మీడియాతో మాట్లాడుతున్న చుక్కా రామయ్య. చిత్రంలో పొత్తూరి వెంకటేశ్వరరావు, వసంత కన్నబీరన్, హరగోపాల్, రమామెల్కోటే, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, హేమలత
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరావు విడుదలకు ఆదేశించాలని కోరుతూ ఆయన సతీమణి హేమలత భారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగలేఖ రాశారు. 79 ఏళ్ల వయో భారం, అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుపై కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు దేశ, విదేశాల ప్రముఖులు సంఘీభావం తెలిపారు. బహిరంగలేఖకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, వసంత కన్నబీరన్, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ ఈ సమావేశంలో మాట్లాడారు.
ఫాసిజం వేగంగా విస్తరిస్తోంది...
ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని, గత ఐదేళ్లుగా దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేయాలని కోరినవారిలో ఆయన అభిప్రాయాలతో, నమ్మకాలతో విభేదించేవాళ్లు సైతంఉన్నారని చెప్పారు. దేశంలో ఫాసిజం అత్యంత వేగంగా విస్తరిస్తోందని, భవిష్యత్తులో అది మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ కుట్రకేసు మొదలుకొని గత నాలుగున్నర దశాబ్దాలుగా వరవరరావుపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, అన్నింటిలోనూ ఆయనే గెలిచారన్నారు. అక్రమకేసులు మోపినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును జైల్లో ఉంచడం తగదన్నారు. సమావేశంలో జహీరుద్దీన్ అలీఖాన్, కె.కాత్యాయని, దేవీప్రియ, ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి, వసంత కన్నబీరన్ తదితరులు లేఖకు మద్దతుగా మాట్లాడారు.
ఆయన నిర్దోషి...
గత 45 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న వరవరరావు నిర్దోషి అని, ఆయనపై ఇప్పటివరకు బనాయించిన 25 కేసుల్లో 13 కేసుల్లో నిర్దోషి అని న్యాయస్థానాలు ప్రకటించాయని హేమలత తెలిపారు. మిగిలిన 12 కేసులు విచారణ స్థాయికి రాకముందే పోలీసులు ఉపసంహరించుకున్నారన్నారు. పుణే పోలీసులు బనాయించిన భీమా కోరేగావ్ కేసులోనూ ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వా సం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాస్వామికవాదులు, మేధావులతోపాటు అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, శ్రీలంకకు చెందిన పలువురు రచయితలు, మేధావులు సంఘీభావం తెలుపుతూ ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment