ఆ జీవితఖైదు రాజ్యాంగ విరుద్ధం
ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బుధవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరవరరావుతో కలసి ఆయ న మాట్లాడారు. ప్రభుత్వం ఏడుగురిని అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా 70 నుంచి 80 రోజులు జైల్లో పెట్టడం అప్రజాస్వామికమన్నారు. తెలం గాణ సీఎం కేసీఆర్ కార్యాలయానికి ప్రజా సంఘాల నేతలు వెళితే కలిసే పరిస్థితి లేదని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు విధించడంతో షాక్‌కు గురయ్యామని.. దీనిపై న్యాయస్థానంలోనే కాక బయట సైతం పోరాటం చేస్తామన్నారు.
ఈ జడ్జిమెంట్‌ను పునః పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. దుర్గప్రసాద్ లాంటి జర్నలిస్ట్, ప్రశాంత్‌రాహి లాంటి వారు ప్రజా ఉద్యమంలో పాల్గొంటే తప్పా అని ప్రశ్నించారు.సాయిబాబాకు క్రిమినల్ అఫెన్స్ లేదన్నారు. సాయిబాబా తీర్పు న్యాయమూర్తి రాసింది కాదని, ఎన్‌ఐఏ రాసిందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో అప్పీల్æ చేస్తామన్నారు. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాస్వామ్యవాదులను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు నిర్బంధించి 75 రోజులుగా సుక్మాజైల్లో రాజ్య నిర్బంధం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతా పోరాటాలు చేయాలన్నారు.