ఈ మద్దతు ఏ మూలకు? | Increase minimum support price of paddy | Sakshi
Sakshi News home page

ఈ మద్దతు ఏ మూలకు?

Published Fri, Jun 19 2015 2:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఈ మద్దతు ఏ మూలకు? - Sakshi

ఈ మద్దతు ఏ మూలకు?

రూ.300 క్వింటాల్‌పై కనిష్టంగా పెంచాలని రైతుల డిమాండ్...
* రూ.50 కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తాజాగా పెంచినది...
* రైతుకు అన్యాయం జరిగినా నోరు మెదపని సీఎం చంద్రబాబు
* కనీసం బోనస్ ఇచ్చే ప్రతిపాదననూ పరిగణనలోకి తీసుకోని దుస్థితి
* వరికి బోనస్ ప్రకటించిన ఘనత వైఎస్‌దే

సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరికి కనీస మద్దతు ధర పెంచాలంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వరి రైతుకు తీవ్ర అన్యాయం జరిగినా నోరుమెదపడం లేదు.

వరికి కనీస మద్దతు ధరను క్వింటాల్‌పై కనిష్టంగా రూ.300 పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో వరికి క్వింటాల్ ధరను కనీసం రూ.1700 ప్రకటించాలంటూ జాతీయ వ్యవసాయ ధరల కమిషన్‌కు రైతు సంఘాల ప్రతినిధులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. అవేమీ పట్టించుకోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) వరికి క్వింటాలుపై కనీస మద్దతు ధరను రూ.50 మాత్రమే పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
 
స్వామినాథన్ సిఫారసుల మాటేంటి?
రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి చేయడానికి క్వింటాల్‌కు సాధారణ రకానికి రూ.2,053, ఏ-గ్రేడ్ రకానికి రూ.2,627 వెచ్చించాల్సి వస్తోందని స్వామినాథన్ కమిషన్ తేల్చింది. వరి రైతుకు ఉత్పత్తి వ్యయానికి కనీసం ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని పేర్కొంది. దీని ప్రకారం సాధారణ రకానికి రూ.3,079, ఏ-గ్రేడ్‌కు రూ.3,940ను కనీస మద్దతు ధర కల్పించాలి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు స్వామినాథన్ కమిషన్ నివేదిక మేరకు కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. మద్దతు ధరలు దక్కేలా చేయడం కోసం రూ.ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక మాట దేవుడెరుగు కనీసం జాతీయ వ్యవసాయ ధరల కమిషన్‌కు మద్దతు ధర పెంపుపై ప్రభుత్వం తరఫున చంద్రబాబు కనీసం ప్రతిపాదన కూడా పంపలేదని వ్యవసాయశాఖ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
 
అప్పుడూ.. ఇప్పుడూ మౌనమే
రాష్ట్రంలో చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో టీడీపీ మిత్రపక్షాలే కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ఆ తొమ్మిదేళ్లలో వరి ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ.85 మాత్రమే పెరిగింది. కానీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంలో స్వపక్షం అధికారంలో ఉన్నా వరికి మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. కేంద్రం కనీస మద్దతు ధరను పెంచడంలో విఫలమైతే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనస్‌ను వరి రైతులకు వైఎస్ ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా 2006-07లో క్వింటాలుకు రూ.40, 2007-08లో రూ.100, 2008-09లో రూ.50, 2009-10లో రూ.50ను వరికి బోనస్‌గా ఇచ్చారు.

వరికి క్వింటాల్‌కు రూ.1300 మద్దతు ధరను ప్రకటించాలంటూ 2008-09లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ పోరాటాల ఫలితంగా ఐదున్నరేళ్లలో వరి కనీస మద్దతు ధర క్వింటాలుపై రూ.450 పెరిగింది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయమై నోరు మెదపని చంద్రబాబు.. విపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లపాటూ మద్దతు ధర పెంచాలంటూ రాద్ధాంతం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వరి రైతుకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనస్ ఇచ్చే ఆలోచనా చంద్రబాబు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement