అభివృద్ధిని నిర్దేశించేది రాజకీయ నిర్ణయాలే
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజకీయ నిర్ణయాలే ఆర్థిక ప్రగతిని నిర్దేశిస్తాయుని, అవి సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ‘ప్రజల కోసం-స్వావలంబన కోసం-తెలంగాణ ప్రగతి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ 1990 నుంచి ఏపీలో రాజకీయాలపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం ప్రారంభమైందని, క్రమంగా ప్రకృతి వనరులైన భూమి, నీరు, ఇసుక, బొగ్గు, వ్యవసాయం వారి ఆధిపత్యంలోకి వెళ్లడంతో చిన్న చిన్న వృత్తులు దెబ్బతిన్నాయన్నారు. అధికారం కొద్దిమంది చేతుల్లో ఉండాలా? లేక ప్రజలందరికీ దక్కాలా? అనేది వలిక సమస్యగా మారిందన్నారు. తెలంగాణ తలకిందులుగా జరుగుతున్న అభివృద్ధిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అభివృద్ధిలో వాటా దక్కాలంటే కచ్చితమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. మార్కెట్లో ఆటుపోటులను తట్టుకునే శక్తి రైతులకు రావాలని, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలని అన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అమెరికాలోని నైబర్‌హుడ్ స్కూల్ పద్ధతిలోనే తెలంగాణలో కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. సెంటర్ ఫర్ సస్‌టైనబుల్ అగ్రికల్చర్ డెరైక్టర్ డాక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ గత పదేళ్లలో 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిందని, 10 శాతం మంది రైతులు వ్యవసాయ కూలీలుగా మారారని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ సత్యప్రసాద్, టి.రమేష్, ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్.వేణుగోపాల్ ప్రసంగించారు.