ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ జిల్లాకు సరపరా చేసిన వరి విత్తనాల్లో కల్తీలు వచ్చాయని నిర్ధారణ అయింది. అధికారుల తప్పుడు అంచనాలతో కొండంత నష్టం జరిగితే గోరంత నష్టాన్ని మాత్రమే చూయించారు. రైతులు, రైతుసంఘాల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో నష్టం జరిగితే కేవలం 1,517 ఎకరాల్లో మాత్రమే కల్తీలు సాగయ్యాయని నిర్ధారించారు. ఎనిమిది నుంచి 15 శాతం బెరుకులుంటేనే కల్తీగా గుర్తించాలని వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో కల్తీలతో పంట దిగుబడి తగ్గిన రైతులు పలువురు పరిహారానికి నోచుకోలేక పోతున్నారు. జిల్లాలో మొత్తం పది మండలాల్లోనే నకిలీ విత్తనాలు సరఫరా అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎకరాకు రూ.2వేల నుంచి రూ.3వేల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 645 మంది రైతులకు పరిహారం ప్రకటించారు.
నిండా ముంచిన ‘సాంబ’
వరి రకాల్లో అధిక డిమాండ్ ఉన్న బీపీటీ 5204 అనే సాంబమసూరి రకంలో కల్తీ విత్తనాలు ఎక్కువగా ఉన్నాయని.. పంట దిగుబడి బాగా తగ్గిందని అప్పట్లో జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళన నిర్వహించారు. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో వేసిన ఈ రకం వరిలో కల్తీలు ఉన్నట్లు రైతులు, రైతుసంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. జేడీఏ కార్యాలయం ఎదుట కూడా రైతులు ఆందోళన నిర్వహించారు. పరిహారం కోసం రైతులు డిమాండ్ చేశారు. ఎకరాకు 32 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సిన చోట అందులో సగం దిగుబడులే వచ్చాయని రైతులు వాపోయారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో క్షేత్ర పరిశీలన చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాస్త్రవేత్తలతో కూడా పరిశీలన చేయించి తగిన నివేదిక ఇవ్వాలని సూచించారు.
లెక్క ఎలా తప్పింది..?
కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించారు. నిబంధనల మేరకు చదరపు మీటర్‌ను ప్రామాణికంగా తీసుకుని లెక్కకట్టారు. చదరపు మీటర్ పైరులో 8 నుంచి 15 శాతం బెరుకులు ఉన్నట్లయితే ఆ పైరులో కల్తీ విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విధానం వల్ల జిల్లాలో కేవలం 1,517 ఎకరాల్లో మాత్రమే క ల్తీ విత్తనాలు సాగయినట్లయింది. జిల్లాలో నేలకొండపల్లి, మధిర, కొణిజర్ల, ఎర్రుపాలెం, వైరా, కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, కామేపల్లి, కొత్తగూడెం మండలాల్లో సాగుచేసిన బీపీటీ 5204 వరి విత్తనాల్లో కల్తీలు ఉన్నట్లు గుర్తించారు. ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఈ విత్తనాలను అందించింది. సబ్సిడీ మొత్తాలను ఏపీ సీడ్స్‌కు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
ఆ నిధులను ఏపీ సీడ్స్‌కు కాకుండా పరిహారంగా రైతులకు ఇవ్వాలని వ్యవసాయశాఖ కమిషనర్ నిర్ణయించారు. కల్తీ విత్తనాల శాతాన్ని బట్టి ఎకరానికి రూ.2 నుంచి రూ. 3వేల వరకు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.బి.బాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. కల్తీ విత్తనాలున్నట్లు గుర్తించిన పది మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు, ఏపీ సీడ్స్ జిల్లా అధికారితో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ విత్తనాలతో పంట దిగుబడులు తగ్గిపోయి నష్టపోయిన 645 మంది రైతుల ఈ పరిహారం అందిస్తామన్నారు. వేలాది ఎకరాల్లో కల్తీ విత్తనాల కారణంగా పంట దిగుబడులు తగ్గిపోగా నిబంధనల పేరిట కేవలం 1,517 ఎకరాల్లో మాత్రమే కల్తీ విత్తనాల ప్రభావం ఉందని నిర్ధారించడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇదేం ‘సాంబ’..!
Published Wed, Jan 8 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement