు. వరికి క్వింటాల్‌కు రూ.1300 మద్దతు ధరను ప్రకటించాలంటూ 2008-09లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ పోరాటాల ఫలితంగా ఐదున్నరేళ్లలో వరి కనీస మద్దతు ధర క్వింటాలుపై రూ.450 పెరిగింది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయమై నోరు మెదపని చంద్రబాబు.. విపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లపాటూ మద్దతు ధర పెంచాలంటూ రాద్ధాంతం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వరి రైతుకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనస్ ఇచ్చే ఆలోచనా చంద్రబాబు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. -
ఇదేం ‘సాంబ’..!
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ జిల్లాకు సరపరా చేసిన వరి విత్తనాల్లో కల్తీలు వచ్చాయని నిర్ధారణ అయింది. అధికారుల తప్పుడు అంచనాలతో కొండంత నష్టం జరిగితే గోరంత నష్టాన్ని మాత్రమే చూయించారు. రైతులు, రైతుసంఘాల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో నష్టం జరిగితే కేవలం 1,517 ఎకరాల్లో మాత్రమే కల్తీలు సాగయ్యాయని నిర్ధారించారు. ఎనిమిది నుంచి 15 శాతం బెరుకులుంటేనే కల్తీగా గుర్తించాలని వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో కల్తీలతో పంట దిగుబడి తగ్గిన రైతులు పలువురు పరిహారానికి నోచుకోలేక పోతున్నారు. జిల్లాలో మొత్తం పది మండలాల్లోనే నకిలీ విత్తనాలు సరఫరా అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎకరాకు రూ.2వేల నుంచి రూ.3వేల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 645 మంది రైతులకు పరిహారం ప్రకటించారు. నిండా ముంచిన ‘సాంబ’ వరి రకాల్లో అధిక డిమాండ్ ఉన్న బీపీటీ 5204 అనే సాంబమసూరి రకంలో కల్తీ విత్తనాలు ఎక్కువగా ఉన్నాయని.. పంట దిగుబడి బాగా తగ్గిందని అప్పట్లో జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళన నిర్వహించారు. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో వేసిన ఈ రకం వరిలో కల్తీలు ఉన్నట్లు రైతులు, రైతుసంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. జేడీఏ కార్యాలయం ఎదుట కూడా రైతులు ఆందోళన నిర్వహించారు. పరిహారం కోసం రైతులు డిమాండ్ చేశారు. ఎకరాకు 32 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సిన చోట అందులో సగం దిగుబడులే వచ్చాయని రైతులు వాపోయారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో క్షేత్ర పరిశీలన చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాస్త్రవేత్తలతో కూడా పరిశీలన చేయించి తగిన నివేదిక ఇవ్వాలని సూచించారు. లెక్క ఎలా తప్పింది..? కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించారు. నిబంధనల మేరకు చదరపు మీటర్‌ను ప్రామాణికంగా తీసుకుని లెక్కకట్టారు. చదరపు మీటర్ పైరులో 8 నుంచి 15 శాతం బెరుకులు ఉన్నట్లయితే ఆ పైరులో కల్తీ విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విధానం వల్ల జిల్లాలో కేవలం 1,517 ఎకరాల్లో మాత్రమే క ల్తీ విత్తనాలు సాగయినట్లయింది. జిల్లాలో నేలకొండపల్లి, మధిర, కొణిజర్ల, ఎర్రుపాలెం, వైరా, కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, కామేపల్లి, కొత్తగూడెం మండలాల్లో సాగుచేసిన బీపీటీ 5204 వరి విత్తనాల్లో కల్తీలు ఉన్నట్లు గుర్తించారు. ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఈ విత్తనాలను అందించింది. సబ్సిడీ మొత్తాలను ఏపీ సీడ్స్‌కు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఆ నిధులను ఏపీ సీడ్స్‌కు కాకుండా పరిహారంగా రైతులకు ఇవ్వాలని వ్యవసాయశాఖ కమిషనర్ నిర్ణయించారు. కల్తీ విత్తనాల శాతాన్ని బట్టి ఎకరానికి రూ.2 నుంచి రూ. 3వేల వరకు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.బి.బాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. కల్తీ విత్తనాలున్నట్లు గుర్తించిన పది మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు, ఏపీ సీడ్స్ జిల్లా అధికారితో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ విత్తనాలతో పంట దిగుబడులు తగ్గిపోయి నష్టపోయిన 645 మంది రైతుల ఈ పరిహారం అందిస్తామన్నారు. వేలాది ఎకరాల్లో కల్తీ విత్తనాల కారణంగా పంట దిగుబడులు తగ్గిపోగా నిబంధనల పేరిట కేవలం 1,517 ఎకరాల్లో మాత్రమే కల్తీ విత్తనాల ప్రభావం ఉందని నిర్ధారించడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.