కేజీ టు పీజీ వరకు కామన్ విద్యావిధానం అమలు చేయాలి
అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి ప్రొఫెసర్ హరగోపాల్
సిద్దిపేట అర్బన్ : ప్రస్తుత విద్యా వ్యవస్థ మారితేనే దేశం బాగుపడుతుందని, కేజీ టూ పీజీ వరకు కామన్ స్కూల్ విధానం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం అందజేయాలని అఖిల భారత విద్యా పోరాట యాత్ర ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో హరగోపాల్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అన్ని వర్గాల విద్యార్థులకు అందిస్తేనే పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మానవీయ తెలంగాణను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు మనుషుల్ని నిర్మించే కేంద్రాలుగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రజా ఉద్యమాలు, పోరాటాలు లేకుండా అవి జరగవన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో పాఠశాలలు, కళాశాలల స్థాయిలో మొత్తం ప్రణాళికలను, పాఠ్యాంశాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. విద్య యొక్క ప్రధాన లక్ష్యం కుల, మతాలకు అతీతంగా సామాజిక స్పృహ కలిగిన పౌరులను, మేధావులను సృష్టించే విధంగా ఉండాలన్నారు. పిల్లలకు పోషకాహారం, నాలుగు జతల బట్టలు, బూట్లు సమకూర్చి వారికి విద్యను బోధిస్తేనే అర్థమవుతుందని తెలిపారు. అన్ని మతాలను గౌరవించే సమాన, సమాంతర విద్యను అన్ని వర్గాలకు అందించాలని, విద్యలో మత రాజకీయాలను చొప్పించరాదన్నారు.
ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా పరిరక్షణ కమిటీ ఏర్పడి విద్యా పోరాట యాత్రను దేశ వ్యాప్తగా నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ర్టంలోని పది జిల్లాల్లో కూడా ఈ యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. విద్య పరిరక్షణ కోసం సుదీర్ఘంగా వివరించిన వినతిపత్రాన్ని విద్యా మంత్రి కడియం శ్రీహరికి త్వరలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి సభ్యులు డాక్టర్ పాపయ్య, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు పొన్నమల రాములు, రాజారెడ్డి, గోపాల్‌రెడ్డి, డీటీఎఫ్ నాయకులు శ్రీనివాస్, రాజిరెడ్డి, నర్సింలు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖమ్మంపల్లి యాదగిరి, నాయకులు శ్రావణ్, సతీష్, పీవైఎల్ నాయకులు జాన్‌రాజ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బెజ్జంకి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యావ్యవస్థలో మార్పు వస్తేనే అభివృద్ధి
Published Wed, Feb 18 2015 12:50 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement