సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్
సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్): టీఎస్‌ఆర్టీసీలో సంఘటిత ఉద్యమాలు చేయడం ఇప్పుడు అవసరమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్య క్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోవడం దురదృష్టకరం అన్నారు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో ఆర్టీసీ పూర్తిగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణ పౌరుల హక్కులను కాపాడాలనే నినాదంతో ముందుకు వెళితేనే ఆర్టీసీని రక్షించుకోగలమని అన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ వి.ఎస్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను దెబ్బతీస్తోందన్నారు. సంస్థలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే హక్కు లేకుంటే ఎలా అని అన్నారు. దీనివల్ల కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతుంద న్నారు. ఆర్టీసీలో ట్రేడ్‌యూనియన్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె. రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో సంస్థకు రెండు శాతం నిధులు కేటాయించాలని, ఆర్టీసీలో ప్రజా స్వామ్య హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లాభాపేక్షతో కాకుండా ప్రజాసంక్షేమమే లక్ష్యంగా బస్సులను నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ కె. హనుమంతు ముదిరాజ్, కన్వీనర్ పి.కమల్‌రెడ్డి, సీఐటీయూ కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె. సూర్యం, కె. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment